Tillu Square: సీక్వెల్‌ విషయంలో ఒత్తిడి సహజమే

‘డీజే టిల్లు’తో వెండితెరపై సిద్ధు జొన్నలగడ్డ చేసిన అల్లరి సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది.

Updated : 22 Mar 2024 10:56 IST

‘డీజే టిల్లు’తో వెండితెరపై సిద్ధు జొన్నలగడ్డ చేసిన అల్లరి సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్‌’ను సిద్ధం చేశారు. సిద్ధు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మల్లిక్‌ రామ్‌ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, ఎస్‌.సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు మల్లిక్‌ రామ్‌.

‘డీజే టిల్లు’ని విమల్‌ కృష్ణ తెరకెక్కించారు కదా.. మరి ‘టిల్లు స్క్వేర్‌’లోకి మీరెలా వచ్చారు?

‘‘సిద్ధు జొన్నలగడ్డతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. నిజానికి ‘డీజే టిల్లు’ కూడా నేను చేయాల్సింది. అప్పటికి నేను ‘అద్భుతం’ చిత్రంతో బిజీగా ఉండటం వల్ల కుదర్లేదు. ఆ తర్వాత విమల్‌ కృష్ణతో కలిసి సిద్ధు ‘డీజే టిల్లు’ పట్టాలెక్కించారు. ఇక ఈ చిత్రం విడుదలయ్యాక నేను.. సిద్ధు మళ్లీ కలిసి చేయాలని అనుకున్నాం. అదే సమయంలో నాగవంశీ ‘టిల్లు స్క్వేర్‌’ చేస్తే బాగుంటుందని చెప్పారు. అప్పటికి విమల్‌ కూడా వేరే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండటంతో నేను దర్శకత్వం చేయడానికి సిద్ధపడ్డా’’.

తొలి భాగం విషయంలో దర్శకుడి కంటే హీరోకే ఎక్కువ పేరొచ్చింది. ఈ సీక్వెల్‌ చేద్దామనుకున్నప్పుడు ఆ కోణంలో ఆలోచించారా?

‘‘నా తొలి చిత్రం ‘నరుడా డోనరుడా’ రీమేక్‌ కథతో రూపొందింది. రెండో సినిమా ‘అద్భుతం’కు ప్రశాంత్‌ వర్మ కథ అందించారు. ఆ రెండు కథలు నాకు బాగా నచ్చడం వల్ల వాటితో ముందుకెళ్లా. నిజానికి నేను సొంతంగా కథలు రాసుకోగలను.. అలాగే ఇతరులు రాసిన కథల్ని తెరకెక్కించి వాటికి న్యాయం చేయగలను. ఇక ఈ చిత్ర విషయంలో సిద్ధుకు పేరొస్తుందంటే నాకూ సంతోషమే. ఎందుకంటే నేను.. సిద్ధు, ప్రశాంత్‌ వర్మ, తేజ సజ్జా మేమంతా ఈ స్థాయికి రావడానికి 12ఏళ్లుగా కష్టపడుతున్నాం. ఇప్పుడు కలిసి సినిమాలు చేస్తున్నాం. కాబట్టి మాలో ఎవరికి పేరొచ్చినా అందరికీ సంతోషమే’’.

ఈ ‘టిల్లు స్క్వేర్‌’ కథ ఎలా ఉంటుంది? తొలి భాగానికి దీనికి ఏమైనా లింక్‌ ఉంటుందా?

‘‘ఈ రెండు చిత్రాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓ శవం నేపథ్యంలో సాగే బ్లాక్‌ కామెడీ కథాంశంతో ‘డీజే టిల్లు’ తెరకెక్కింది. కానీ, ‘టిల్లు స్క్వేర్‌’ అలా ఉండదు. ఒక కమర్షియల్‌ సినిమాలా ఉంటుంది. ‘డీజే టిల్లు’ని గుర్తు చేస్తూనే ‘టిల్లు స్క్వేర్‌’ అందరికీ ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది’’

ఈ చిత్ర విషయంలో ఒత్తిడికి గురయ్యారా? దీనికి సీక్వెల్‌ ఆలోచనలున్నాయా?

‘‘డీజే టిల్లు’ పెద్ద హిట్టయ్యింది కాబట్టి ఈ సీక్వెల్‌ విషయంలో ఒత్తిడి ఉండటం సహజమే. కానీ, కథను బాగా రాసుకోవడంతో చిత్రీకరణ సమయంలో పెద్దగా ఒత్తిడి అనిపించలేదు. ఇక మొత్తం సినిమా చూసుకున్నాక ఇది కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం కలిగింది. ‘టిల్లు-3’ విషయంలో మా దగ్గర కొన్ని ఆలోచనలున్నాయి. భవిష్యత్తులో దాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశముంది’’.

ఈ సినిమా పరంగా సిద్ధు దర్శకుడిగా మీకెంత స్వేచ్ఛ ఇచ్చారు? మీ కొత్త చిత్ర విశేషాలేంటి?

‘‘సిద్ధు కథా చర్చల సమయంలో ఒక రచయితగానే వ్యవహరిస్తాడు. చిత్రీకరణ సమయంలో ఓ నటుడిగా ఏం చేయాలో అదే చేస్తాడు. అలాగే దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఈ సినిమా కోసం ఇద్దరం రెండేళ్లు కలిసి ప్రయాణించాం. ప్రతి సీన్‌ను ఎలా చేస్తే బాగుంటుందనేది ఇద్దరం చర్చించుకొని సమన్వయంతో ఈ సినిమా చేశాం. తప్పకుండా ‘డీజే టిల్లు’ నచ్చినవారిని ‘టిల్లు స్క్వేర్‌’ ఏమాత్రం నిరాశపరచదు. ఇక నా తదుపరి సినిమా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో ఉండనుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌ కోసం సందీప్‌ కిషన్‌తో కలిసి ఒక వెబ్‌సిరీస్‌ చేయనున్నా. జూన్‌లో చిత్రీకరణ మొదలవుతుంది’’.

ఈ కథ బోల్డ్‌గా ఉండటం వల్లే కథానాయిక ఎంపికకు సమయం పట్టిందని తెలిసింది. నిజమేనా?

‘‘ఈ చిత్రంలో లిల్లీ పాత్ర చాలా సవాల్‌తో కూడుకొని ఉంటుంది. ఆ పాత్ర కోసం మడోన్నా సెబాస్టియన్‌, మీనాక్షి చౌదరి.. ఇలా ఎందరో పేర్లను పరిశీలించాం. లుక్‌ టెస్ట్‌లు చేసి చూసుకున్నాం. వాళ్లందరిలో మాకు అనుపమ అయితేనే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందనిపించింది. తనని బోల్డ్‌గా చూపించాలన్న ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. దానికి అనుపమ అయితేనే న్యాయం చేయగలదని మేము మొదటి నుంచి నమ్మాం. మేము అనుకున్నట్లుగానే తను ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. వాస్తవానికి ఈ సినిమాకి ఆమెని ఎంచుకున్నాక తప్పుకుంది. కథలోని బోల్డ్‌ అంశాలు నచ్చకే తను తప్పుకుందని అంతా అనుకున్నారు. నిజానికి తన డేట్లు కుదరక ఆమె తప్పుకోవాల్సి వచ్చింది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని