Chinmayi: నయన్‌ లుక్స్‌పై ట్రోల్స్‌.. చిన్మయి ఆగ్రహం

మహిళలను కించపరిచేలా ఎవరైనా కామెంట్స్‌ చేస్తే తనదైన శైలిలో బదులిస్తుంటారు గాయని చిన్మయి. తాజాగా  ఆమె నయనతారకు మద్దతుగా నిలిచారు. నయన్‌ను అసభ్యకరంగా కామెంట్‌ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 24 Dec 2022 14:44 IST

చెన్నై: నయనతార (Nayanthara) లుక్స్‌పై అసభ్యకరమైన కామెంట్స్‌ చేసిన పలువురు నెటిజన్లపై గాయని చిన్మయి (Chinmayi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒక మహిళ శరీరాకృతి గురించి చెత్త కామెంట్లు చేసే ఇలాంటి వ్యక్తులకు ఆడపిల్లలు ఉంటే ఏంటి పరిస్థతి? అంటూ ఆమె ప్రశ్నించారు. సమాజంలో మహిళల పట్ల కొంతమంది మగవాళ్ల దృష్టి ఎలా ఉందో ఈ ఘటన తెలియజేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా వరుస పోస్టులు పెట్టారు.

తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి నయనతార ఇటీవల ‘కనెక్ట్‌’ ప్రీమియర్‌ షోలో పాల్గొన్నారు. వివాహం, తల్లిదండ్రులైన తర్వాత వీరిద్దరూ తొలిసారి పబ్లిక్‌ ప్రోగ్రామ్‌లో సందడి చేశారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నయన్‌ అభిమానులతో ముచ్చటిస్తోన్న వీడియోను ఓ ఆంగ్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ వెబ్‌సైట్ షేర్‌ చేయగా పలువురు నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్లు చేశారు. వీటిని చూసి చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మహిళలందరూ తమ ఇంటి ఆడపిల్లలను ఇలాంటి పురుషులకు దూరంగా పెట్టాలి. ఎందుకంటే వారు మంచివాళ్లు కాదు. వాళ్ల వల్ల ఎలాంటి సంరక్షణ లేదు. ఈ కామెంట్సే అందుకు నిదర్శనం’’ అని పేర్కొన్నారు.

‘మాయ’ తర్వాత అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో నయనతార నటించిన చిత్రం ‘కనెక్ట్‌’. విఘ్నేశ్‌ శివన్‌ నిర్మాత. ఇందులో నయన్‌ తల్లి పాత్రలో నటించారు. లాక్‌డౌన్‌లో ఓ వైద్యుడి కుటుంబంలో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంతో హారర్‌ చిత్రంగా దీన్ని తెరకెక్కించారు. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని