FIR: ‘ఎఫ్‌ఐఆర్‌’ చిత్రంపై ఎంఐఎం ఎమ్మెల్యేల అభ్యంతరం.. తలసానికి ఫిర్యాదు

తమిళ నటుడు విష్ణు విశాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్‌ఐఆర్‌’. తీవ్రవాదం, ఉగ్రదాడి కుట్రలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా తెలంగాణలోని ఎంఐఎం పార్టీ ‘ఎఫ్‌ఐఆర్‌’ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 

Published : 12 Feb 2022 14:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ నటుడు విష్ణు విశాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్‌ఐఆర్‌’. తీవ్రవాదం, ఉగ్రదాడి కుట్రలు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా తెలంగాణలోని ఎంఐఎం పార్టీ ‘ఎఫ్‌ఐఆర్‌’ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎంఐఎం ఎమ్మెల్యేలు సయ్యద్‌ అహ్మద్‌ పాషా, జఫర్‌ హుస్సేన్‌ మేరజ్‌, కౌసర్‌ మొహీదున్‌.. తెలంగాణ  సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ని కలిశారు. ఈ చిత్ర పోస్టర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఓ పదం ముస్లింల మనోభావాలను కించపర్చేలా ఉందంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. చిత్రంపై చర్యలు తీసుకోవాలంటూ తలసానికి వారు మెమోరాండం సమర్పించారు.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పటికే మూడు దేశాలు మాత్రం నిషేధించాయి. మలేషియా, కువైట్‌, ఖతర్‌తో ఈ సినిమా ప్రదర్శనకు అనుమతులు ఇవ్వలేదు. భారత్‌లో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ నుంచి యూ/ఏ సర్టిఫికేట్‌ పొందిన ఈ చిత్రం.. ఆ మూడు దేశాల్లోని స్థానిక సెన్సార్‌ బోర్డుల అనుమతి తీసుకోలేదట. అందుకే ‘ఎఫ్‌ఐఆర్‌’ను నిషేధించినట్లు తెలుస్తోంది.

ఉత్కంఠ రేపే సన్నివేశాలతో ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంటోంది. కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుకొని ఓ సంస్థలో పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తున్న హీరోని పోలీసులు ఉగ్రవాదిగా భావించి అరెస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. అవేంటి? అసలు హీరో ఉగ్రవాదా? అమాయకుడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. హీరో విష్ణు విశాలే ఈ చిత్రాన్ని నిర్మించగా.. మను ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్‌గా మంజిమా మోహన్‌ నటించారు. గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, రైజా విల్సన్‌, రెబా మోనికా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని