
రివ్యూ: ఒరేయ్ బుజ్జిగా...
చిత్రం: ఒరేయ్ బుజ్జిగా
నటీనటులు: రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేశ్, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: ఐ.ఆండ్ర్యూ
నిర్మాత: కె.కె.రాధా మోహన్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్‌కుమార్ కొండ
బ్యానర్: సత్యసాయి ఆర్ట్స్
విడుదల: ఆహా
నటనలో ఈజ్, డైలాగ్ డెలివరీలో చురుకుదనం, వరుస అవకాశాలు, అన్నీ ఉన్నా ఇటీవల కాలంలో సరైన సక్సెస్ రుచి చూడని యువ కథానాయకుడు రాజ్‌తరుణ్. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కొండ విజయ్ కుమార్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అంటే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అదే ‘ఒరేయ్ బుజ్జిగా’. సరిగ్గా థియేటర్‌లో విడుదల చేద్దామనుకునే సమయానికి కరోనా వచ్చి ఆ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు వస్తారో లేదోనన్న సందేహంతో చాలా సినిమాలు ఓటీటీ బాటపడుతున్నాయి. అలా ఎట్టకేలకు ఆహా వేదికగా ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రాజ్ తరుణ్, విజయ్‌కుమార్‌లకు ఈ సినిమా హిట్ టాక్‌ను తెచ్చిపెట్టింది. మాళవిక నాయర్, హెబ్బా పటేల్‌లు ఎలా నటించారు? ఈ బుజ్జిగాడి కథేంటి?
కథంటేంటే: బుజ్జి(రాజ్ తరుణ్) వాళ్ల నాయనమ్మ చనిపోవడంతో ఏడాదిలోగా ఇంట్లో శుభాకార్యం చేయమని పండితుడు చెబుతాడు. దీంతో బుజ్జి తండ్రి కోటేశ్వరరావు(పోసాని మురళీకృష్ణ) కొడుక్కి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయడానికి సిద్ధపడతాడు. మరో వైపు అదే ఊళ్లో ఉండే చాముండేశ్వరి(వాణీ విశ్వనాథ్) తన కుమార్తె కృష్ణవేణి(మాళవిక నాయర్)కి కూడా ఇష్టంలేని పెళ్లి చేయాలనుకుంటుంది. బుజ్జి, కృష్ణవేణిలు ఒకరంటే ఒకరికి తెలియకపోయినా ఇంట్లోని నుంచి పారిపోతూ నిడదవోలులో ఒకే రైలు ఎక్కుతారు. వీరు రైలు ఎక్కడాన్ని గమనించిన ఓ వ్యక్తి ఇద్దరూ కలిసి పారిపోయారని ఊళ్లో ప్రచారం చేస్తాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరుగుతుంది. అదే సమయంలో ఒకే రైలు ఎక్కిన బుజ్జి, కృష్ణవేణిలు శ్రీను, స్వాతిల పేర్లతో ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. మరి వీరి పరిచయం ప్రేమగా ఎలా మారింది? ఈ క్రమంలో బుజ్జి, కృష్ణవేణిల కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి? సృజన(హెబ్బా పటేల్) కథేంటి? చివరకు బుజ్జి, కృష్ణవేణిలు, వారి కుటుంబాలు కలిశాయా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: కన్‌ఫ్యూజన్ డ్రామా/మిస్ కమ్యూనికేషన్ ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. నాయకనాయికలు తమ ఇంట్లో నుంచి పారిపోవడం, యాదృచ్ఛికంగా ఒక చోట కలవడం, వేరు పేర్లతో పరిచయం పెంచుకోవడం ఆ తర్వాత ప్రేమ, చివరకు నిజం తెలిసిన తర్వాత కోపాలు-తాపాలు ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూశాం. ‘ఒరేయ్ బుజ్జిగా’ ఈ తరహా సినిమానే. అయితే, ఆయా సన్నివేశాలను ఎంత ఎంటర్‌టైనింగ్‌గా, యూత్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారన్నదానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు విజయ్ కుమార్ కొండ గట్టి ప్రయత్నమే చేశాడు. అయితే, కథను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రథమార్ధంలో సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. బుజ్జి గురించి కృష్ణవేణి వెతకడం.. కృష్ణవేణి కోసం బుజ్జి ఫేస్‌బుక్‌లో నానా పాట్లు పడటం తదితర సన్నివేశాలు సాదాసీదాగా సాగుతాయి. ఆయా సన్నివేశాలను ఇంకాస్త అలరించేలా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.
నాటకీయ సన్నివేశాలు మినహా మిగిలిన సన్నివేశాలేవీ పెద్దగా ఆకట్టుకోవు. అయితే, విరామ సమయానికి కథను ఊహించని మలుపు తిప్పిన దర్శకుడు అసలు కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లాడు. దీంతో కథ మళ్లీ నిడదవోలుకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి సినిమా ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ నవ్వులు పంచుతాయి. ముఖ్యంగా ఆస్పత్రిలో సప్తగిరి చేసే హడావుడి కడుపుబ్బా నవ్విస్తుంది. శ్రీను తన అసలు పేరు చెప్పడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆయా సన్నివేశాలు చక్కగానే అలరిస్తాయి. నాయక నాయికలు నిజాలు తెలుసుకున్న తర్వాత బలమైన భావోద్వేగాన్ని కలిగించే సన్నివేశం ఒక్కటీ లేదు. ఒక రొటీన్ క్లైమాక్స్‌తో కథ ముగించాడు దర్శకుడు.
ఎవరెలా చేశారంటే: బుజ్జిలాంటి పాత్రలు రాజ్‌తరుణ్‌కు కొట్టిన పిండి. గతంలో తన సినిమాల్లోనే ఇలాంటి పాత్రలు అలవోగా పండించాడు. ఇందులోనూ అంతే. బుజ్జి/శ్రీను పాత్రలను చాలా ఈజ్‌తో నటించాడు. మాళవిక నాయర్ తన నటనతో ఆకట్టుకుంది. హెబ్బా పటేల్‌ది అతిథి పాత్రే అయినా ఉన్నంతసేపూ నవ్విస్తుంది. పోసాని, వాణీ విశ్వనాథ్, నరేశ్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. సప్తగిరి, సత్య తదితరుల కామెడీ చక్కగా పండింది.
అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి. ‘ఈ మాయ పేరేమిటో’, ‘కృష్ణవేణి’ పాటలు యువతను ఆకట్టుకుంటాయి. ప్రవీణ్‌పూడి ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగ ప్రథమ/ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. ఓటీటీ వేదికగా విడుదలయ్యే సినిమాల గురించి ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. చూసే ప్రేక్షకుడికి ఏ మాత్రం బోరు కొట్టినా, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాడు. ఆండ్ర్యూ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. దర్శకుడు విజయ్ కుమార్‌కొండ రాసుకున్న కథ కొత్తదేమీకాదు. కానీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు గట్టిగానే ప్రయత్నించాడు. కొన్ని సన్నివేశాల్లో అతని మార్కు కనపడుతుంది కూడా. అయితే, కథ, కథనాలను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. భావోద్వేగానికి గురి చేసే ఒకట్రెండు సన్నివేశాలు పడి ఉంటే సినిమా మరోలా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు | బలహీనతలు |
+ రాజ్‌తరుణ్, మాళవిక | - కథ, కథనం |
+ కామెడీ | - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు |
+ ద్వితీయార్ధం |
చివరిగా: బుజ్జిగాడు సరదాగా కాసేపు నవ్విస్తాడు!
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
-
Ts-top-news News
Hyderabad News: భాజపాకు రూ.20 లక్షలు.. తెరాసకు రూ.3 లక్షలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Assigned: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు?
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Modi: ప్రజల్లోనే ఉందాం.. ఎన్నికేదైనా గెలుద్దాం