Allu Arjun: ఆ విషయంలో చాలా బాధపడ్డా.. మీరు ధైర్యంగా రండి: అల్లు అర్జున్‌

ఆనంద్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు సాయి రాజేశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 20 Jul 2023 22:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు నటించట్లేదనే బాధ తనకు ఉండేదని ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) పేర్కొన్నారు. ‘బేబీ’ (Baby) సినిమా అప్రిసియేషన్‌ మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్‌ తెరకెక్కించిన చిత్రమిది. ఎస్‌.కె.ఎన్‌ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించింది.

‘బాహుబలి’ తీస్తున్నారా అంటూ జోక్స్‌ వేసేవాణ్ని: అల్లు అర్జున్‌

‘‘ఈ సినిమా నాకు బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. కథ రాసిన విధానం, తీసిన తీరు.. ఇలా ప్రతిదీ నన్నెంతో ఆకట్టుకున్నాయి. దర్శకుడు సాయి రాజేశ్‌ అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన ప్రయాణం నాకు తెలుసు. ఆయన కథ చెబుతానంటే వినేందుకు టైమ్‌వేస్ట్‌ అని అనుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి ఆయన ఈ విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఎప్పుడు.. ఎవరిలోని ప్రతిభ బయటకొస్తుందో ఎవరికీ తెలియదు. ఈ సినిమా వెనుక దర్శకుడు మారుతి కూడా ఉన్నాడు. ఆయనతో నేను జర్నీ చేశా. బందరులో బైక్‌లకు స్టిక్కరింగ్‌ వేసే ఆయన హైదరాబాద్‌ వచ్చి యానిమేషన్‌ నేర్చుకుని, తర్వాత దర్శకుడిగా మారాడు. ఎస్‌.కె.ఎన్‌... చిరంజీవి అభిమాని. ఎంతో చురుకుగా ఉండే అతడిని హైదరాబాద్‌ రమ్మని నా సోదరుడు శిరీష్‌ పిలిచాడు. వచ్చిన తర్వాత ‘ఎక్కడ ఉండాలి?’ అని అడిగితే మా దగ్గర సమాధానం లేదు. నేను అప్పటికి సినిమాల్లోకి రాలేదు. చిరంజీవిగారికి చెందిన ఓ సైట్‌లో నేను డ్యాన్స్‌ చేస్తుండేవాణ్ని. అక్కడే చిన్న రూమ్‌ ఉంటే అందులో ఉండమని చెప్పాం. చాలాకాలం అందులోనే ఉన్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. మూడేళ్ల నుంచి కలిసినప్పుడల్లా ఏం చేస్తున్నావని అడిగితే ‘బేబీ అనే సినిమా తీస్తున్నా బాస్‌’ అని అనేవాడు. అదేమన్నా ‘బాహుబలి’నా ఇన్నేళ్లు తీస్తున్నారంటూ జోక్స్‌ వేసేవాణ్ని. తను మాత్రం ‘ఇది కల్ట్‌ సినిమా బాస్‌’ అని ఎప్పుడూ నమ్మకంగా చెబుతుండేవాడు. కంటెంట్‌ ఉంటే సినిమా చిన్నదైనా, పెద్దదైనా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది’’

సినీ ప్రేక్షకులకు ‘బేబీ’ దర్శకుడు క్షమాపణ

‘‘నేను ఈ వేడుకకు రావడానికి ప్రధాన కారణం వైష్ణవీ చైతన్య. తెలుగమ్మాయిలు సినిమాల్లో నటించట్లేదని బాధపడేవాణ్ని. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో వైష్ణవి నాకు సోదరిగా నటించింది. అయితే, ఆ సమయంలో ఆమెపై నేను ఫోకస్‌ పెట్టలేదు. బాగానే నటిస్తుందనుకునేవాణ్ని తప్ప పెద్దగా మాట్లాడలేదు. ‘ఇలాంటి అమ్మాయి ప్రధాన పాత్రలో సినిమా తీసే రోజు ఎప్పుడొస్తుందో?’ అని అనుకున్నానంతే. అలాంటిది ఆమె హీరోయిన్‌గా నటించిన సినిమా వేడుకలో మాట్లాడడం సంతోషంగా ఉంది. తను ఉత్తమ నటి అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నా. మరోవైపు, శ్రీలీల మంచి అవకాశాలు అందుకుంటోంది. ఇకపై తెలుగమ్మాయిలే తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించాలని ఆకాంక్షిస్తున్నా. నేను ఆహ్వానిస్తున్నా.. మీరు ధైర్యంగా రండి. తెలుగు సినిమా తగ్గేదేలే’’ అని అల్లు అర్జున్‌ అన్నారు.

రాజమౌళి సినిమాలా రివ్యూ ఇచ్చారు: సాయి రాజేశ్‌

‘‘ఓ హీరో ఓ ఇంటర్వ్యూలో నా ‘హృదయ కాలేయం’ సినిమాని ప్రశంసిస్తే.. ఆయనకు నేను థ్యాంక్స్‌ చెప్పా. ‘నీ దగ్గర ఏమైనా కథ ఉంటే చెప్పు’ అని ఆయన మెసేజ్‌ చేశారు. ఆ హీరో ఎవరో కాదు శిరీష్‌. గీతా ఆర్ట్స్‌లో ఆయన్ను కలవడంతో నేను ఏదైనా చేయగలననే ధైర్యం వచ్చింది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆ సంస్థ నాకు తోడుగా నిలిచింది. నేను నిర్మించిన ‘కలర్‌ ఫొటో’ విడుదలైన సమయంలో హిట్టా, కాదా? అనే సందేహంలో ఉన్నప్పుడు అల్లు అర్జున్‌ నన్ను పిలిచారు. దాంతో, సినిమా ఫేట్‌ మారిపోయింది. ‘బేబీ’ కూడా ఆయనకు బాగా నచ్చింది. నన్ను, నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ను ఆహ్వానించి గంటకుపైగా ముచ్చటించారు. రాజమౌళి సినిమా చూసిన అనుభూతి కలిగేలా మాట్లాడారు’’ అని సాయి రాజేశ్‌ తెలిపారు.

నా తల్లిదండ్రులకు సారీ చెబుతా: ప్రియా ప్రకాశ్ వారియర్‌

‘‘నేను జర్నలిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించా. తర్వాత పీఆర్‌గా మారా. అల్లు అర్జున్‌.. చిత్ర పరిశ్రమలో నన్ను నిలదొక్కుకునేలా చేశారు. దర్శకుడు మారుతి సూచనతో ‘ఈరోజుల్లో’ సినిమాని నిర్మించా. దానికీ అర్జున్‌ అండగా నిలిచారు’’ అని ఎస్‌.కె.ఎన్‌. నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని