Aamir Khan: రొమాంటిక్‌ సినిమాల్లో నటించేందుకు సిద్ధమే.. కానీ: ఆమిర్‌ఖాన్‌

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  రొమాంటిక్‌ చిత్రాల్లో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Published : 06 Feb 2024 15:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌  ప్రముఖ హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్య్వూలో పాల్గొని రొమాంటిక్‌ చిత్రాల్లోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘‘కథ నచ్చి ఆ పాత్రకు నేను సరిపోతాను అనుకుంటే ఏ జానర్‌ సినిమాలు అయినా చేస్తా. కథకు అవసరమైతే రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటిస్తా.  అయితే, అవి నా వయసుకు తగ్గట్టుగా ఉండాలి. 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించేలాంటి పాత్రలు చేయాలనుకోవడం లేదు’’ అన్నారు.

‘లాల్‌ సింగ్‌ చద్దా’ తర్వాత గత కొన్ని రోజులుగా సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమిర్‌ఖాన్‌ తాజాగా ‘సితారే జమీన్‌ పర్‌’ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం దీని చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌ చివరికి దాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘తారే జమీన్‌ పర్‌’ తరహాలోనే ఇదీ రానుంది. ఆ చిత్రం అందరినీ ఏడిపించిందని కానీ, ఈ సినిమా అందరినీ నవ్విస్తుందని ఆమిర్ ఓ సందర్భంలో చెప్పారు.

 ‘హనుమాన్‌’ మరో రికార్డు.. ఆనందంతో దర్శకుడి పోస్ట్‌

తన మాజీ భార్య కిరణ్‌రావుతో కలిసి పనిచేయడంపై ఆమిర్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘‘మేము చాలా ఆనందంగా ఉన్నాం. విడాకులు తీసుకున్న తర్వాత వారు శత్రువులు అయిపోతారు అని ఎవరైనా చెప్పారా? ఆమె నా జీవితంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తా. వృత్తిపరంగా కలిసే ఉంటాం. ఆమె మంచి మనసున్న తెలివైన మహిళ. అప్పుడప్పుడు నాపై సరదాగా అరుస్తుంటుంది. నేను దానిని ఎంజాయ్‌ చేస్తా’’ అని పేర్కొన్నారు. కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’ (Laapataa Ladies) చిత్రాన్ని ఆమిర్‌ఖాన్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కామెడీ డ్రామాగా రానున్న ఈ చిత్రం టోరంటో ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(టీఐఎఫ్ఎఫ్‌)లో ప్రదర్శించారు. మార్చిలో ఇది విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని