Alia Bhatt: అలా ప్రవర్తించడం షారుక్‌ నుంచే నేర్చుకున్నా: అలియా భట్‌

తాను నటించిన ప్రతి సినిమా నుంచి ఏదో ఓ కొత్త విషయాన్ని నేర్చుకున్నట్లు హీరోయిన్ అలియా భట్‌ (Alia Bhatt)తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె షారుక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 09 Oct 2023 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt)ఈ ఏడాది జాతీయ అవార్డుకు ఎంపికవ్వడంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఓవైపు బాలీవుడ్‌లో తన హవా చూపుతూనే ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో హాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకులు సంజయ్‌లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali), కరణ్‌ జోహార్‌ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే హీరో షారుక్‌ వల్లే సెట్లో ఎలా మెలగాలో తెలుసుకున్నట్లు చెప్పారు.

తాను చేసిన ప్రతి సినిమా నుంచి ఏదో విషయాన్ని నేర్చుకున్నట్లు అలియా భట్ చెప్పారు. షారుక్‌ (Shah Rukh Khan) గురించి చెబుతూ.. ‘ప్రస్తుతం నేను సెట్‌లో అందరితో ఎలా కలిసిమెలసి ఉంటున్నానో.. అది షారుక్‌ నుంచే నేర్చుకున్నా. ప్రతి సన్నివేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అతడిని చూసి తెలుసుకున్నా. నాపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో షారుక్‌ ఒకరు’ అని అన్నారు. ఇక తాను పనిచేసిన దర్శకుల గురించి చెబుతూ.. ‘‘గంగూబాయి కాఠియావాడి’ సినిమా కోసం మొదటిసారి సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి పనిచేశాను. ఆయన సినిమా సెట్‌కు వెళ్లగానే మనం వేరే ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుంది. అక్కడ ప్రతి సందేహానికి సమాధానం దొరుకుతుంది. కెమెరా ముందు ఏదైనా  చేయగలమనే ధైర్యం వస్తుంది. ఎంతో స్వేచ్ఛ లభిస్తుంది. ఇక కరణ్ జోహర్‌ (Karan Johar) నుంచి గౌరవం నేర్చుకున్నా.  ప్రతి విషయంపై అవగాహన పెంచుకోవడం తెలుసుకున్నా. వీళ్లిద్దరూ భిన్నమైన వ్యక్తులు కానీ, నా జీవితంపై ఎంతో ప్రభావం చూపారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఇద్దరూ నా మెంటర్స్‌’ అని అలియా భట్‌ చెప్పారు. 

శ్రీలీలతో సినిమా.. మా అబ్బాయి కోప్పడ్డాడు: బాలకృష్ణ

ఇక సినిమాల విషయానికొస్తే అలియా భట్‌ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. రణ్‌వీర్‌ సింగ్‌తో నటించిన ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ మంచి విజయాన్ని సాధించింది. అలాగే అలియా అతిథి పాత్రలో నటించిన ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ కూడా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ప్రస్తుతం అలియా ‘జిగ్రా’లో నటిస్తున్నారు. దీనికి ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని