BRO Movie: ‘నేనేమీ క్లబ్‌లో డ్యాన్స్‌ చేయలేదు.. బ్రో’పై మళ్లీ మాట్లాడిన మంత్రి అంబటి!

Ambati Rambabu: పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘బ్రో’పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Published : 04 Aug 2023 02:01 IST

అమరావతి: తనని కించపరిచే ఉద్దేశంతోనే ‘బ్రో’ (BRO Movie) సినిమాలో ఆ డ్యాన్స్‌ సీన్‌ పెట్టారని, అందుకే తాను మాట్లాడాల్సి వస్తోందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. తనపై ‘సందులో సంబరాల శ్యాంబాబు’ అనే సినిమా తీస్తున్నారని తెలిసిందని, ఒక వేళ ఏదైనా కారణాలతో ఆ సినిమా ఆగిపోతే, తనని సంప్రదించాలని కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘బ్రో’ సినిమా గురించి మళ్లీ విమర్శలు చేశారు.

‘‘నాపై సినిమా తీస్తే, అది నాకే మంచిది. నా పాత్రను హీరోగా పెడతారా? లేక విలన్‌గా చూపిస్తారా వాళ్లిష్టం. జనసేన వాళ్లు రాజకీయాలు మానుకుని సినిమాలు తీస్తామంటే మంచిదే కదా! వాళ్లు తీసే సినిమాలో పవన్‌కల్యాణ్‌ను కూడా నటించమనండి. రోజుకు రూ.2కోట్లు తీసుకుంటానని చెప్పే పెద్దమనిషి ‘బ్రో’లో ఎంత తీసుకున్నారో ఎందుకు చెప్పడం లేదు? అధికారికంగా తీసుకునేది కొంత, అనధికారికంగా తీసుకునేది ఎంతో. ఆయన చేసే పనులు కూడా అలాంటివే’’

‘‘నేను సినిమాల్లో పాపులర్‌ అయి, రాజకీయాల్లో వచ్చిన వాడిని కాదు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ‘బ్రో’ ఒక చచ్చిన సినిమా. కలెక్షన్స్‌ ఏంటో మీకు అర్థమవుతోంది కదా! తిప్పి తిప్పి కొడితే రూ.70కోట్లు లేవు. ‘బ్రో’ సినిమాలో నన్ను ఉద్దేశించి తీశారు కాబట్టే, నేను మాట్లాడుతున్నా. నేనేమీ క్లబ్‌లో డ్యాన్స్‌ చేయలేదు. సంక్రాంతికి భోగిమంట దగ్గర గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్‌ చేశా. నా డ్యాన్స్‌ సినిమాలో పెట్టి, నా పేరు చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదు.  ‘సినిమా సినిమాగా చూడాలి’అని సాయిధరమ్‌తేజ్‌ చెబుతున్నారు. మీరు సినిమాను సినిమాలా తీసి ఉంటే బాగుండేది. ‘వినోదయ సిత్తం’లో ఈ పాత్ర లేదు. కావాలనే ఇందులో పెట్టారు’’ అని తాజాగా అంబటి స్పందించారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని