Venkatesh Maha: రూ.వెయ్యి కోట్ల క్లబ్‌‌.. నా దృష్టిలో అవన్నీ పాప్‌కార్న్‌ సినిమాలు: వెంకటేశ్‌ మహా

బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోన్న చిత్రాలపై టాలీవుడ్‌ యువ దర్శకుడు వెంకటేశ్ మహా (Venkatesh Maha) షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అవన్నీ ఓటీటీ సినిమాలని ఆయన అన్నారు.

Published : 06 Mar 2023 13:28 IST

హైదరాబాద్‌: బాక్సాఫీస్‌ (Box Office) వేదికగా రూ.1000 కోట్లు, లేదా రూ.2000 కోట్లు వసూళ్లు రాబడుతోన్న కమర్షియల్‌ చిత్రాలపై ‘కేరాఫ్‌ కంచరపాలెం’ (Care of Kancharapalem) దర్శకుడు వెంకటేశ్‌ మహా (Venkatesh Maha) షాకింగ్‌ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో అవన్నీ పాప్‌కార్న్‌ సినిమాలని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన నేటి తరం ప్రేక్షకుల ధోరణిపై స్పందించారు. యువత కోసం తనలాంటి ఎంతోమంది దర్శకులు మంచి చిత్రాలు తెరకెక్కించినప్పటికీ వాటికి సరైన వసూళ్లు రావడం లేదని వాపోయారు.

‘‘బాగా చదివే వాళ్లకే ఇంకా చదవమని చెబుతుంటాం. నేనూ దీన్ని అంగీకరిస్తా. అయితే, ఇక్కడ చదవని వాళ్లకు ఎక్కువ మార్కులు (కలెక్షన్స్‌) వేస్తున్నారు. వాళ్లని చూస్తుంటే మనకూ మార్కులే కదా ముఖ్యం. మనం కూడా అలాంటి సినిమాలే చేద్దామా అనిపిస్తుంది. వెండితెరపై పిచ్చి చిత్రాలు చూసి గొప్పగా మాట్లాడే యువత మొత్తానికి నా ప్రశ్న ఒక్కటే. మీ అభిప్రాయాలు, ఆలోచనా దృక్పథాన్ని మెరుగుపరచడం కోసం మేమింత కష్టపడుతున్నాం కదా.. గొప్ప సినిమా చేశారని చప్పట్లు కొట్టడం మాత్రమే కాకుండా మంచి వసూళ్లు వచ్చేలా మీరూ చేయాలిగా? అభ్యుదయ భావాలను పక్కన పెట్టేసి మేము కూడా పెన్ను వదిలి కత్తి పట్టుకుంటే ఇంకా గొప్పగా సినిమాలు చేస్తాం. ఆ శక్తి మాకుంది. కానీ మేము అలా చేయడం లేదు. అందుకే ప్రశ్నించే వాడికి మేము లోకువ అయిపోతున్నాం’’

‘‘రూ.వందల కోట్లు, రూ.వెయ్యి కోట్లు.. ఇలా వసూళ్లు రాబడుతోన్న చిత్రాలన్నీ నా దృష్టిలో పాప్‌కార్న్‌ సినిమాలు. పాప్‌కార్న్‌ తింటూ వాటిని చూడొచ్చు. సీన్‌ మధ్యలో మిస్‌ అయినా ఫర్వాలేదు. వీటిని ఓటీటీలోనైనా చూడొచ్చు. కానీ, మేము తీసేవి ఓటీటీ సినిమాలు కాదు. మావి కచ్చితమైన థియేటర్‌ చిత్రాలు’’ అంటూ వెంకటేశ్‌ మహా (Venkatesh Maha) అసహనాన్ని బయటపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని