Chiranjeevi: నా అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్‌

‘‘చిరంజీవి వెనకాల ఏ గాడ్‌ఫాదర్‌ లేరని అంటుంటారు. ఈ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి... ఈ స్థితిని ఇచ్చిన నా అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్‌’’ అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’.

Updated : 29 Sep 2022 10:01 IST

- చిరంజీవి

‘‘చిరంజీవి (Chiranjeevi) వెనకాల ఏ గాడ్‌ఫాదర్‌ లేరని అంటుంటారు. ఈ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి... ఈ స్థితిని ఇచ్చిన నా అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్‌’’ అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’ (God Father). సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. మోహన్‌రాజా (Mohan Raja) దర్శకత్వం వహించారు. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మాతలు. కొణిదెల సురేఖ సమర్పించారు. తమన్‌ స్వరకర్త. ఈ చిత్రం దసరా సందర్భంగా వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం అనంతపురంలో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. మధ్యలో వర్షం రాకతో అంతరాయం కలిగింది. అయినా వర్షంలో తడుస్తూనే అభిమానుల్ని ఉద్దేశించి ప్రసంగించారు చిరంజీవి. ‘‘నేనెప్పుడూ రాయలసీమకి వచ్చినా నేల తడుస్తుంది. ఇదివరకు రాజకీయ పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు, ‘ఇంద్ర’ కోసం పాట చేసినప్పుడూ, ఇప్పుడూ వర్షం రావడం ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. ఇదొక శుభ పరిణామంగా, భగవంతుడి ఆశీస్సులుగా భావిస్తున్నా. ఇంత వర్షం పడుతున్నా ఎవ్వరూ కదలకుండా ఉండటమే నిజమైన ప్రేమ అని భావిస్తున్నా. ఈ సినిమా మలయాళంలో విడుదలైనప్పుడు చూశా. తెలుగులో గాడ్‌ఫాదర్‌గా చేయడానికి ప్రధాన కారణం... రామ్‌చరణ్‌. ఈ సినిమా చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారనుకున్నప్పుడు చరణ్‌ ముందుకొచ్చాడు. నీ ఇమేజ్‌కి తగ్గ సినిమా, ఈ సమయంలో నువ్వు చేయాల్సిన కథ అని చెప్పాడు. తనే దర్శకుడిగా మోహన్‌రాజా పేరు సూచించాడు. నేటి పరిస్థితులకి తగ్గట్టుగా తెరకెక్కిస్తాడనే నమ్మకంతో తనకి అప్పజెప్పాం. మోహన్‌రాజా అందరం గర్వపడేలా తీశాడు. అయితే పెద్ద పెద్ద కోరికలు కోరాడు. సల్మాన్‌ఖాన్, నయనతార... ఇలా చాలామందిని కోరాడు. చరణ్‌ ఫోన్‌ చేయడంతో కథ కూడా వినకుండా సల్మాన్‌ఖాన్‌ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సముద్రఖని, సునీల్, షషి, గెటప్‌ శ్రీను, బ్రహ్మాజీ వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించారు. పూరి జగన్నాథ్‌ పాడ్‌ కాస్ట్‌లు చూసి ఓ పాత్రని నువ్వు చేయాలని అడగ్గానే తను వచ్చి చేశారు. మేమంతా పంచప్రాణాలు పెట్టి సినిమాని చేస్తే, ఇది మరో ఎత్తుకు వెళ్లడానికి ఆరోప్రాణంలా తమన్‌ పనిచేశారు. కంటి చూపులతో, నిశ్శబ్దంతో హీరోయిజం పలికించే పాత్రలు అరుదుగా దొరుకుతాయి. ఈ సినిమాతో నాకు అలాంటి పాత్ర దొరికింది. గుంభనంగా, గంభీరంగా ఉంటూనే హీరోయిజం చూపించా. రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్‌ శక్తిమంతమైన పాటల్ని అందజేసి సంగీతానికి మరింత వన్నె తీసుకొచ్చారు. రామ్‌లక్ష్మణ్‌ పోరాటాన్ని, పాటనీ కలిపి చాలా బాగా చేశారు. మేం ఏం చేసినా ప్రేక్షకుల నిర్ణయమే మా శిరోధార్యం. ప్రేక్షకుల తీర్పుని గౌరవిస్తాం. ఈ విజయదశమి మాతోపాటు, ప్రేక్షకుల జీవితాల్లో కూడా విజయాన్ని తీసుకురావాలి. నా మనసుకు అత్యంత దగ్గరైన వ్యక్తి నాగార్జున చేసిన ‘ది ఘోస్ట్‌’ కూడా పెద్ద విజయం సాధించాలి. యువ కథానాయకుడు గణేశ్‌ చేసిన ‘స్వాతిముత్యం’ కూడా ఆదరణ పొందాలి. పెద్ద, చిన్న సినిమాలకి ఆదరణ దక్కినప్పుడే చిత్రసీమ కళకళలాడుతుంది. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు కానీ, గత చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించలేకపోయామే అనే బాధ, అసంతృప్తి ఉంది. దానికి సమాధానం ‘గాడ్‌ఫాదర్‌’ ఇస్తుంది’’ అన్నారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘‘చిరంజీవి సర్‌ని ఎప్పుడు కలిసినా ఓ చిరునవ్వు కనిపిస్తుంది. నాపై ఆయనకున్న ప్రేమ కనిపిస్తుంది. ఇన్ని విజయాలున్నా తొలి సినిమా చేస్తున్నంత ఉత్సాహంతో కనిపిస్తుంటారు. అలాంటి గొప్ప కథానాయకుడికి ఆలస్యమైనా మంచి పాటలు రాసే అవకాశం లభించింది. సంకల్పం ఉన్న సంగీత దర్శకుడు తమన్‌. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు’’ అన్నారు. ఈ సినిమాకి నువ్వు ఆరోప్రాణం అని సందేశం పంపించారు చిరంజీవి. ఈ సినిమాకి నా కెరీర్‌లోనే అత్యుత్తమ నేపథ్య సంగీతం ఇచ్చాను’’ అన్నారు తమన్‌. ఈ కార్యక్రమంలో సత్యదేవ్, తమన్, శివమణి, చిట్టి, షఫి, నాగమహేష్, రామ్‌ లక్ష్మణ్, భద్రి, లక్ష్మీ భూపాల తదితరులు పాల్గొన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts