Dileep Kumar: ఆయనకు 44.. ఆమెకు 22..!

వయసులో తారతమ్యమనేది కేవలం చెప్పుకోవడానికి మాత్రమేనని ప్రేమకు అది అడ్డం కాదని నిరూపించారు బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ ఆయన సతీమణి సైరాభాను. వయసుపరంగా 22 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నప్పటికీ...

Published : 07 Jul 2021 14:34 IST

ఎంతోమందికి ఆదర్శప్రాయం ఈ ప్రేమజంట

ముంబయి: వయసులో తారతమ్యమనేది కేవలం చెప్పుకోవడానికి మాత్రమే... ప్రేమకు అది అడ్డం కాదని నిరూపించారు బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ ఆయన సతీమణి సైరాభాను. వయసు పరంగా 22 సంవత్సరాల వ్యత్యాసం ఉన్నప్పటికీ ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పటితరంలో ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. బుధవారం దిలీప్‌ ఆకస్మిక మరణంతో సైరా మానసికంగా ఎంతో బాధకు లోనయ్యారు. ఈ క్రమంలో వీళ్లిద్దరి ప్రేమ కథ గురించి తెలుసుకుందాం..!

12 ఏళ్లకే ప్రేమ..!

12 ఏళ్ల వయసులోనే సైరాభాను దిలీప్‌కుమార్‌తో ప్రేమలో పడ్డారు. అప్పటికే ఆయన బాలీవుడ్‌లో అగ్రకథానాయకుడు. ఆయన వయసు 34. వయసులో తారతమ్యాన్ని పక్కనపెట్టి సైరా ఆయన్ని ఎంతగానో అభిమానించింది. ఆయన సినిమాలు చూస్తూ జీవించింది. తన ప్రేమ గురించి ఆయనకు చెప్పాలని భావించింది. అలాంటి సమయంలోనే దిలీప్‌ నటించిన ‘మొఘల్‌-ఎ-ఆజామ్‌’ సినిమా విడుదలైంది. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆ సినిమా ప్రీమియర్‌కి దిలీప్‌ వస్తాడని భావించిన ఆమె ఆయన కోసమే థియేటర్‌కు వెళ్లింది. అయితే ఆయన వేరే సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ షోకి రాలేకపోయారు. దాంతో ఆమె ఎంతో నిరాశతో వెనుదిగింది.


తొలిచూపులోనే..!

ఓ సినిమా వేడుకలో భాగంగా మొట్టమొదటిసారి సైరా.. దిలీప్‌కుమార్‌ని కలిశారు. తెరపై కాకుండా ప్రత్యక్షంగా దిలీప్‌ని కలిసిన తొలిచూపులోనే సైరా.. ఆయనకు భార్య కావాలని నిర్ణయించుకున్నారు. మొదటిసారి దిలీప్‌ తనని చూసి చిరునవ్వులు చిందించారని.. ఆయన నవ్వుల జల్లులో ఓ పక్షిలా మారి వినీలాకాశంలో తేలిపోయానని సైరా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


ఆమెతో స్క్రీన్‌.. నో ఛాన్స్‌..!

కాలం గడిచే కొద్ది.. దిలీప్‌కుమార్‌కు బాలీవుడ్‌లో ఖ్యాతి మరింత పెరిగింది. అదే సమయంలో సైరాభాను సైతం నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరీర్‌ ఆరంభంలోనే గుర్తింపు తెచ్చుకుంది. దీంతో వీళ్లిద్దరిని పెట్టి సినిమాలు తీయాలని ఎంతో మంది ఫిల్మ్‌ మేకర్స్‌ భావించారు. కానీ, వయసులో తనకంటే చిన్నదైన సైరాతో స్క్రీన్‌ పంచుకోవడానికి దిలీప్‌ మొదట్లో అంగీకరించలేదు. ఒకవేళ ఆమెతో సినిమాలు చేస్తే ప్రేక్షకులు తప్పుగా అనుకుంటారేమోనని ఆయన భావించారు. సినిమాల్లో కలిసి నటించడానికి అంగీకరించనప్పటికీ.. సైరా అంటే తనకెంతో ఇష్టమని దిలీప్‌ తన బయోగ్రఫీలో రాసుకొచ్చారు. ఓసారి సైరాభానుని చీరలో చూసి ఆమె అందానికి మంత్రముగ్ధుడ్నయ్యానని ఆయన అందులో రాసుకొచ్చారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ‘గోపీ’, ‘జిందగీ’, ‘బైరాగ్‌’ సినిమాల కోసం స్క్రీన్‌ పంచుకున్నారు.


ఆమె వల్లే పెళ్లిపీటలెక్కారు..!

దిలీప్‌పై తన కుమార్తెకు ఉన్న అమితమైన ప్రేమ గురించి తెలుసుకున్న సైరా వాళ్లమ్మ.. వాళ్లిద్దరి ప్రేమకు పునాదులు వేసింది. వాళ్లిద్దరి మధ్య ఓ వారధిలా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పరస్పరం బయటపెట్టుకునేలా చేసింది. ఆమె కారణంగా 1966లో దిలీప్‌-సైరా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వివాహ సమయానికి ఆయన వయసు 44, ఆమె వయసు 22 సంవత్సరాలు. 22 ఏళ్ల వయసు తారతమ్యం కారణంగా వీళ్లిద్దరి పెళ్లి అప్పట్లో టాక్‌ ఆఫ్‌ టౌన్‌ అయ్యింది.


సినిమాలకు దూరమై..!

వివాహమైన తర్వాత కూడా సైరా సినిమాల్లో కథానాయికగా నటించారు. తన నటనతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. 1972లో ఆమెకు గర్భస్రావం కావడంతో సినిమాలకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించాలని ఆమె భావించారు. అలా, 1976లో ఆమె యాక్టింగ్‌కు స్వస్తి పలికారు. ఆమె ఆలోచనను దిలీప్‌ గౌరవించారు.


దిలీప్‌.. రెండో పెళ్లి..!

సైరాకు పిల్లలు పుట్టే అవకాశంలేదని ఒకానొక సమయంలో వైద్యులు తేల్చిచెప్పేశారు. దాంతో ఆయన ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్స్‌తో సంబంధాలు పెట్టుకున్నారని అప్పట్లో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలను సైరా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఆయనకు అస్మా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. 1981లో అస్మాను దిలీప్‌ రెండో వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన రెండేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చేసి.. మరలా సైరా దగ్గరకే ఆయన వచ్చేశారు. ఈ వ్యవహారంపై ఓ సందర్భంలో సైరా స్పందిస్తూ.. ‘దిలీప్‌ నాకు ఎప్పటికీ సాబ్‌. నా జీవితంలో ఆయన ఒక్కడికే స్థానం ఉంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయనకు నేనో పెద్ద అభిమానిని. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని టీనేజ్‌లోనే నిర్ణయించుకున్నాను. నాలాగే ఎంతోమంది అమ్మాయిలు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. కానీ సాబ్‌ నన్ను తన జీవిత భాగస్వామిని చేసుకున్నారు. అలా కల నెరవేరింది’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని