Animal: ‘యానిమల్‌’.. అది నేను ఊహించలేదు: సందీప్‌ వంగా

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్‌’. ఈ సినిమా విజయోత్సాహంలో ఉన్న ఆయన పలు ఆసక్తికర విశేషాలు చెప్పారు.

Published : 22 Dec 2023 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌లో విశేష క్రేజ్‌ సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). తాజా చిత్రం ‘యానిమల్‌’ (Animal)తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విశేషాలు పంచుకుంటున్నారు. హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సినిమా కలెక్షన్స్‌ గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడారు.

‘వాళ్లకు సినిమా గురించి ఏమీ తెలియదు’.. సినీ విమర్శకులపై సందీప్‌ రెడ్డి వంగా ఆగ్రహం

రణ్‌బీర్‌ మాత్రమే..!

‘‘రాక్‌స్టార్‌’, ‘సంజు’ చిత్రాల్లోని రణ్‌బీర్‌ నటనకు నేను అభిమానినయ్యా. ‘యానిమల్‌’ సినిమాలో హీరోగా రణ్‌బీర్‌ను తప్ప మరొకరిని అనుకోలేదు. ‘కబీర్‌ సింగ్‌’ సినిమా పూర్తయ్యాక ఈ కథాలోచన వచ్చింది. ఇందులోని హీరో పాత్ర రాస్తుంటే రణ్‌బీర్‌ మాత్రమే మైండ్‌లోకి వచ్చేవారు. కొన్ని నెలల తర్వాత కలిసి.. పది నిమిషాలపాటు స్క్రిప్టు వినిపించా. వెంటనే.. సినిమాలో నటించేందుకు ఆయన అంగీకరించారు. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత మరోసారి కలిసి మూడున్నర గంటలపాటు పూర్తి కథ చెప్పా. ‘యానిమల్‌’ సినిమా ప్రయాణంలో మేమిద్దరం చాలా క్లోజ్‌ అయ్యాం. ఆయనతో మళ్లీ కలిసి పనిచేయాలనుంది’’ అని తెలిపారు. కలెక్షన్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకి ప్రేక్షకాదరణ లభిస్తుందని, సుమారు రూ.700 కోట్లు వసూళ్లు చేస్తుందని ముందు నుంచీ అనుకున్నా. కానీ, రూ.800 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇది నేను ఊహించనిది. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సత్తా చాటడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

తండ్రి, కొడుకుల అనుబంధం ఇతివృత్తంగా రూపొందిన ఈ యాక్షన్‌ మూవీ డిసెంబరు 1న విడుదలైంది. హీరో తండ్రిగా అనిల్‌ కపూర్‌, హీరోయిన్‌గా రష్మిక, విలన్‌గా బాబీ దేవోల్‌.. ఇలా ఈ చిత్రంలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది. సందీప్‌.. ‘యానిమల్‌’కు సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. మరోవైపు, ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా ఇప్పటికే ఓ చిత్రాన్ని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని