Allari naresh: వినోదాలకు సిద్ధం

‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ థియేటర్లలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అల్లరి నరేశ్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మల్లి అంకం తెరకెక్కించారు.

Updated : 16 Apr 2024 09:26 IST

ఒక్కటీ అడక్కు’ అంటూ థియేటర్లలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అల్లరి నరేశ్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మల్లి అంకం తెరకెక్కించారు. రాజీవ్‌ చిలక నిర్మాత. ఫరియా అబ్దుల్లా కథానాయిక. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను నెట్టింట పంచుకుంది. ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కొత్తదనం నిండిన కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి గోపీ సుందర్‌ సంగీతమందించగా.. సూర్య ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.


ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టేలా..

వినయ్‌, అరుణ్‌, దీప్తి వర్మ ప్రధాన పాత్రల్లో సూర్య తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. యు.శ్రీనివాసుల రెడ్డి, బి.నాగేశ్వర రెడ్డి, వహీద్‌ షేక్‌, కె.పురుషోత్తం రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సాయికుమార్‌ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నుంచి సోమవారం ఓ డైలాగ్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో సాయికుమార్‌ తన ఓటు డబ్బును తానే నిర్ణయించుకున్నట్లు ఆసక్తికరంగా చూపించారు. ‘‘ఇదొక భిన్నమైన వ్యంగ్య రాజకీయ చిత్రం. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకు చాలా దగ్గరగా ఉంటుంది. త్వరలోనే టీజర్‌, ట్రైలర్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించనున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: అభిషేక్‌ రుఫుస్‌, ఛాయాగ్రహణం: నాని ఐనవెల్లి.


ఆటో డ్రైవర్‌ గులాబి

భిన్నమైన కథలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించే హుమా ఖురేషీ .. ఇటీవలే విడుదలైన ‘మహారాణి 3’ సిరీస్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడామె మరో కొత్త కథతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గులాబి’. విపుల్‌ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ మహిళా ఆటో డ్రైవర్‌ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించింది చిత్రబృందం. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘గులాబి’ ప్రయాణం ఆరంభం. అహ్మదాబాద్‌లో షూటింగ్‌ను మొదలుపెట్టాము’’ అనే వ్యాఖ్యలతో ఇన్‌స్టా వేదికగా ఓ ఫొటోను పంచుకుంది హుమా ఖురేషీ. ఇందులో ఆటో డ్రైవర్‌ పాత్రలో కనిపించనుందామె. జ్యోతి దేశ్‌పాండే, విశాల్‌ రానా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని