Good Touch and Bad Touch: కేవలం సీరియల్‌ మాత్రమే కాదు.. సందేశమూ ఇచ్చారు.. నెటిజన్ల ప్రశంసల వెల్లువ

గుడ్‌ టచ్‌ - బ్యాడ్ టచ్‌ (Good Touch Vs Bad Touch) గురించి చిన్నారులకు అర్థమయ్యేలా ‘గువ్వా గోరింక’ టీమ్‌ తీర్చిదిద్దిన ఎపిసోడ్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 05 Apr 2024 16:49 IST

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసిన వారినుంచే పిల్లలు ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో పిల్లలకు శరీర అవయవాల గురించి అవగాహన కల్పించడం చాలా అవసరం. శరీరానికి సంబంధించి సొంతంగా కొన్ని నియమాలు ఉంటాయని పిల్లలకు తెలియజేయాలి. వాటిని ఇతరులు అతిక్రమిస్తున్నప్పుడు స్పందించడమే కాదు, తక్షణం వ్యతిరేకించడమెలాగో నేర్పించాలి. సరిగ్గా ఇదే పనిచేశారు ‘గువ్వా గోరింక’ (Guvva Gorinka) ధారావాహిక బృందం.  గుడ్‌ టచ్‌ - బ్యాడ్ టచ్‌ (Good Touch Vs Bad Touch) గురించి చిన్నారులకు అర్థమయ్యేలా ఓ ఎపిసోడ్‌ను తీర్చిదిద్దారు. తాజాగా ప్రసారమైన ఈ ఎపిసోడ్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల వేదికగా ధారావాహిక బృందానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వినోద రంగంలో ధారావాహికలకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ విషయమైనా మహిళా ప్రేక్షకులకు అవి అత్యంత దగ్గర అవుతుంటాయి. సినిమాలతోనూ, సీరియల్స్‌తోనూ సందేశాలు ఇవ్వవచ్చని ఈ ఎపిసోడ్‌ ‘గువ్వా గోరింక’ ధారావాహిక బృందం నిరూపించింది. కుటుంబమంతా కూర్చొని చూసే సీరియల్స్‌ ద్వారా ఇలాంటి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘భగవంత్‌ కేసరి’ మూవీలోనూ గుడ్‌ టచ్‌ - బ్యాడ్ టచ్‌ గురించి వివరిస్తూ చెప్పిన సీన్‌ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవడమే కాదు, ఈ అంశంపై మరింత అవగాహన కల్పించేలా చేసింది. అప్పటినుంచి పలువురు ఉపాధ్యాయులు సైతం పాఠశాలల్లో ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ‘గువ్వా గోరింక’ టీమ్‌ మరో అడుగు ముందుకువేసి, లక్షల మంది చూసే తమ ధారావాహిక ద్వారా అవగాహన కల్పించింది. ‘గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌’ అవగాహన ఎపిసోడ్‌ చూడాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ క్లిక్‌ చేయండి ఎపిసోడ్‌ 418


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని