Bholaa Shankar: షికారు కొచ్చిన షేర్‌

‘నాకు హద్దుల్లేవు... సరిహద్దుల్లేవు. రాష్ట్రం విడిపోయినా అందరూ నావాళ్లే’ అంటున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. ‘భోళాశంకర్‌’గా ఆయన చేయనున్న మరింత సందడిని ఆగస్టు 11న తెరపై చూడాల్సిందే.

Updated : 25 Jun 2023 13:41 IST

‘నాకు హద్దుల్లేవు... సరిహద్దుల్లేవు. రాష్ట్రం విడిపోయినా అందరూ నావాళ్లే’ అంటున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). ‘భోళాశంకర్‌’ (Bholaa Shankar)గా ఆయన చేయనున్న మరింత సందడిని ఆగస్టు 11న తెరపై చూడాల్సిందే. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో... చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘భోళాశంకర్‌’. తమన్నా కథానాయిక. చిరుకు చెల్లెలిగా కీర్తిసురేశ్‌ నటించారు. సుశాంత్‌ కీలక పాత్రని పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని శనివారం విడుదల చేశారు. ‘మొత్తం 33 మందిని చంపేశాడు... ఒక్కడు’ అంటూ మొదలయ్యే ఈ టీజర్‌లో ‘షికారుకొచ్చిన షేర్‌’ అంటూ చిరంజీవి తెలంగాణ యాసలో  చెప్పే మరిన్ని సంభాషణలు అభిమానుల్ని అలరిస్తున్నాయి. మాస్‌, యాక్షన్‌ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: డడ్లీ


విడుదలే ఓ పండగ

టీజర్‌ విడుదలని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో చిత్రబృందం సందడి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh) మాట్లాడుతూ ‘‘అభిమానుల్లో నుంచి వచ్చి దర్శకుడైన నేను అందరికీ వినోదం పంచేలా ఈ సినిమా తీశా. అన్నయ్య చిరంజీవి సంక్రాంతికి ‘వాల్తేర్‌ వీరయ్య’గా వచ్చి సందడి చేశారు. ‘భోళాశంకర్‌’ విడుదలే ఓ పండగలా ఉంటుంది. ఈ రోజు నుంచి భోళా సంబరాలు మొదలయ్యాయి. ఆగస్టు 11 అందరికీ గుర్తుండిపోయేలా సినిమా వినోదాన్ని పంచుతుంది’’ అన్నారు. చిరంజీవి కెరీర్‌లోనే ఈ సినిమా నంబర్‌ వన్‌ అవుతుందనే నమ్మకం ఉందన్నారు నిర్మాత అనిల్‌ సుంకర. ఈ కార్యక్రమంలో మార్తాండ్‌ కె.వెంకటేశ్‌, డడ్లీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని