Oscars 2023: ఆస్కార్స్ 2023 వీక్షకులు ఎంతమందంటే? టాప్-1లో ఎన్టీఆర్!

NTR: ఆస్కార్‌ వేడుక సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా అత్యధికసార్లు ప్రస్తావించిన నటుల జాబితాలో ఎన్టీఆర్‌ టాప్‌-1లో నిలిచారు.

Updated : 14 Mar 2023 12:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 95వ ఆస్కార్‌ అవార్డుల (oscars 2023) కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ (RRR), ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చిత్రాలు అవార్డులతో మురిశాయి. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 18.7 మిలియన్‌ మంది వీక్షించారట. ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఏబీసీ ఈ మేరకు ప్రాథమిక గణాంకాలను వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే వీక్షకుల సంఖ్య 12శాతం పెరిగింది. అయితే, గతంలో జరిగిన కొన్ని వేడుకలతో పోలిస్తే ఇది తక్కువే. ఆస్కార్‌ పురస్కారాల సంబరం మొదలైన తర్వాత హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్‌లలో ప్రసారమైన ‘ది లాస్ట్‌ ఆఫ్ అజ్‌’ ఫినాలేను 8.2మిలియన్ల మంది వీక్షించడం గమనార్హం.

గతంలో నేషనల్‌ ఫుట్‌ బాల్‌ లీగ్‌ ‘సూపర్‌ బౌల్‌’ తర్వాత అత్యధికమంది వీక్షించే కార్యక్రమం ఆస్కార్‌ వేడుక. 2018 వరకూ 30 మిలియన్‌ వ్యూవర్స్‌కు ఏమాత్రం తగ్గేది కాదు. అయితే, 2014 నుంచి ఈ వేడుకను చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 2021లో 9.85 మిలియన్‌ వ్యూవర్స్‌కు పడిపోయింది. గతేడాది 16.6 మిలియన్ల మంది ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు.

ఆస్కార్‌ వేడుకలను వీక్షించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంపైనా విమర్శలు వస్తున్నాయి. ఒక్క సెలబ్రిటీ కూడా ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేయకపోవడం శోచనీయమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఏడాది ఆస్కార్‌ ఉత్తమ చిత్రం రేసులో రెండు బిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లను సాధించిన ‘టాప్‌గన్‌: మావెరిక్‌’, ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీలు ఉన్నాయి. ఆ చిత్ర బృందాలు, నటీనటులు ఎవరూ కనీసం ప్రచారం కూడా చేయలేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 మిలియన్‌ డాలర్లను వసూలు చేసిన ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ ఉత్తమ చిత్రంగా అవార్డుతో సహా ఏడు ఆస్కార్‌లను తన ఖాతాలో వేసుకుంది.

టాప్‌-1 ఎన్టీఆర్‌

ఆస్కార్‌ అవార్డుల వేడుక సందర్భంగా సోషల్‌ మీడియా, న్యూస్‌ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్‌ మేల్‌ మెన్షన్స్‌)లో ఎన్టీఆర్‌ (NTR) నం.1 స్థానంలో నిలిచినట్లు సోషల్‌మీడియాను విశ్లేషించే నెట్‌బేస్‌ క్విడ్‌ తెలిపింది. ఆయన తర్వాత రామ్‌చరణ్‌ ఉన్నారు. ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్‌’ నటుడు కె హుయ్‌ ఖ్యాన్‌,  ఉత్తమ నటుడు బ్రెండన్‌ ఫ్రేజర్‌ (ది వేల్‌), అమెరికన్‌ యాక్టర్‌ పెడ్రో పాస్కల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది. ఆ తర్వాత ‘ది ఎలిఫెంట్‌ ‘విస్పరర్స్‌’, ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌’, ‘అర్జెంటీనియా 1985’ చిత్రాలు ఉన్నాయి. ఇక నటీమణుల విషయానికొస్తే, మిషెల్‌ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్‌, ఎలిజిబెత్‌ ఓల్సెన్‌, జైమి లీ కర్టిస్‌లు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు