Cinema news: జగన్‌గారూ.. రాజు తలుచుకుంటే వరాలకు కొదవా?:అల్లు అరవింద్‌

చిత్రపరిశ్రమలో సమస్యలు పరిష్కరించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

Updated : 30 Sep 2021 19:32 IST

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ‘రాజు తలుచుకుంటే వరాలకు కొదవా? దయచేసి నా విన్నపాన్ని ఇండస్ట్రీ విన్నపంగా మన్నించి సమస్యలు పరిష్కరించండి’ అని అన్నారు. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా, ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ తెరకెక్కించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు. జీఏ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల వేడుక జరిగింది.

ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌కు ఇది మొదటి ఫంక్షన్‌. దీని తర్వాత ప్రీరిలీజ్‌ వేడుక, విడుదలైన తర్వాత సక్సెస్‌మీట్‌ తప్పకుండా ఉంటుంది. గీతాఆర్ట్స్‌లో విజయవంతమైన చిత్రాలు మేము కాదు ఇచ్చింది.. ప్రేక్షకులు మాకు ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ధైర్యాన్ని చూసి, బాలీవుడ్‌ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ వేదికగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిగారిని కోరేది ఏంటంటే.. ఫిల్మ్‌ ఇండస్ట్రీ అనేక ఇబ్బందుల్లో ఉంది. రాజు తలుచుకుంటే, వరాలకు కొదవా? దయచేసి మీరు తలుచుకుని, పరిశ్రమలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపమని ఈ వేదికగా కోరుతున్నా. మీరు చిత్ర పరిశ్రమను ఎంత ప్రోత్సహిస్తారో, అన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతాయి. నేను చేసే విన్నపాన్ని ఇండస్ట్రీ విన్నపంగా తీసుకోండి. ఒక మెస్సేజ్‌ను ఎంటర్‌టైనింగ్‌ రూపంలో ఈ సినిమా ద్వారా చెప్పారు. సినిమా విషయంలో ఎక్కడా రాజీపడకుండా చేశారు’’ అని అన్నారు.

అనంతరం అఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘బన్నీ వాస్‌ ఈ కథ నమ్మి సినిమా చేశారు. కచ్చితంగా విభిన్నమైన అనుబంధాలు ఈ కథ ద్వారా మీరు చూస్తారు. థియేటర్‌లో ఒక జంట సినిమా చూస్తుందంటే, కచ్చితంగా నాలుగైదు సార్లు ఒకరినొకరు చూసుకుంటారు. ‘మన మధ్యన కూడా ఇది జరుగుతోంది’ అని మనసులో భావిస్తారని నేను అనుకుంటున్నా. ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్యూ భాస్కర్‌. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించా. అన్ని విభాగాలపై పట్టున్న నిర్మాత బన్ని వాస్‌. పూజాహెగ్డేతో కలిసి పనిచేయడం బాగుంది’’ అని అఖిల్‌ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని