Balakrishna: సినిమా రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలి

‘‘హైందవ, సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం ‘అఖండ’. తెలుగు ప్రేక్షకులతోపాటు... పొరుగు భాషల నుంచి ఈ సినిమాని వేయినోళ్లా మెచ్చుకున్నారు. భారతదేశం మొత్తానికి కృతజ్ఞతలు చెప్పడానికే ఈ వేడుక

Updated : 13 Mar 2022 08:47 IST

 ‘అఖండ’ శతదినోత్సవంలో బాలకృష్ణ  

‘‘హైందవ, సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం ‘అఖండ’. తెలుగు ప్రేక్షకులతోపాటు... పొరుగు భాషల నుంచి ఈ సినిమాని వేయినోళ్లా మెచ్చుకున్నారు. భారతదేశం మొత్తానికి కృతజ్ఞతలు చెప్పడానికే ఈ వేడుక ఏర్పాటు చేశాం’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు  బాలకృష్ణ. ఆయన నటించిన చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా విడుదలై వంద రోజులైన సందర్భంగా కర్నూలులో కృతజ్ఞత సభని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఇలాంటి శతదినోత్సవం జనం మధ్యలో జరిగి ఎన్నేళ్లయ్యిందో. ఒక మంచి సినిమా చేద్దామనే సంకల్పంతోనే చిత్రాన్ని మొదలుపెట్టాం. ‘సింహా’ చేస్తున్నప్పుడు ‘లెజెండ్‌’ గురించి అనుకోలేదు, ‘లెజెండ్‌’ చేస్తున్నప్పుడు ‘అఖండ’ గురించి అనుకోలేదు. పసిపాపల జోలికి, ధర్మం జోలికి వస్తే ఆ భగవంతుడు ఏదో రూపంలో వస్తాడనే ఓ మంచి సందేశాన్ని ఈ సినిమాతో చెప్పాం. అఖండ విజయాన్నిచ్చిన ప్రేక్షక దేవుళ్లకి, నా అభిమానులకి కృతజ్ఞతలు. ‘సినిమా’ గొప్పది. సరిగ్గా వాడుకుంటే ప్రయోజనాలుంటాయి. సినిమా రంగాన్నీ పరిశ్రమగా గుర్తించాలని మేం ప్రభుత్వాల్ని కోరుతున్నాం’’ అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘పదమూడేళ్ల ప్రయాణం నాదీ, బాలకృష్ణది. మా ప్రతీ సినిమా ఓ ప్రయోగమే. దాన్ని ఆదరించింది ప్రేక్షకులే. బాలకృష్ణ నన్ను ఓ కుటుంబ సభ్యుడిలా భావించేలా చేసింది ఈ సినిమాలే’’ అన్నారు.

పూర్ణ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఇలాంటి సినిమా నాకు దొరకదేమో. నా జీవితాన్ని, నా కెరీర్‌ని మార్చిందీ సినిమా. ప్రగ్యా, శ్రీకాంత్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభవం. అన్‌స్టాపబుల్‌ అనే మాటకి సమానమైన వ్యక్తి అంటే నాకు బాలకృష్ణ గుర్తుకొస్తారు’’ అన్నారు.

ప్రగ్యా జైస్వాల్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పుడున్న రోజుల్లో సినిమా థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకోవడం అంటే చాలా అరుదు. ఇందులో భాగం కావడం నా అదృష్టం. నేను కలిసి పనిచేసినవాళ్లలో ఓ అత్యుత్తమమైన నటుడు బాలకృష్ణ’’ అన్నారు.
శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘కరోనా మహమ్మారి సమయంలో ప్రేక్షకుల్ని థియేటర్‌కి తీసుకొచ్చిన సినిమా ఇది. అఖండ నుంచే ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్‌కి రావడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి అఖండ విజయాన్నిచ్చారు’’ అన్నారు.

మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘భారతీయ సినిమాకి దిక్సూచిలాంటి విజయాన్ని అందించింది ‘అఖండ’. బాలకృష్ణ అభిమానులంతా కాలర్‌ ఎగరేసేలా మరో సినిమాని ఆయనతో చేస్తామ’’న్నారు.

ఈ కార్యక్రమంలో చమ్మక్‌ చంద్ర, శ్రవణ్‌, కోటేశ్వరరావు, చిట్టిబాబు, శివకార్తీక్‌, రాంప్రసాద్‌, నితిన్‌ మెహతా, స్టంట్‌ శివ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని