Bhagavanth Kesari: ‘భగవంత్‌ కేసరి’ సీక్వెల్‌పై స్పందించిన అనిల్‌ రావిపూడి.. ఆయన ఏమన్నారంటే?

దసరా కానుకగా కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘భగవంత్‌ కేసరి’ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ ఈవెంట్‌ నిర్వహించింది. 

Published : 24 Oct 2023 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). కాజల్‌ (kajal), శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. నిర్మాత దిల్‌ రాజు (Dil Raju), దర్శకురాలు నందిని రెడ్డి (Nandini Reddy) తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. తనతో కలిసి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌ తీసే ధైర్యం తనకు లేదన్నారు. ఈ బరువు మోసినందుకే చాలా నలిగిపోయానని, సీక్వెల్‌ తీయగలిగే శక్తిని బాలకృష్ణ గారు నాకిస్తే వెంటనే తీస్తానని చెప్పారు.

శ్రీలీల వారిని గుర్తుచేసింది: దిల్‌ రాజు

‘‘మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌ రావిపూడి ఇప్పటికే 5 సినిమాలు చేశాడు. ‘భగవంత్‌ కేసరి’ గురించి నాకు ఎప్పుడో చెప్పాడు. తెలంగాణ మాండలికంలో బాలకృష్ణ సంభాషణలు చెబితే చాలా కొత్తగా ఉంటుందన్నా. ముందు నుంచీ ‘బ్రో ఐ డోంట్‌ కేర్‌’ని టైటిల్‌ అనుకుని తర్వాత ‘భగవంత్‌ కేసరి’గా మార్చాడు. ఎక్కువగా ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు తీసే అనిల్‌ ఇలాంటి బలమైన కథను రాయడం గొప్ప విషయం. నటిగా శ్రీలీలకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు వరకు శ్రీలీల అంటే డ్యాన్స్‌ అనేవారు. కానీ, ఇందులోని ఆమె నటన జయసుధ, జయప్రద, శ్రీదేవిలను గుర్తు చేసింది. బాలకృష్ణ డెడికేషన్‌తో నటించారు. ఇది లాంగ్‌రన్‌ ఫిల్మ్‌’’ అని దిల్‌ రాజు అన్నారు.

అనిల్‌, బాలకృష్ణకు హ్యాట్సాఫ్‌: నందిని రెడ్డి

‘‘నేను, అనిల్‌ రావిపూడి బాలకృష్ణకు అభిమానులం. ఆయన సినిమాల ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోలో మేం కలుసుకునే వాళ్లం. బాలకృష్ణతో ఎప్పుడు సినిమా తీస్తావ్‌ అని అడిగితే.. ‘నేనెప్పుడు చేసినా అది మీరంతా కాలర్‌ ఎగరేసేలా ఉంటుంది’ అని అనిల్‌ సమాధానమిచ్చేవాడు. ఇప్పుడదే పని చేస్తున్నా. గొప్ప సందేశం ఉన్న ఇలాంటి కథను తెరకెక్కించినందుకు అనిల్‌కు, నటించినందుకు బాలకృష్ణకు హ్యాట్సాఫ్‌’’ అని దర్శకురాలు నందిని రెడ్డి అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని