Chandramohan: చంద్రమోహన్‌ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు: సినీ ప్రముఖుల సంతాపం

చంద్రమోహన్‌ (Chandramohan) మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Updated : 11 Nov 2023 15:18 IST

హైదరాబాద్‌: సీనియర్ నటుడు చంద్రమోహన్‌ (Chandramohan) మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.

‘‘ప్రముఖ తెలుగు సినీనటుడు చంద్రమోహన్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించా. నాటి చిత్రాలు మొదలుకొని నిన్న మొన్నటి చిత్రాల వరకూ నటుడిగా వారి ప్రాధాన్యత ఎనలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’’ - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

‘‘ప్రముఖ న‌టుడు చంద్రమోహ‌న్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూయ‌డం బాధాక‌రం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయ‌న తెలుగు, త‌మిళ భాషల్లో వంద‌లాది సినిమాల్లో న‌టించి తెలుగు ప్రజ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తూ, ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ - ఏపీ ముఖ్యమంత్రి జగన్‌

‘‘దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్‌ అలరించారు. చంద్రమోహన్‌ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. చంద్రమోహన్‌ స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారు’’ -సీఎం కేసీఆర్‌

‘‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలంతో తెలుగువారి మనసులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటుడు, కథానాయకుడు చంద్రమోహన్ గారు ఇక లేరన్న వార్త ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ - చిరంజీవి

‘‘ఎన్నో దశాబ్దాలుగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్‌ గారి అకాల మరణం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ - ఎన్టీఆర్‌

‘‘సీనియ‌ర్ న‌టుడు చంద్రమోహ‌న్ మృతి బాధాక‌రం. హీరో, కమెడియ‌న్‌, సహాయ నటుడిగా విభిన్న పాత్రలు అల‌వోక‌గా పోషించిన ఆయన మరణం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. ఆయన ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాను.’’ - నారా లోకేశ్‌

‘‘ఆయన మోము మనకు అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుచేస్తుంది. ఆయన చిరస్మరణీయమైన నటన, అద్భుతమైన పాత్రలతో ప్రతిసారీ మన పెదవులపై చిరునవ్వు విరుస్తుంది’’ - సాయి ధరమ్‌ తేజ్‌

‘‘విలక్షణ నటుడు చంద్రమోహన్ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ - కల్యాణ్‌ రామ్‌

‘‘చంద్రమోహన్ మృతి బాధాకరం. విలక్షణమైన పాత్రలను పోషించిన చంద్రమోహన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. చంద్రమోహన్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ -ఎంపీ రఘురామ

‘‘చంద్రమోహన్‌ మృతి చెందడం ఎంతో విచారకరం. పౌరాణిక, కుటుంబ చిత్రాలతో చంద్రమోహన్‌ అలరించారు’’ - బాలకృష్ణ

‘‘చంద్రమోహన్‌ మృతి చెందారని తెలిసి బాధపడ్డా. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చంద్రమోహన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’- వెంకటేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని