Bhagavanth Kesari Movie Review: రివ్యూ: భగవంత్‌ కేసరి.. బాలకృష్ణ యాక్షన్‌ డ్రామా ఎలా ఉంది?

Bhagavanth Kesari Movie Review: బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన మూవీ ఎలా ఉందంటే?

Updated : 19 Oct 2023 13:00 IST

Bhagavanth Kesari Movie Review| చిత్రం: భగవంత్‌ కేసరి; నటీనటులు: బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌, ప్రియాంక జవాల్కర్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, రఘుబాబు, జాన్‌ విజయ్‌, వీటీవీ గణేష్‌ తదితరులు; సంగీతం: ఎస్‌. తమన్‌; సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ ప్రసాద్‌; ఎడిటింగ్‌: తమ్మిరాజు; నిర్మాత: సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది; బ్యానర్‌: షైన్‌ స్క్రీన్స్‌; రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి; విడుదల: 19-10-2023

యాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకు సిద్ధమే అంటారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna). ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇక కామెడీని యాక్షన్‌తో మిక్స్‌ చేసి కథను నడిపించడంలో అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) శైలి భిన్నం. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ అంటే మంచి అంచనాలు ఉంటాయి. అందుకు తగినట్లుగానే ‘భగవంత్‌ కేసరి’ అంటూ ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి గురువారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?(Bhagavanth Kesari Movie Review) ప్రేక్షకులను మెప్పించిందా?

క‌థేంటంటే: నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి (బాల‌కృష్ణ) అడ‌వి బిడ్డ‌. ఓ కేసులో జైల్లో శిక్ష అనుభ‌విస్తున్న‌ప్పుడు జైల‌ర్ (శ‌ర‌త్‌కుమార్‌) కూతురు విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ విజ్జి పాప (శ్రీలీల‌)తో అనుబంధం ఏర్ప‌డుతుంది.  విజ్జిపాప‌ని ఆర్మీలో చేర్చాల‌నేది త‌న తండ్రి క‌ల. అనుకోకుండా జైల‌ర్ మ‌ర‌ణించ‌డంతో విజ్జిపాప బాధ్య‌త‌ల్ని భ‌గ‌వంత్ కేస‌రి తీసుకుంటాడు. ఆమెని ఓ సింహంలా త‌యారు చేయాల‌ని నిర్ణ‌యిస్తాడు. ఆ ప్ర‌య‌త్నం ఎలా సాగింది?సైకాల‌జిస్ట్ కాత్యాయ‌ని (కాజ‌ల్) ఎలా సాయం చేసింది? ఇంత‌కీ  భ‌గ‌వంత్ కేస‌రి జైలుకి ఎందుకు వెళ్లాడు?ఆయ‌న గ‌త‌మేమిటి?రాజ‌కీయ నాయ‌కుల్ని త‌న గుప్పెట్లో పెట్టుకుని ప్రాజెక్ట్ వి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న బిలియ‌నీర్ రాహుల్ సాంఘ్వీ (అర్జున్ రాంపాల్‌)తో ఉన్న వైరం ఏమిట‌నేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: అగ్ర హీరోల‌తో సినిమా అన‌గానే ద‌ర్శ‌కులు చాలా వ‌ర‌కు సేఫ్ గేమ్ ఆడ‌టానికే ప్ర‌య‌త్నిస్తుంటారు. ఆ హీరోల తాలూకు ఇమేజ్‌ని వాడుకుంటూ అభిమానుల్ని మెప్పిస్తే చాల‌న్న‌ట్టుగా ఫార్ములా సినిమాలు తీయ‌డానికే మొగ్గు చూపుతుంటారు. కానీ, యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ‘భ‌గ‌వంత్ కేస‌రి’తో (bhagavanth kesari review) ఓ కొత్త ప్ర‌య‌త్నం చేశాడు. ఆడ‌బిడ్డ‌ని సింహంలా త‌యారు చేయాలి అనే విష‌యాన్ని బాల‌కృష్ణ (Balakrishna)లాంటి ఓ అగ్ర క‌థానాయ‌కుడితో చెప్పించారు. నేటి స‌మాజానికి చాలా అవ‌స‌ర‌మైన గుడ్ ట‌చ్ బ్యాడ్ ట‌చ్ వంటి కీల‌క‌మైన అంశాన్ని స్పృశిస్తూ శ‌క్తిమంత‌మైన సినిమా మాధ్య‌మం బాధ్య‌త‌ని చాటి చెప్పారు. ఇలాంటి విష‌యాలు స్టార్ హీరోల సినిమాల‌తో చ‌ర్చ‌కొస్తే ఆ ప్ర‌భావం వేరుగా ఉంటుంది. ఆ విష‌యంలో క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ‌ని అభినందించాల్సిందే. అలాగ‌ని ఈ సినిమా సందేశాల‌కే ప‌రిమితం కాలేదు. అభిమానుల్ని, కుటుంబ ప్రేక్ష‌కుల్ని మెప్పించే హీరోయిజం, భావోద్వేగాల్ని జోడించి వినోదం పంచుతుంది. క‌థ‌లో లీనం చేయ‌డానికి కాస్త స‌మ‌యం తీసుకున్నారు ద‌ర్శ‌కుడు. బాల‌కృష్ణ‌, శ్రీలీల క‌లిసిన‌ప్ప‌ట్నుంచి క‌థ‌లో వేగం పెరుగుతుంది. చిచ్చా, బిడ్డా అంటూ ఆ ఇద్ద‌రూ క‌లిసి చేసిన సంద‌డి సినిమాకి హైలైట్‌.

సైకాల‌జిస్ట్ కాత్యాయ‌ని, భ‌గ‌వంత్ కేస‌రి మ‌ధ్య స‌న్నివేశాలతో ప్ర‌థ‌మార్ధం స‌ర‌దాగా సాగుతుంది. కాలేజీలో విజ్జిపాప‌ని భ‌య‌పెట్టే స‌న్నివేశం నుంచి క‌థ మ‌రింత వేగం అందుకుంటుంది. కుటుంబ క‌థ‌గా మొద‌లైన ఈ సినిమా ఆ త‌ర్వాత యాక్ష‌న్ డోస్ పెంచుతూ వెళ్లింది. అడ‌విలో ఊచ‌కోత గురించి చెప్పే స‌న్నివేశాలు, విరామ స‌మ‌యంలో వ‌చ్చే పోరాట ఘ‌ట్టాలు ద్వితీయార్ధంపై ఆస‌క్తిని పెంచుతాయి. (bhagavanth kesari movie review in telugu) భ‌గ‌వంత్ కేస‌రికీ, విజ్జిపాప‌కీ మ‌ధ్య భావోద్వేగ స‌న్నివేశాలు ద్వితీయార్ధానికి ప్ర‌ధాన‌బ‌లం. అప్ప‌టికే  చెప్పాల్సిన క‌థంతా పూర్తయినా ద‌ర్శ‌కుడు తండ్రీ కూతుళ్ల బంధం చుట్టూ స‌న్నివేశాల్ని మ‌లిచి మిగిలిన సినిమాని న‌డిపించారు. ద్వితీయార్ధంలో గుడ్ ట‌చ్ బ్యాడ్ ట‌చ్ గురించి చెప్పించిన అంశాలు కీల‌కం. ‘మా అడ‌విలో మృగాలు ఉంటాయ‌ని బోర్డ్ రాసి ఉంటుంది. కానీ, స‌మాజంలో అలా కాదు.. ఆవుల్లా క‌నిపించే న‌క్క‌లు ఉంటాయి. మృగం మ‌నిషిగా మార‌డం చాలా క‌ష్టం. కానీ, మ‌నిషి మాత్రం ఆడ‌బిడ్డ‌ని చూస్తే చాలు మృగంలా మారిపోతాడు’ అంటూ చెప్పే సంభాష‌ణ‌లు ఆలోచింప‌జేస్తాయి. సుదీర్ఘంగా సాగే ప‌తాక స‌న్నివేశాలు అభిమానుల్ని మెప్పిస్తాయి. ఈ మ‌ధ్య వ‌స్తున్న బాల‌కృష్ణ సినిమాల‌కి భిన్నంగా, బ‌ల‌మైన సందేశం, భావోద్వేగాల‌తో రూపొందిన సినిమా ఇది.

ఎవ‌రెలా చేశారంటే: బాల‌కృష్ణ భిన్న కోణాల్లో సాగే పాత్ర‌లో క‌నిపిస్తారు. ఆయ‌న న‌ట‌న, లుక్ సినిమాకి హైలైట్‌. తెలంగాణ యాస‌లో ఆయ‌న చెప్పిన సంభాష‌ణ‌లు కూడా ఆక‌ట్టుకుంటాయి. ఇందులో పోరాట ఘ‌ట్టాలు కూడా ఇదివ‌ర‌క‌టి సినిమాల్లాగా కాకుండా స‌హ‌జంగా ఉంటాయి. (bhagavanth kesari movie review in telugu) శ్రీలీల‌కి ద‌క్కిన ఓ మంచి అవ‌కాశాన్ని ప‌క్కాగా స‌ద్వినియోగం చేసుకుంది. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ, యాక్ష‌న్ ఘ‌ట్టాల్లోనూ ఆమె ప్ర‌తిభ ఆక‌ట్టుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాల‌తో  మ‌రింత‌గా క‌ట్టిప‌డేసింది.  రాహుల్  సాంఘ్వీ పాత్ర‌లో అర్జున్ రాంపాల్  న‌ట‌న మెప్పిస్తుంది.  కాజ‌ల్  పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేక‌పోయినా బాల‌కృష్ణ‌కి త‌గిన జోడీ అనిపించుకుంటుంది.

మాస్ హీరోల సినిమాలు అన‌గానే హీరో-హీరోయిన్ల డ్యూయెట్లు, మ‌సాలా పాట‌లు గుర్తొస్తాయి. కానీ, ఇందులో వాటి జోలికి వెళ్లలేదు. క‌థ‌లో భాగంగానే పాట‌లు, పోరాట ఘ‌ట్టాల్ని మ‌లిచారు. ర‌విశంక‌ర్‌, శ్రీనివాస్‌, ముర‌ళీధ‌ర్ గౌడ్, బ్ర‌హ్మాజీ  త‌దిత‌ర న‌టులు పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. కెమెరా, సంగీతం, ప్రొడ‌క్ష‌న్ డిజైన్  త‌దిత‌ర సాంకేతిక విభాగాల‌న్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి.  (bhagavanth kesari movie review in telugu) ఎడిటింగ్ ప‌రంగా మ‌రికొన్ని క‌స‌ర‌త్తులు చేయొచ్చేమో అనిపిస్తుంది.  ఆరంభ స‌న్నివేశాలు కొంచెం సినిమాటిక్‌గా, క‌థ‌నం ఆస‌క్తిని రేకెత్తించక‌పోయినా మొత్తంగా చూస్తే అనిల్ రావిపూడి ర‌చ‌న మెప్పిస్తుంది. ముఖ్యంగా సంభాష‌ణ‌లు సినిమాకి ప్రధాన బలం. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + బాల‌కృష్ణ న‌ట‌న, శ్రీలీల
  • + క‌థాంశం.. సంభాష‌ణ‌లు, భావోద్వేగాలు
  • + ప‌తాక స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ప్ర‌థ‌మార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
  • చివ‌రిగా...: భ‌గ‌వంత్ కేస‌రి... యాదుంటాడు (bhagavanth kesari movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని