Anji Valguman: ₹5ల భోజనం తిని.. కలను సాకారం చేసుకుని.. అంజి వల్గమాన్‌ సినీ ప్రయాణమిదీ!

2006లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు పొందుతున్న నటుడు.. అంజి వల్గమాన్‌. తన ప్రయాణం ఎలా సాగిందో ‘ఈటీవీ’కి ప్రత్యేకంగా వివరించారు.

Updated : 21 Jun 2023 21:35 IST

జీహెచ్‌ఎంసీ అన్నపూర్ణ క్యాంటీన్లలో రూ.5ల భోజనం చేస్తూ.. సినిమా అవకాశాల కోసం ఆరాటపడిన గద్వాల్ కుర్రాడు తన 15 ఏళ్ల కలను సాకారం చేసుకున్నాడు. ఇవాళ వెండితెరపై కనిపిస్తోన్న తెలంగాణ కథల్లో విభిన్న పాత్రల్లో కనిపిస్తూ, ప్రేక్షకులను నవ్విస్తూ నటుడిగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. అతడే అంజి వల్గమాన్ (Anji Valguman). రంగస్థలం అనుభవంతో నటుడిగా వరుస అవకాశాలు అందుకుంటోన్న ఆయన ‘భీమదేవరపల్లి బ్రాంచి’ (Bheemadevarapally Branchi) చిత్రంతో కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సందర్భంగా తన నట ప్రయాణాన్ని ‘ఈటీవీ’ (ETV)తో ప్రత్యేకంగా పంచుకున్నాడు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..

‘బాబు’ని తీసేశా..!

‘‘నా పూర్తి పేరు అంజి. కొందరు అంజిబాబు అంటుండేవారు. ఇండస్ట్రీలో వేరే అర్థం వస్తుందని ‘బాబు’ని తీసేసి, ఇంటిపేరు వల్గమాన్‌ని కలిపి స్క్రీన్‌ నేమ్‌ని అంజి వల్గమాన్‌గా పెట్టుకున్నా. గద్వాల్‌ సమీపంలోని జమ్మిచేడులో నేను జన్మించా. చదువు అక్కడే పూర్తి చేశా. యక్షగానం, ఒగ్గు కథలు, సినిమాలు చూస్తూ పెరిగా. వాటిల్లో లీనమయ్యేవాణ్ని. చిరంజీవి, బ్రహ్మానందం నటన నాపై చాలా ప్రభావం చూపింది. అయితే, ‘నేను ఏం కావాలి?’ అనే ప్రశ్న నన్ను ఎప్పుడూ వెంటాడుతుండేది. సాంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొన్నా గానీ ఆ దిశగా కెరీర్‌ని మలచుకోవాలని మాత్రం అనుకోలేదు. ఇంటర్‌ చదివే సమయంలో మా కాలేజీలో ఓ స్కిట్‌ని ప్రదర్శించా. చాలామంది నన్ను ప్రశంసించారు. నాలో ఉన్న ప్రతిభ ఏంటో నాకు అప్పుడర్థమైంది’’

ఒక్క డెమోతో గుర్తింపు

‘‘ఆ ఉత్సాహంతో 2006లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టా. సినీ నేపథ్యంలేని వారు పడే కష్టాలన్నీ నేనూ ఎదుర్కొన్నా. ఆ సమయంలో నాకు నటనపై అంతగా అవహగాన లేదు. చిత్రీకరణ ఎలా చేస్తారో తెలియదు. థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సులో జాయిన్‌ అయిన తర్వాత వాటి గురించి పూర్తిగా తెలుసుకోగలిగా. అక్కడి నా సీనియర్‌ ద్వారా ‘సారాయి వీర్రాజు’ సినిమాలో నటించే అవకాశం అందుకున్నా. ఆ తర్వాత ‘మహాత్మ’లో కనిపించా. ఇన్నేళ్లలో ఇండస్ట్రీలో నేను తిరగని ఆఫీసు లేదు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. పలు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించినా రాని గుర్తింపు ‘మెయిల్‌’ చిత్రం కోసం ఇచ్చిన డెమోతో వచ్చింది. నాలో విషయం ఉందని అదే అందరికీ తెలియజేసింది. దర్శకులు నన్ను నమ్మి, తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నందుకు ఇప్పడు చాలా హ్యాపీగా ఉంది’’

ఆ మాట విని షాకయ్యా

‘‘నా తాజా చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’లో నటించే అవకాశం ఓ ఫ్రెండ్‌ ద్వారా వచ్చింది. ఆడిషన్‌ ఇస్తే.. దర్శకుడు రమేశ్‌కు బాగా నచ్చింది. ఏదో చిన్న క్యారెక్టర్‌ ప్లే చేయమని చెబుతారేమో అనుకున్నాగానీ కథ మొత్తం వినిపించి, ‘నువ్వే మెయిన్‌ లీడ్‌గా చేయబోతున్నావ్‌’ అని అనగానే షాకయ్యా. పలు నాటకాల్లో ప్రధాన పాత్రధారి వేషం వేయడంతో ఈ సినిమాలో నటించడం నాకు కష్టమనిపించలేదు’’

నా కెరీర్‌ని మారుస్తుందనుకుంటున్నా..

‘‘ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. అనుకోకుండా వేరే వాళ్ల ఖాతా నుంచి మన బ్యాంకు ఖాతాలో రూ. లక్షలు జమ అయితే.. మన ఆనందానికి అవధులుండవు. అవి ఖర్చయిన తర్వాత తిరిగి ఇవ్వమని.. ఎవరి ఖాతా నుంచి డబ్బుల వచ్చాయో వాళ్లు అడిగితే మన పరిస్థితేంటి?.. ఇలాంటి ఎమోషన్స్‌ చుట్టూ అల్లుకున్న కథ ఇది. దానికి గ్రామీణ నేపథ్యం తీసుకున్నాం. మల్లాపూర్‌ (కరీంనగర్‌)లోనే అధిక భాగం షూటింగ్‌ చేశాం. ఆ గ్రామస్థులతో కలిసి పోయాం. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగేందుకు ఈ సినిమా నాకు బ్రేక్‌ ఇస్తుందని ఆశిస్తున్నా’’

దానికి ఎప్పుడూ సిద్ధమే

‘‘నాకు ఎక్కువగా కామెడీ రోల్స్‌ దక్కాయి. కానీ, ఏ పాత్ర ఇచ్చినా పరకాయ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. తెలంగాణ పల్లె నేపథ్యంలో సినిమాలు వస్తుండడం మంచి పరిణామం. ప్రస్తుతం కథే హీరోగా నిలుస్తోంది. దాంతో, ప్రతి ఒక్కరూ ప్రధాన పాత్రలు పోషించే అవకాశం లభిస్తుంది. నేను ఇటీవల వెలుగులోకి వచ్చా. అప్పటివరకు ఎన్నో కష్టాలు అనుభవించా. తినడానికి కూడా డబ్బుల్లేక ఖాళీ కడుపుతో పడుకున్న రోజులూ ఉన్నాయి. ఎన్నోసార్లు అన్నపూర్ణ క్యాంటీన్లలో రూ.5ల భోజనం చేశా. నా ఎదుగుదలలో కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని