C Kalyan: పదవీ వ్యామోహం లేదు.. ‘టీఎఫ్‌పీసీ’ ఎన్నికల షెడ్యూల్‌ ఇది: సీ కల్యాణ్‌

‘టీఎఫీపీసీ’కు చెడ్డ పేరు తేవాలని చూస్తే సహించమని సి. కల్యాణ్‌ అన్నారు. ఎన్నికలు జరగట్లేదంటూ కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Updated : 18 Jan 2023 17:27 IST

హైదరాబాద్‌: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ)పై సోషల్‌ మీడియా వేదికగా కొందరు బురద జల్లుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్‌ (C Kalyan) అన్నారు. ఎలాంటి పదవీ వ్యామోహం లేదన్న ఆయన ఫిబ్రవరి 19న టీఎఫ్‌పీసీ ఎన్నికలు జరగనున్నట్టు తెలిపారు.

ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘ఆర్గనైజేషన్‌కు (Telugu Film Producers Council) చెడ్డ పేరు తేవాలని చూస్తే ఊరుకోం. ఎలక్షన్స్ జరగట్లేదంటూ కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 6వ తేదీ వరకు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. 19న ఎన్నికలు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్‌, జనరల్‌ బాడీ మీటింగ్‌ ఉంటుంది. మా కౌన్సిల్‌లో ప్రస్తుతం రూ. 9 కోట్ల ఫండ్ ఉంది. ఇంత మొత్తం పోగవ్వడానికి దాసరి నారాయణ రావు గారే కారణం. మాకు తిరుపతిలో ఓ భవనం ఉంది. మూవీ టవర్స్‌లో రూ. 2 కోట్ల 40 లక్షలు ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు దాని విలువ రూ. 10 కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌కు సినిమా పరిశ్రమ వెళ్తుందని నేను అనుకోవట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఒరిగేదేమీ లేదు. గతంలో అందాల్సిన సబ్సిడీ ఇప్పటికీ అందలేదు. కళాకారులకు నంది అవార్డులు చాలా అవసరం. వచ్చే ఎన్నికలలోపు అవార్డులు ప్రదానం చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని వేడుకుంటున్నాం’’ అని కల్యాణ్‌ పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం నిర్వహించిన టీఎఫ్‌పీసీ సమావేశంలో.. పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదని పలువురు సభ్యులు సి. కల్యాణ్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని