Bhagavanth Kesari: దసరాకి ముందు డబుల్‌ ధమాకా ఇస్తున్నాం!

‘‘పన్నుల రూపంలో ఆదాయాన్నిచ్చే సినీ రంగాన్ని ప్రభుత్వాలు పారిశ్రామిక రంగంలో ఓ భాగంగా గుర్తించాలి’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘భగవంత్‌ కేసరి’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి హనుమకొండలో జరిగింది.

Updated : 09 Oct 2023 13:38 IST

- ‘భగవంత్‌ కేసరి’ వేడుకలో బాలకృష్ణ

‘‘పన్నుల రూపంలో ఆదాయాన్నిచ్చే సినీ రంగాన్ని ప్రభుత్వాలు పారిశ్రామిక రంగంలో ఓ భాగంగా గుర్తించాలి’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ‘భగవంత్‌ కేసరి’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ఆదివారం రాత్రి హనుమకొండలో జరిగింది. బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌ జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. అర్జున్‌ రాంపాల్‌ ప్రతినాయకుడిగా నటించారు. షైన్‌స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. యువ దర్శకులు వంశీ పైడిపల్లి, గోపీచంద్‌ మలినేని, బాబీ ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘ఎవడ్రా దేవుడు... బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆవిడే వంద దేవుళ్ల లెక్క’ అంటూ ట్రైలర్‌లో బాలకృష్ణ చెప్పిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. వేడుకలో కాజల్‌, శ్రీలీల కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆడిపాడటం ఆకట్టుకుంది.

  • బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకోసం తొలిసారి తెలంగాణ మాండలికంలో సంభాషణలు చెప్పా. ఆ నేపథ్యంలోనే ఈ సినిమా కథ నడుస్తుంది. ఎప్పుడూ కొత్తదనాన్ని అందించాలనే తాపత్రయం నాన్న దగ్గరి నుంచి వంశపారంపర్యంగా వస్తోంది. ‘అఖండ’ తర్వాత ఇకపై ఏం చేస్తాడనుకున్న తరుణంలో ‘వీరసింహారెడ్డి’ చేశా. అదీ రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత ఏమిటి అనుకున్న సమయంలో సరైన సినిమా దొరికింది. అనిల్‌ దర్శకత్వంలో ఈ సినిమా చేయడం నాకు బాగా నచ్చింది. ఇందులో ఆశ్చర్యరకమైన విషయాలు చాలా ఉన్నాయి. దసరాకి ముందు డబుల్‌ ధమాకా ఇవ్వబోతున్నాం. అది ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తుంది. కథలో ఎంతో సీరియస్‌ విషయాన్ని స్పృశించినా మధ్యలో నా శైలి కామెడీ ఉంటుంది. అందం, నటనా ప్రతిభ ఉన్న కాజల్‌తో నటించాలని ఎదురు చూసేవాణ్ని. ఆ అవకాశం ఈ సినిమాతో కుదిరింది. శ్రీలీల  గర్వించదగిన నటి. ఎన్నో రకాల సినిమాలు చేస్తూ ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర పోషించింది. నాకూ అర్జున్‌ రాంపాల్‌కీ మధ్య మంచి సన్నివేశాలున్నాయి. ‘రాజు తన వెనకున్న వందల మంది మందని చూస్తాడు. కానీ మొరటోడు వాడికున్న ఒకే ఒక గుండెని చూస్తాడు’ అనే డైలాగ్‌ ఈ సినిమాలో ఉంటుంది. అవన్నీ వింటే పండగే. సెంటిమెంట్స్‌, డైలాగులు, పాటలు, ఫైట్లు అన్నీ ఉంటాయి’’ అన్నారు.
  • కాజల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. స్ఫూర్తిదాయకమైన బాలకృష్ణతో కలిసి పనిచేయడం ఎంతో గౌరవం. అనిల్‌ రావిపూడితో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. శ్రీలీల ఎంతో ప్రతిభావంతురాలు’’ అన్నారు.
  • ‘‘ఈ సినిమాలో నేను వరంగల్‌ అమ్మాయిగా కనిపిస్తా. ఈ అందమైన కథలో నేను విజ్జి పాప పాత్ర చేశా. అందుకే ఆ పాత్రలాగే ఈ వేడుకకి వచ్చా. ఈ పాత్రని తీర్చిదిద్దిన దర్శకులు అనిల్‌కి కృతజ్ఞతలు. మనసుల్ని తాకే పాత్ర ప్రతి సినిమాలో దొరకదు. అలాంటి అందమైన పాత్రని ఇందులో చేశా. నా జీవితంలో ఏ అనుభవాలైతే లేవో, అది ఈ సినిమాతో ఇచ్చారు.ఈ సినిమాని అందరూ చూడాలి’’ అన్నారు శ్రీలీల.
  • దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘‘అనిల్‌ తర్వాత నేను బాలకృష్ణ సర్‌తో సినిమా చేయబోతున్నా. అది కూడా చాలా ఏళ్లు గుర్తుంటుంది. ‘భగవంత్‌ కేసరి’ అనిల్‌ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. గ్లామర్‌, పరిణతి కనబరుస్తూ నటిస్తున్నారు కాజల్‌. శ్రీలీల పేరు వినబడుతూనే ఉంది. నిర్మాతలు, చిత్రబృందానికి నా అభినందనలు’’ అన్నారు.
  • గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ‘‘అనిల్‌  ఇప్పటిదాకా చేసిన సినిమాలు వేరు, ఇది వేరు. బాలయ్య బాబు చాలా కొత్తగా ఉన్నారు. ఒక అభిమానిగా తీశాడు అనిల్‌. ట్రైలర్‌ చాలా బాగుంది’’ అన్నారు.
  • అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘‘మేకింగ్‌ పరంగానూ, బడ్జెట్‌ పరంగా ఎంతో స్వేచ్ఛనిచ్చారు నిర్మాతలు. ఆ ఫలితం ఎలా ఉంటుందో చూస్తారు. కాజల్‌తో తొలిసారి కలిసి పనిచేశా. ఇందులో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంది. అర్జున్‌ రాంపాల్‌ ఈ సినిమాకి ఆయన తెలుగు నేర్చుకుని డబ్బింగ్‌ చెప్పారు. భగవంత్‌ కేసరి, విజ్జిపాప మధ్య భావోద్వేగ ప్రయాణం చాలా బాగుంటుంది. శ్రీలీల విజ్జిపాపగా చాలా బాగా నటించారు. బాలయ్య బాబు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. కొత్త పాత్ర ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఓ స్టూడెంట్‌లాగా నేనేం చేయాలని తపిస్తూ పనిచేస్తుంటారు. నేను రాసిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ కష్టపడ్డారు. బాలయ్యబాబుతో ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాంప్రసాద్‌, వెంకట్‌, తమ్మిరాజు, కాసర్ల శ్యామ్‌, జాన్‌ విజయ్‌, మురళీధర్‌, శ్రవణ్‌, జయరాం, చిట్టి, ఆనంద్‌రాజ్‌, బేబి నైనిక తదితరులు పాల్గొన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘‘తెలంగాణలో దసరా కంటే పెద్ద పండగ లేదు. ‘భగవంత్‌ కేసరి’ సినిమాతో ఈ పండగని అందరూ ఆస్వాదిస్తారు. కాజల్‌, శ్రీలీల బతుకమ్మ ఆడుతుంటే చూడ్డానికి ముచ్చటగా అనిపించింది. ప్రతి అమ్మాయి శ్రీలీల పాత్రలో తమని తాము చూసుకుంటారు. ‘బృందావనం’ నుంచి  కాజల్‌తో అనుబంధం ఏర్పడింది. నందమూరి బాలకృష్ణ సినిమాల గురించి చెప్పడానికి సరిపోను. నటుడిగానే కాదు, బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో సేవలు చూసి బాలకృష్ణ సర్‌ జన్మ ధన్యమైందనిపించింది’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని