DIL: ‘దిల్‌’రాజు ‘గేమ్‌ ఛేంజర్‌’ అయ్యారిలా..!

జాతీయ అవార్డును సొంతం చేసుకున్న నిర్మాత దిల్‌రాజు (Dilraju).  ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్‌ ప్రొడ్యూసర్‌గా రాణిస్తోన్న ఆయన కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.

Updated : 05 Apr 2023 14:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘దిల్‌’ (DIL).. ఒక డిస్ట్రిబ్యూటర్‌ని నిర్మాతగా.. ఒక కొత్త హీరోని స్టార్‌గా చేసిన సినిమా. నితిన్‌ (Nithiin) హీరోగా నటించిన ఈ సినిమా విడుదలై మంగళవారంతో సరిగ్గా 20 ఏళ్లు. యువతను ఆకర్షించే లవ్‌స్టోరీ.. కుటుంబాన్ని మెప్పించే డ్రామా.. కావాల్సినంత కామెడీ.. సంగీత ప్రియులను అలరించే పాటలు.. ఇలా అన్నిరకాల కమర్షియల్‌ హంగులతో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ కలెక్షన్స్‌ రాబట్టి హిట్‌ అందుకుంది. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దిల్‌రాజు మొదటిసారి నిర్మాతగా వ్యవహరించారు.

వెంకట రమణా రెడ్డి టు దిల్‌రాజు..!

వెంకట రమణా రెడ్డి అంటే  తెలియకపోవచ్చు కానీ ‘దిల్‌’రాజు (Dil Raju) అంటే సినీ పరిశ్రమలో తెలియని వాళ్లు ఉండరు. నిజామాబాద్‌లో పుట్టిన ఆయన హైదరాబాద్‌కు వచ్చి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. తన సోదరులతో కలిసి పలు అగ్ర, యువ హీరోల సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసి విజయం అందుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ స్థాపించి ‘దిల్‌’ సినిమాతో నిర్మాతగా తొలి అడుగువేశారు. నిర్మాతగా తనకు పేరు అందించిన మొదటి చిత్రాన్నే తన పేరులో  (దిల్‌ రాజు) చేర్చుకున్నారు. అలా, 2003 నుంచి సినీ నిర్మాణ రంగంలో  చెరగని ముద్ర వేశారు. ‘శతమానం భవతి’తో జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. ఓ వైపు అగ్ర హీరోల సినిమాలను నిర్మించడమే కాకుండా కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమాలనూ ప్రోత్సహిస్తూ ముందుకు దూసుకువెళ్తున్నారు. ఇటీవల ఆయన సమర్పణలో వచ్చిన ‘బలగం’ అందుకు ఓ నిదర్శనం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్‌ హిట్‌ అందుకోవడమే కాకుండా అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. విజయాలకు మురిసిపోకుండా, పరాజయాలకు కుంగిపోకుండా కెరీర్‌లో ఎన్నో సవాళ్లు, విమర్శలు ఎదురైనప్పటికీ చిరునవ్వుతో అన్నింటినీ స్వాగతిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. రానున్న రోజుల్లోనూ మంచి కథా చిత్రాలను తెరకెక్కించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. ఇక, ప్రస్తుతం ఆయన బ్యానర్‌ నుంచి ‘శాకుంతలం’ (Shaakuntalam) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రామ్‌చరణ్‌ - శంకర్‌ కాంబోలో ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) అనే బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ సిద్ధమవుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ 50వ ప్రాజెక్ట్‌గా ఇది రూపుదిద్దుకుంటోంది. దీనితోపాటు ఆయన ప్రభాస్‌తోనూ ఓ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు.

ఇక ‘దిల్‌’ కథేంటంటే.!

శీను (Nithiin) ఓ మధ్యతరగతి కుర్రాడు. కాలేజీలో తనతోపాటు చదివే నందిని (Neha)తో ప్రేమలో పడతాడు. నందిని తండ్రి గౌరీ శంకర్‌ (Prakash Raj) హైదరాబాద్‌లోనే పేరు మోసిన రౌడీ. హత్యలు, సెటిల్‌మెంట్స్‌ చేస్తుంటాడు. ప్రేమంటే అతడికి నచ్చదు. తన కుమార్తెతో శీను చనువుగా ఉంటున్నాడని తెలిసి కొట్టించి వార్నింగ్‌ ఇస్తాడు. దాంతో ఆగ్రహానికి గురైన శీను.. నందినిని ఎలాగైనా ప్రేమలో పడేస్తానని, పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్‌ చేస్తాడు. మరి, గౌరీతో చేసిన ఛాలెంజ్‌లో శీను గెలిచాడా? శీనుకు సాయం చేసిన పెద్దాయన ఎవరు? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఇది తెరకెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని