సెకండ్‌ వేవ్‌.. చిత్రసీమపై కరోనా ప్రతాపం

కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమా కార్యాలయాలు తెరచుకుంటున్నాయి. సినిమాలు విడుదలవుతున్నాయి. చిత్రసీమను నమ్ముకున్నవాళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతలోనే కరోనా ప్రతాపం మళ్లీ మొదలైంది.

Published : 14 Apr 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఇప్పుడిప్పుడే సినిమా కార్యాలయాలు తెరచుకుంటూ, కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. చిత్రసీమను నమ్ముకున్నవాళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతలోనే కరోనా ప్రతాపం మళ్లీ మొదలైంది. గతేడాదితో పోల్చితే 2021లో వరుసగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో సినిమా విడుదల తేదీల్లో వాయిదాలు. కొన్ని చిత్రీకరణలు నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. దాంతో చిత్రపరిశ్రమ మరోసారి కష్టాల్లోకి వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. ఇంతకీ.. ఈ ఏడాది కరోనా బారిన పడ్డ సినీ ప్రముఖులెవరో చూద్దాం..

దిల్‌రాజు..

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ‘వకీల్‌సాబ్‌’ చిత్ర విజయం సాధించిన సంబురాల్లో ఉన్నారు. కాగా తాజాగా ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ కారణంగానే సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఆ సినిమా వేడుకకు హాజరు కాలేకపోయారు. ఆయనతో పాటు చిత్ర యూనిట్‌లో పలువురికి కరోనా సోకింది. కథానాయకుడు వపన్‌కల్యాణ్‌ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 

నివేదా థామస్‌..

‘వకీల్‌సాబ్‌’లో ఓ కీలక పాత్ర పోషించిన నటి నివేదా థామస్‌ కూడా కరోనాకు గురైంది. దాంతో ఆమె సినిమా ప్రచారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కాగా కరోనా సోకిన తర్వాత కూడా ఆమె థియేటర్‌కు వెళ్లి, సినిమా చూడటంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. నెట్టింట్లో తెగ ట్రోల్‌ చేశారు. తనకు కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యాకనే థియేటర్‌కు వెళ్లానని ఆమె స్పష్టం చేసింది. దాంతో అంతా సైలెంట్‌ అయ్యారు.

విజయేంద్రప్రసాద్‌

ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు కూడా ఏప్రిల్‌ 7న కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు తెలిపారు.

కత్రినాకైఫ్‌

కత్రినాకైఫ్‌ ఏప్రిల్‌ 6న కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఆమె అక్షయ్‌కుమార్‌తో కలిసి ‘సూర్యవంశీ’ చిత్రంలో నటించింది. దీంతో పాటు ఆమె ‘టైగర్‌3’, ‘ఫోన్‌ భూట్‌’ చిత్రాల్లోనూ నటిస్తోంది.

విక్కీ కౌశల్‌

కత్రినాకు కరోనా సోకడానికి ఒక్కరోజు ముందు విక్కీ కౌశల్‌ కరోనాకు గురయ్యాడు. విక్కీ నటించిన ‘సర్దార్‌ ఉదమ్‌సింగ్‌’ చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ‘మిస్టర్‌ లేలే’, ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు.

అక్షయ్‌కుమార్‌

తనకు కరోనా సోకిందంటూ ఏప్రిల్‌ 4న బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ అభిమానులకు తెలిపాడు. అక్షయ్‌తో పాటు ‘రామసేతు’ సినిమాకు పనిచేస్తున్న 40మందికి పైగా జూనియర్‌ ఆర్టిస్టులకు కూడా కరోనా సోకింది. అక్షయ్‌ చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఆయన నటించిన ‘సూర్యవంశీ’ ఈనెల 30న, ‘బెల్‌బాటమ్‌’ మే 28న విడుదల కావాల్సి ఉన్నాయి. అందులో సూర్యవంశీ చిత్రం విడుదల వాయిదా పడింది.

భూమి పడ్నేకర్‌

భూమి నటించిన ‘బదాయి దో’ చిత్రీకరణ పూర్తయింది. ‘మిస్టర్‌ లేలే’ చిత్రంలోనూ ఈ భామ నటిస్తోంది. ఈమెకు ఏప్రిల్‌ 5న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అలియాభట్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నటి అలియాభట్‌కు ఏప్రిల్‌ 2న కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో అభిమానులతో పంచుకుంది. ఆమె ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘గుంగూబాయి కతియావాడి’, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాల్లో నటిస్తోంది. మూడు సినిమాలూ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నవే కావడం విశేషం.

రణ్‌బీర్‌ కపూర్‌

మార్చి 9న యువ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం అతడు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో ఆలియాభట్‌తో కలిసి నటిస్తున్నాడు. రణ్‌బీర్‌ ‘షంషీర్‌’ సినిమాలోనూ నటిస్తున్నాడు.

కార్తిక్‌ ఆర్యన్‌

మార్చి 22న యువ కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌ కరోనాకు గురయ్యాడు. ఈ విషయాన్ని ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. అయితే.. అంతకుముందు ఓ కార్యక్రమంలో నటి కియారా అడ్వాణీతో కలిసి ర్యాంప్‌వాక్‌ చేశాడు.

ఆమిర్‌ఖాన్‌

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌కు మార్చి 24న కరోనా పాజిటివ్‌ వచ్చింది. దానికి రెండురోజుల ముందు ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రేను ఆమిర్‌ కలిశారు. ప్రస్తుతం ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమాలో నటిస్తున్నారు.

మాధవన్‌

దక్షిణాది స్టార్‌ హీరో మాధవన్‌కు మార్చి 25న కరోనా సోకినట్లు తేలింది. ఆ విషయాన్ని కాస్త ఫన్నీగా పంచుకున్నాడు. మాధవన్‌ ప్రస్తుతం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌, అమ్రికీ పండిత్‌ సినిమాల్లో నటిస్తున్నారు.

పరేశ్‌ రావల్‌

ప్రముఖ నటుడు పరేశ్‌ రావల్‌కు మార్చి 27న కరోనా నిర్ధారణ అయింది. మార్చి 9న వాక్సిన్‌ మొదటి డోసు తీసుకోవడం గమనార్హం. పరేశ్‌ ప్రస్తుతం ‘హంగామా2’, ‘తుఫాన్‌’, ‘ఆంక్‌ మిచోలి’, ‘ది స్టోరీ టెల్లర్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

బప్పి లహిరి

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బప్పి లహిరి ఏప్రిల్‌ 1న కరోనాకు గురైనట్లు తేలింది. ఇంకా గతంలో కరోనాకు గురై కోలుకున్నవారు చాలామందే ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు