Manipur Women: మణిపుర్ రణ క్షేత్రమేదైనా ముందుండేది మహిళామణులే!
Women In Manipur: మణిపుర్ ఆందోళనల్లో ఎక్కడ చూసినా మహిళలే ఎక్కువగా కన్పిస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో నారీమణులు ఇలా నిరసనల్లో పాల్గొనడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. దీని వెనుక కథేంటంటే?
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: మణిపుర్ (Manipur)లో నెలకొన్న ఉద్రిక్తతలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి వేలాది మహిళలు (Women in Protest) ఆయన ఇంటికి పోటెత్తారు. ఆయన కాన్వాయ్‌ను చుట్టుముట్టి.. రాజీనామా పత్రాలను లాక్కొని చించేశారు. దీంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇటీవల 1500 మంది మహిళలు సైన్యాన్ని చుట్టుముట్టి.. వారి చేతిలో బందీలుగా ఉన్న మిలిటెంట్లను విడిపించుకుని తీసుకెళ్లారు. ఈ రెండు ఘటనలే కాదు.. జాతుల మధ్య వైరంతో మణిపుర్‌లో తాజాగా చోటుచేసుకున్న ఆందోళనల్లో మహిళలు ముందుంటున్నారు. అయితే, ఇది ఈనాటి మార్పు కాదు.. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన ఆందోళనల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు.
రెండు సార్లు ‘మహిళా యుద్ధాలు’..
1891లో జరిగిన ఆంగ్లో-మణిపుర్ యుద్ధం తర్వాత ఈ ప్రాంతం బ్రిటిష్ సామ్రాజ్యం అధీనంలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే 1904లో మణిపుర్‌లో కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. 17-60 ఏళ్ల మధ్య పురుషులు ప్రతి నెలా 10 రోజుల పాటు ఉచితంగా పనిచేసేలా అప్పటి బ్రిటిష్ ఏజెంట్ లెఫ్టినెంట్ కల్నల్ హెన్రీ సెయింట్ పాట్రిక్ మ్యాక్స్‌వెల్.. ఓ ప్రణాళికను ప్రకటించారు. ఇది తెలుసుకున్న మహిళలు వేలాదిగా రోడ్డెక్కారు. బ్రిటిష్ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మాక్స్‌వెల్ నివాసాన్ని చుట్టుముట్టారు. దీంతో ఇంగ్లీష్ ప్రభుత్వం ఈ విధానంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మహిళలు చేపట్టిన ఈ ఆందోళనను అప్పట్లో ‘నుపి లాన్’గా పిలిచారు. అంటే ‘మహిళా యుద్ధం’ అని అర్థం..!
ఆ తర్వాత 1939లో మరోసారి ‘నుపి లాన్’ ఉద్యమం చోటుచేసుకుంది. అప్పట్లో మణిపుర్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున బియ్యం విక్రయాలు చేపట్టింది. దీంతో స్థానికంగా కొరత ఏర్పడి బియ్యం ధరలు పెరిగాయి. ఫలితంగా మార్కెట్ కుదేలైంది. దీంతో మహిళలు మళ్లీ ఆందోళన బాటపట్టారు. దాదాపు 4వేల మంది మహిళలు రాయల్ దర్బార్ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లారు. దీంతో పరిస్థితిని నియంత్రించేందుకు మణిపుర్ మహరాజ్ అస్సాం రైఫిల్స్‌ను రంగంలోకి దించారు. ఆందోళనకారులను జవాన్లు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఇరు వర్గాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అనేక మంది మహిళలు గాయపడ్డారు. అయినా వారు అక్కడి నుంచి వెళ్లలేదు. దీంతో ఆ మరుసటి రోజే మహరాజ్ బియ్యం ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ యుద్ధం జరిగిన డిసెంబరు 12ను ఇప్పటికీ ‘నుపి లాన్ డే’ నిర్వహిస్తున్నారు.
అన్యాయంపై గళమెత్తిన ‘మీరా పైబిస్’
1970ల్లో మణిపుర్‌లో అక్రమ మద్యం విక్రయాలు, మాదకదవ్ర్యాల వినియోగం విపరీతంగా ఉండేది. దీంతో వీటిని ఎదిరిచేందుకు మహిళలు ‘మీరా పైబిస్’ పేరుతో బృందాలు ఏర్పడ్డారు. వీటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. దీంతో చాలా చోట్ల ఈ అక్రమ మద్యం అమ్మకాలు ఆగిపోయాయి. ఆ తర్వాత అక్రమ చొరబాటుదార్లను అరెస్టు లేదా అదుపులోకి తీసుకునేందుకు వీలుగా సాయుధ బలగాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను వ్యతిరేకిస్తూ కూడా ఈ బృందాలు పోరాడాయి. రాత్రి వేళల్లో టార్చిలు చేతిలో పెట్టుకుని వీరు తమ గ్రామాల్లో గస్తీ నిర్వహించేవారు. యువకులను సైన్యం బలవంతంగా తీసుకెళ్లకుండా తమవారిని కాపాడుకునేందుకు ఇలా చేసేవారు.
2004లో మనోరమ థంగజామ్ అనే మహిళను అస్సాం రైఫిల్స్ సిబ్బంది బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమె ఘోరమైన స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను నిరసిస్తూ అప్పట్లో 12 మంది మహిళలు అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం ముందు నగ్న ప్రదర్శన చేశారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత ఈ మీరా పైబిస్ బృందాలు అనేక సామాజిక సమస్యలపై దృష్టిపెట్టాయి. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య బయటపడినా.. ఈ బృందాలు తమ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నాయి.
ఉక్కు మహిళదీ ఈ రాష్ట్రమే..
ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్ల పాటు సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలది కూడా ఈ రాష్ట్రమే. 2000 నవంబర్ 5న ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆమె నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష 16 సంవత్సరాల పాటు కొనసాగింది. 500 వారాలకు పైగా ఆహారం, నీటిని తిరస్కరించి ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం నిరాహార దీక్ష చేసిన మహిళగా పేరుకెక్కారు. 2016 ఆగస్టు 9న దీక్ష ముగించారు.
తాజా ఆందోళనల్లోనూ కీలకంగా..
రిజర్వేషన్ల విషయంలో మైతేయ్, కుకీల మధ్య వైరం మొదలైంది. ఈ క్రమంలోనే మే 3వ తేదీన జరిగిన గిరిజన సంఘీభావ ర్యాలీ హింసాత్మకంగా మారడం ఘర్షణలకు బీజం వేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఆందోళనల్లోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. చురాచాంద్‌పుర్, చాందేల్ వంటి ప్రాంతాల్లో మహిళలు రోడ్లను నిర్బంధించి నిరసనలు చేపడుతున్నారు. మానవహారాలుగా ముందుండి సాయుధ బలగాలను అడ్డుకుంటున్నారు. ఈ మధ్య దిల్లీలోని కేంద్ర మంత్రి అమిత్ షా నివాసం ముందు జరిగిన ఆందోళన కూడా మహిళా నేతృత్వంలో జరిగినదే.
‘‘ఆందోళనల సమయంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు లేదా ఇద్దరు మహిళలను పంపాలని గ్రామ/కమ్యూనిటీ పెద్దలు అడుగుతారు. వారంతా షిఫ్టుల్లో పనిచేస్తారు. రాష్ట్రంలోని అన్ని జాతుల్లో ఈ విధానం కొనసాగుతోంది. ఒకవేళ ఏ కుటుంబమైనా వారింటి నుంచి మహిళలను పంపించకపోతే వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. ఇది అనధికారిక వ్యవస్థే అయినా.. అనాదిగా కొనసాగుతోంది’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
అమ్మల మార్కెట్.. ఇక్కడ ప్రత్యేకం
అయితే, ఆందోళనల్లోనే కాదు ఇతర రంగాల్లోనూ ఇక్కడి మహిళలు ముందే ఉన్నారు. రాజధాని ఇంఫాల్‌లో ‘ఇమా కెయిథెల్’ పేరుతో ఓ పెద్ద బజార్ ఉంది. ఇది అమ్మల మార్కెట్. ఇందులో ఎక్కడ చూసినా మహిళా విక్రయదారులే కన్పిస్తారు. దాదాపు 3వేల నుంచి 5వేల మంది మహిళలు అనేక ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. ప్రపంచంలోనే మహిళలు నిర్వహిస్తున్న అది పెద్ద మార్కెట్‌గా ఇది గుర్తింపు పొందింది. స్థానికులే గాక.. టూరిస్టులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Justin Trudeau : నిజ్జర్ విషయంలో అమెరికన్లు మాతోనే : జస్టిన్ ట్రూడో
-
Asian Games: షూటింగ్లో మరో రెండు స్వర్ణాలు.. టెన్నిస్‌లో రజతం
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 19,550 ఎగువన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి