Muthyala subbaiah: ఓ నిర్మాత అపహాస్యం చేశాడు.. అందుకే సినిమాలు మానేశా: ముత్యాల సుబ్బయ్య

ఆయన పేరులోనే కాదు...ఆయన సినిమాల్లోనూ ఆణిముత్యాలు ఉన్నాయి. మోతాదు మించని అభినయం, తెలుగుదనం ఉట్టిపడే సన్నివేశాలు

Updated : 22 Sep 2022 11:42 IST

ఆయన పేరులోనే కాదు... ఆయన సినిమాల్లోనూ ఆణిముత్యాలు ఉన్నాయి. మోతాదు మించని అభినయం, తెలుగుదనం ఉట్టిపడే సన్నివేశాలు, అనుబంధాలకు ప్రాధాన్యమిచ్చే కథ, యాక్షన్‌, కామెడీ, మాస్‌ సమపాళ్లలో మిళితమైన కథనం వెరసి ముత్యాల సుబ్బయ్య (Muthyala Subbaiah) సినిమా. ఎంత పెద్ద హీరోనైనా కథకు అనుగుణంగా ప్రేక్షకులకు చూపించి అద్భుతమైన విజయాలను సాధించిన ఈ సీనియర్‌ డైరెక్టర్‌ ఆలీతో సరదాగా(Alitho Saradaga) కార్యక్రమానికి విచ్చేశారు. ముత్యాల్లాంటి తన సినిమాల గురించి ముత్యాల సుబ్బయ్య ప్రేక్షకులకు చెప్పిన విశేషాలివే..

సెంటిమెంట్‌ సుబ్బయ్య గారు?మీకు ఆ పేరెలా వచ్చింది?

ముత్యాల సుబ్బయ్య: అది ప్రేక్షకులు ఇచ్చిన పేరు. సెంటిమెంట్‌ సినిమాలు తీయడంతో నాకా పేరు స్థిరపడిపోయింది. కానీ, సెంటిమెంటుకే నా సినిమాలు పరిమితం అవ్వలేదు. అలా అయితే నేనిప్పటివరకూ ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. 50 సినిమాలు తీసేవాడినీ కాదు.

మీ మొదటి సినిమా ఏంటి? ఎలా ప్రారంభమైంది?

ముత్యాల సుబ్బయ్య: నా మొదటి సినిమా ‘మూడు ముళ్ల బంధం’(1980). ఆ సినిమాలో ఎనిమిదేళ్ల కుర్రాడితో, పద్దెనిమిదేళ్ల అమ్మాయికి తాళి కట్టించడం లాంటి ప్రయోగాన్ని చేశా. ప్రశంసలైతే వచ్చాయి కానీ, సినిమా ఫ్లాప్‌. దెబ్బకి రెండున్నర సంవత్సరాలు మరో సినిమా లేదు. అప్పుడే టి.కృష్ణ గారి దగ్గర కో-డైరెక్టరుగా చేరా. ఆరేళ్లు కొన్ని సినిమాలకి పనిచేసి మళ్లీ అరుణ కిరణం(1986) తీశా. అది సూపర్‌హిట్‌ అయ్యింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అసలు సినిమా రంగానికి మీ పరిచయం ఎలా జరిగింది?

ముత్యాల సుబ్బయ్య: మా సొంతూరు కే. బిట్రగుంట, ప్రకాశం జిల్లా. కావలిలో డిగ్రీ చదువుతుండగా స్నేహితులతో కలిసి వీధి నాటకాలు వేసేవాడిని. వారి ప్రోత్సాహంతోనే చెన్నై వెళ్లి కో డైరెక్టర్‌గా జాయిన్‌ అయ్యా. తర్వాత కొందరు నిర్మాతల పరిచయాలతో మొదటి సినిమా ప్రారంభమైంది.

చిరంజీవిలాంటి పెద్ద హీరోతో హిట్లర్‌ సినిమా ఎలా తీశారు?

ముత్యాల సుబ్బయ్య: అప్పటికే నేను సెంటిమెంటు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాను. ‘సగటు మనిషి’, ‘అమ్మాయి కాపురం’, ‘మమతల కోవెల’, ‘ఎర్రమందారం’, ‘మామగారు’ లాంటి సూపర్‌హిట్లు అవి. అలా సెంటిమెంటు నా సినిమాల ప్రత్యేకతగా మారింది. అప్పుడు మలయాళంలో మమ్ముట్టి హీరోగా ‘హిట్లర్‌’ సూపర్‌హిట్టయ్యింది. తెలుగు హక్కులను కొన్న ఎడిటర్‌ మోహన్‌గారు హిట్లర్‌(1997) దర్శకత్వ బాధ్యతలు నాకప్పగించారు. సంతోషంగా స్వీకరించి, వెంటనే చిరంజీవి గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పాను.

‘మామగారు’లో ప్రధాన పాత్రకు దాసరిని ఎలా  ఒప్పించారు?

ముత్యాల సుబ్బయ్య: ‘మామగారు’ ఒక తమిళ సినిమాకు రీమేక్‌. దానికీ ఎడిటర్‌ మోహన్‌ గారే నిర్మాత. ఆయన నన్ను పిలిచి తమిళ సినిమా చూపించి మామగారు పాత్రకి ఎవరు బాగుంటారు అని అడిగారు. బాగా తెలిసిన అమాయక ముఖం అయితే నప్పుతుందని చెప్పా. ఆయన వెంటనే గురువుగారైతే(దాసరి) ఎలా ఉంటుందన్నారు. బ్రహ్మాండంగా ఉంటుందన్నా. వెంటనే ఆయన్ని కలిసి కథ చెప్పి ఒప్పించాం. 33 రోజుల్లో ఆ సినిమాను పూర్తి చేశా. సూపర్‌ హిట్టయ్యింది.

మీకు తిరుపతి సెంటిమెంట్‌ అని ప్రచారం ఉంది?ఆ విశేషమేంటి?

ముత్యాల సుబ్బయ్య: చెన్నైకు దగ్గరగా ఉండే పట్టణం. అక్కడికి రావడం, వెళ్లడం సులువుగా అనిపించేది. దాంతో చాలా సినిమాలు తిరుపతిలోనే చిత్రీకరించాం. ప్రేక్షకులు కూడా మా ఊరు కూడా తిరుపతేనేమో అనుకున్నారు. నిజానికి నాకు తిరుపతి సెంటిమెంటు కలిసొచ్చింది. అక్కడి షూటింగ్‌ చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి.

మీరు ఎక్కువగా ఏ హీరోతో సినిమాలు చేశారు?

ముత్యాల సుబ్బయ్య: రాజశేఖర్ హీరోగా ఎక్కువ సినిమాలు చేశా. దాదాపు తొమ్మిది సినిమాలు చేశాను. ‘అరుణ కిరణం’తో ప్రారంభమైన మా ప్రయాణం ‘ఆప్తుడు’ వరకు కొనసాగింది. కోడి రామకృష్ణ గారు కూడా రాజశేఖర్‌తోనే ఎక్కువ తీశారు. నాకంటే ఒకట్రెండు ఎక్కువ తీసుండొచ్చు.

యాంగ్రీమ్యాన్‌గా పరిచయమైన రాజశేఖర్‌ను ఫ్యామిలీ హీరోగా ఎలా మార్చారు?

ముత్యాల సుబ్బయ్య: అదంతా ఆ సినిమా కథలకున్న గొప్పతనమే. బాగా నటించేవాడు. ఆయనది ఓ సినిమా(మా అన్నయ్య) నెల షూటింగ్‌ పూర్తయ్యాక, నన్ను దర్శకుడిగా తప్పుకోమన్నారు. నేను సరే మీ ఇష్టం అని తప్పుకున్నా. కానీ ఆ నిర్మాతలే మళ్లీ ఆప్తుడు సినిమాకి పిలిచి అవకాశం ఇచ్చారు. కానీ అది రీమేక్‌ అవడం వలన తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు.

ఏదో సినిమాకు మీరు బాధపడి ఇండస్ట్రీ నుంచి వెళిపోదామనుకున్నారట?

ముత్యాల సుబ్బయ్య: జగపతిబాబు హీరోగా నటించిన ‘ఒక చిన్న మాట’ సినిమా అది. ‘చరణదాసి’ అనే పాత సినిమా ప్రేరణతో కథ సిద్ధమైంది. షూటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఆ సినిమాలో అన్నీ మార్పులే. సౌందర్యను హీరోయిన్‌గా అనుకుంటే ఇంద్రజను తీసుకొచ్చారు. కథను ఒక కోణంలో సిద్ధం చేస్తే మరో కోణంలోకి మార్చేశారు. నాకు బాధనిపించి వదిలేసి వెళిపోదామనుకున్నా. అసిస్టెంట్‌ డెరెక్టర్స్‌తో కూడా చెప్పేశా. సినిమా ఫ్లాప్‌ అవుతుందని. అన్నట్లుగానే ఆ సినిమా పోయింది.

ఈ సినిమా ఎందుకు తీశామన్న పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా?

ముత్యాల సుబ్బయ్య: దాసరి నారాయణరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి ప్రముఖులు నటించిన పర్వతాలు పానకాలు సినిమా వద్దని చెప్పినా నాతో తీయించారు. వాళ్లిద్దరూ మంచి నటులు. అటువంటి ఆర్టిస్టులతో మంచి సబ్జెక్టు చేద్దామన్నా వినకుండా, కామెడీ జోనర్‌లో సినిమా తీయించారు. అది సరిగా ఆడలేదు. ఆ సినిమా షూటింగ్‌ జరిగినన్ని రోజులు మౌనంగానే ఉన్నా.

‘పవిత్రబంధం’లో బాలసుబ్రహ్మణ్యం పాత్రకి శోభన్‌బాబుని అనుకున్నారంట?

ముత్యాల సుబ్బయ్య: పవిత్ర బంధానికి కాదు. ఆ సినిమాలో బాలు గారి కోసమే ఆ పాత్రను సృష్టించాం. ఆయన ఒప్పుకున్నారు. సూపర్‌ హిట్టయ్యింది. పెళ్లంటే నూరేళ్ల పంట చిత్రంలో బాలు గారి పాత్రలో శోభన్‌బాబుగారు నటించాలి. అది కుదరలేదు. సినిమా పోయింది.

మీరు కెరీర్‌ ప్రారంభంలో సినిమాల్లో నటించారట? అవేంటి?

ముత్యాల సుబ్బయ్య: వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, అరుణకిరణం మొత్తం మూడు సినిమాల్లో చిన్న పాత్రలు చేశాను. దర్శకుడు తేజ ఒక పాత్ర కోసం నన్నడిగారు. సున్నితంగా తిరస్కరించాను. 

గోపీచంద్‌ని హీరోగా పరిచయం చెయ్యాలనే ఆలోచన మీదేనా?

ముత్యాల సుబ్బయ్య: ఆలోచన నాదే. రష్యానుంచి వచ్చి మొదటిసారి నన్ను కలిశాడు. సినిమాల్లో నటిస్తానని అన్నాడు. ఒడ్డూ, పొడుగూ, వాయిస్‌ అన్నీ బాగున్నాయని నేనే తొలివలపు చిత్రంతో పరిచయం చేశాను. నాకు బాగా నచ్చిన సినిమా. ఎందుకంటే రియల్‌ స్టోరీ అది. బాగానే ఆడింది కాని దానికింకా పబ్లిసిటీ ఇచ్చుంటే హిట్టయ్యేదని నా అభిప్రాయం.

టి.కృష్ణ గారితో మీ అనుబంధం ఎలా ఉండేది?

ముత్యాల సుబ్బయ్య: ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన సినిమాలన్నింటికి కో-డైరెక్టర్‌ గా పనిచేశాను. రేపటి పౌరులు సినిమాను నేనే పూర్తి చేశా. అదే సమయంలో నా అరుణకిరణం వందరోజుల వేడుకకు ఆయన అతిథిగా వచ్చారు. నా గురించి మాట్లాడుతూ..‘నేనెన్ని సినిమాలు తీసిన నాకు నచ్చిన డైరెక్టర్‌ సుబ్బయ్య’ అని అన్నారు. నాకు వెంటనే కళ్లనుంచి నీళ్లొచ్చాయి. మా ఇద్దరి అనుబంధం చాలా ప్రత్యేకమైనది.

మీ కెరీర్లో తీసిన పూర్తి స్థాయి యాక్షన్‌ సినిమా ఏంటి?

ముత్యాల సుబ్బయ్య: సుమన్‌తో జయసింహా అనే సినిమా తీశా. పూర్తి స్థాయి యాక్షన్‌ సినిమా తీయాలనే ఉద్దేశంతో తమిళ ప్రొడ్యూసర్లు నన్ను ఆ సినిమాకు ఒప్పించారు. సినిమా బాగా తీసినా కొన్ని కారణాలతో ఆడలేదు. అది ఫ్లాపైనా వాళ్లు నాకిచ్చిన స్ర్కిప్టుతో ‘కలికాలం’ లాంటి సూపర్‌హిట్టు సినిమా తీశా. ఆ సినిమాతోనే సాయికుమార్‌ హీరోగా నిలదొక్కుకున్నాడు.

ప్రస్తుతం మీ కుటుంబ సభ్యులెవరైనా సినిమా రంగంలో స్థిరపడ్డారా?

ముత్యాల సుబ్బయ్య: నాకు ముగ్గురు పిల్లలు. అందరు ప్రైవేటు రంగంలోనే స్థిరపడ్డారు. నేనే సినిమాలు తీయడం ఆపేశాను. ఇక వాళ్లెలా వస్తారు.

ప్రస్తుతం సినిమాలు తీయడం ఎందుకు ఆపేశారు?

ముత్యాల సుబ్బయ్య: నేను చివరిగా తీసిన చిత్రం ఆలయం(2008). ఆ సినిమా విడుదల చేయడంలో ఓ కొత్త నిర్మాత కలగజేసుకుని అపహాస్యం చేశాడు. ఆ తర్వాత పెద్ద నిర్మాతలు కలగజేసుకుని ఆడించినా.. నాకు ఆ వ్యవహారం అసలు నచ్చలేదు. ఇక అప్పట్నుంచి సినిమా తీయలనిపించలేదు.

మీ శిష్యుడు బోయపాటి శ్రీను సినిమాలను చూస్తారా?

ముత్యాల సుబ్బయ్య: చూస్తాను. సూర్యుడు సినిమాకు నా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. కానీ అతని సినిమాలన్ని యాక్షన్‌ జోనర్‌. నా సినిమాలకి భిన్నమైనవి. పోసాని కూడా నా దగ్గర పనిచేశాడు. కొన్ని సినిమాలకు కథలనందించాడు.

సీనియర్‌ దర్శకుడిగా ఇప్పటి సినిమాలపై మీ అభిప్రాయమేంటి?

ముత్యాల సుబ్బయ్య: సినిమా చాలా సున్నితమైన అంశం. చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. చాలా జాగ్రత్తగా తీయాలి. ప్రస్తుతం సినిమాలు తీయడంతో పాటు ప్రచారం కూడా అదే స్థాయిలో జరిపితేనే సినిమా ఆడుతోంది. కాబట్టి సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా చాల ముఖ్యమైన అంశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని