Akashvani Review: ఆకాశవాణి రివ్యూ

Akashvani Review: విభిన్న కథా చిత్రంగా ప్రచారమైన ‘ఆకాశవాణి’ సినిమా ఎలా ఉందంటే?

Published : 24 Sep 2021 18:26 IST

చిత్రం: ఆకాశవాణి; నటీనటులు: సముద్రఖని, వినయ్‌ వర్మ, మిమి మధు, తేజ కాకుమాను, మాస్టర్‌ ప్రశాంత్‌ తదితరులు; సంగీతం: కాల భైరవ; సినిమాటోగ్రఫీ: సురేశ్‌ రగుతు; ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌; నిర్మాత: పద్మనాభరెడ్డి;  రచన, దర్శకత్వం: అశ్విన్‌ గంగరాజు; మాటలు: సాయిమాధవ్‌ బుర్రా ; విడుదల: 24-09-2021

కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ మన టాలీవుడ్‌. ఆ ముద్రను క్రమంగా తుడిచేసేందుకు ఈతరం దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండేళ్లుగా సినిమా కథల తీరు మారుతూ వస్తోంది. కమర్షియల్‌ ఫార్ములాకు దూరంగా, వాస్తవానికి దగ్గరగా ఉండే కథలతో సినిమాలొస్తున్నాయి. రాజమౌళి శిష్యుడు అశ్విన్‌ గంగరాజు ‘ఆకాశవాణి’ సినిమాతో అలాంటి ప్రయత్నమే చేశాడు. కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందించిన ఈ సినిమాను పద్మనాభరెడ్డి నిర్మించారు. సముద్రఖని ఓ కీలకపాత్రలో నటించారు. సోనీలివ్‌లో నేరుగా విడుదలైందీ సినిమా. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథేంటంటే: నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండే ఒక అటవీ ప్రాంతం. కొండ-కోనల్లో నివసించే అక్కడి జనానికి దొర మాటే శాసనం. అక్కడే ఒక చెట్టు తొర్రలో ఉండే బండరాయిని దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. ఆ బండరాయి తర్వాత వాళ్లను బతికేంచేది, శాసించేది దొరేనని బలంగా నమ్ముతారు.  గూడెం హద్దు దాటి బయట అడుగుపెడితే దేవుడు కఠినంగా శిక్షిస్తాడని, ప్రాణాలనూ హరిస్తాడనే భయాన్ని దొర వారిలో నూరిపోస్తాడు. ఆ భయాన్నే పెట్టుబడిగా పెట్టి తోటల్లో పనిచేయిస్తూ వాళ్ల శ్రమను దోచుకుంటాడు. బయటి నుంచి ఎవరైనా ప్రవేశించే ప్రయత్నాలు చేసిన వారి నెత్తురు కళ్లజూస్తాడు. కఠినమైన ఆంక్షల మధ్య అమాయకంగా బతుకుతున్న వారి జీవితాల్లోకి మరో దేవుడు వస్తాడు. అయితే బండరాయి రూపంలోనో, మనిషి రూపంలోనో కాదు. మాట్లాడే రేడియో రూపంలో సరికొత్తగా అవతరిస్తాడు.  ఆ రేడియో వచ్చాక వారి జీవితాల్లో ఎలాంటి మార్పొచ్చింద?చీకట్లో బతుకుతున్న ఆ గూడెం ప్రజల్లో చైతన్యం ఎలా కలిగింది? వారి అజ్ఞానం తొలిగిపోయి, దొర అరాచకత్వం ఎలా బయటపడిందనేది మిగతా కథ. 

ఎలా ఉందంటే: రాజమౌళి శిష్యుడైన అశ్విన్‌ గంగరాజు మొదటి సినిమాకే ఇలాంటి భిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం అభినందనీయం. కథగా ఎంచుకున్న పాయింట్‌ ఆకట్టుకున్నప్పటికీ,  దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయడంలో తడబడ్డాడు. సినిమాను రక్తికట్టించేలా తీయడంలో  ఈ యువ దర్శకుడు మెప్పించలేకపోయాడు. అజ్ఞానంలో జీవించే అమాయక ప్రజలు, వారిని మేల్కొలిపేందుకు వచ్చే ఒక హీరో అనే కథాంశంతో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. హీరో స్థానంలో రేడియోను వాడుకోవడమే ఈ కథలో కొత్తదనం. దాని చుట్టూ ప్రేక్షకులను రంజింపజేసే సన్నివేశాలు లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి నిరాశ మిగులుతుంది. సినిమా మొదటి అర్ధగంటపాటు ఆ గూడెం ప్రజల అమాయకత్వాన్ని చూపించడానికే సరిపోయింది. అసలు కథలోకి వచ్చే సరికి ప్రేక్షకుడి ఓపిక నశించిపోతుంది. మొదటి అర్ధభాగమంతా దొర అరచకాలు, అక్కడి ప్రజల అమాయక జీవనం మీదే సన్నివేశాలన్నీ సాగుతాయి. రెండో అర్ధభాగంలో రేడియో వచ్చాక పెద్దగా మార్పేమీ ఉండదు. వారిలో అదే అమాయకత్వం. ఆకాశవాణితో ఏదైనా అద్భుతం జరుగుతుందని ఆశించే ప్రేక్షకుడికి మిగిలేది నిరాశే. చంద్రం మాస్టరు(సముద్రఖని) వచ్చాక సినిమాలో కొంత వేగం పెరుగుతుంది. హిరణ్యకశిపుని కథను సినిమాలో వాడుకున్న విధానం బాగుంది.  క్లైమాక్స్‌లో ఇంకా బలమైన సన్నివేశాలు పడాల్సింది. మంచి కథే అయినా.. సరైన కథనం, థ్రిల్‌కు గురిచేసే సన్నివేశాలు లేక సాధారణ చిత్రంగా మిగిలిపోయింది. కొద్ది సేపు మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన అనుభూతిని మాత్రం ఇస్తుంది.  

ఎవరెలా చేశారాంటే: ‘ఆకాశవాణి’లో నటించినవారంతా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అందరూ తమ సహజ నటనతో సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చారు.  మేకలు కాసే గిడ్డాగా మాస్టర్‌ ప్రశాంత్‌, అతడి తండ్రి రంగడిగా మధు హావభావాలతో ఆకట్టుకున్నారు. దొరగా వినయ్‌వర్మ, చంద్రం మాస్టరుగా సముద్రఖని ఒదిగిపోయారు. గూడెంలో అందరినీ భయపెట్టే సాంబడిగా తేజ కాకమాను నటన బాగుంది. విక్రమార్కుడులో అజయ్‌ పోషించిన టిట్లా పాత్రను గుర్తుచేశాడు. సముద్రఖని, గెటప్‌ శీను పాత్రలను మరింత పకడ్బందీగా రాసుకోవాల్సింది. సాయిమాధవ్‌ బుర్ర రాసిన డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి. ‘కట్టే అయితే ఏంటి? కటిక రాయి అయితే ఏంటి? కష్టాలు తీర్చేది దేవుడే కదా’లాంటి మరొకొన్ని డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. సురేశ్‌ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. మనల్ని కొంతసేపు గూడెం ప్రజల్లోకి తీసుకెళ్లేలా అడవిని చక్కగా చూపించారు. కాల భైరవ అందించిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకు తగినట్లుగానే ఉంది. సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా సినిమా బాగున్నప్పటికీ మొత్తంగా ప్రేక్షకుడిని మెప్పించే కథను అందివ్వడంలో మాత్రం చిత్రబృందం విఫలమైంది. 

బలాలు
నటీనటులు ప్రతిభ
సాంకేతిక బృందం పనితీరు
బలహీనతలు 
- బలమైన సన్నివేశాలు లేకపోవడం
- నిదానంగా సాగే కథనం

చివరగా: ప్రేక్షకుల స్టేషన్‌ను సరిగా ట్యూన్‌ చేయలేకపోయిన ‘ఆకాశవాణి’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు