Ravanasura: ఆ భయంతోనే ‘రావణాసుర’ని వేరే భాషల్లో విడుదల చేయట్లేదు: సుధీర్‌వర్మ

‘‘ఫలానే నేపథ్యంలోనే సినిమాలని తెరకెక్కించాలని అనుకోను’’ అని దర్శకుడు సుధీర్‌వర్మ తెలిపారు. తన తాజా చిత్రం ‘రావణాసుర’ ఏప్రిల్‌ 7న విడుదలకానున్న సందర్భంగా విలేకర్లతో ఆయన ముచ్చటించారు.

Published : 04 Apr 2023 23:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘స్వామిరారా’, ‘కేశవ’, ‘రణరంగం’ తదితర చిత్రాలతో విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు సుధీర్‌వర్మ (Sudheer Varma). ప్రముఖ నటుడు రవితేజ (RaviTeja) హీరోగా ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). సుశాంత్‌, అను ఇమ్మాన్యుయేల్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా సుధీర్‌వర్మ విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..

* ‘రావణాసుర’ ఎలా ఉండబోతోంది? 

సుధీర్‌వర్మ: ‘రావణాసుర’ ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో థ్రిల్స్, షాకింగ్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణ. వాటిల్లో ఇప్పుడు ఏది రివీల్ చేసినా సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ ఉండదు. ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వడానికే ఈ కథ ఎలాంటిదో చెప్పడం లేదు.

* రవితేజతో థ్రిల్లర్ సినిమా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?

సుధీర్‌వర్మ: ఫలానా నేపథ్యంలోనే ఆయనతో సినిమా చేయాలని ఏం అనుకోలేదు. శ్రీకాంత్ విస్సా కథ చెప్పిన్నపుడు రవితేజ  నచ్చడంతో.. దాన్ని నేను బాగా డీల్‌ చేస్తాననే నమ్మకంతో నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. నాకూ స్టోరీ బాగా నచ్చింది. థ్రిల్లర్‌ అని కాదుగానీ ఇది కొత్త జానర్‌ మూవీ. ఇలాంటి కథ ఇప్పటి వరకూ తెలుగులో రాలేదు. సినిమాపై నమ్మకంగా ఉన్నాం. ఓ స్టోరీని ఎలా తెరకెక్కించాలనేది డైరెక్టర్‌ చేతుల్లో ఉంటుంది. స్టైలిష్‌ కథని మాస్‌ నేపథ్యంతో తీయొచ్చు. అయితే, నేను మాత్రం మాస్‌గా తీయాలి, స్టైలిష్‌గా తీయాలని ఏం అనుకోను. కథని బట్టి ముందుకెళ్తుంటా.

* ‘పుష్ప’, ‘కేజీయఫ్‌’.. ఇలా గత రెండేళ్లుగా హీరోలని గ్రే షేడ్స్‌లో చూపించడం ట్రెండ్‌గా మారింది కదా!

సుధీర్‌వర్మ: గ్రే షేడ్స్ అనేది చాలా కాలంగా ఉంది. ‘అంతం’లో నాగార్జున, ‘సత్య’లో జేడీ చక్రవర్తి.. ఇలా పలువురు హీరోలు ఎప్పుడో అలా కనిపించారు. ఇటీవల ఆ ట్రెండ్‌ ఎక్కువైంది అంతే.

* థ్రిల్లర్లకి అన్ని భాషల్లో క్రేజ్‌ ఉంటుంది కదా. ‘రావణాసుర’ని  వేరే పరిశ్రమల్లో విడుదల చేయాలనుకోలేదా?

సుధీర్‌వర్మ: ముందుగా తెలుగు, హిందీ, తమిళ్‌లో విడుదల చేయాలని అనుకున్నాం. అలా చేయాలంటే ఇతర భాషల్లో విడుదలకు పదిహేను రోజులు ముందే కాపీ పంపించాలి.  మేం ఏదైతే దాస్తూ వచ్చామో ఆ ఎలిమెంట్స్ బయటికి వచ్చేస్తాయనే భయంతో ముందు తెలుగులోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమా విడుదలైన రెండో వారం తర్వాత  హిందీలో రిలీజ్‌ చేయాలని  ప్లాన్ చేస్తున్నాం. 

* పవన్ కల్యాణ్‌తో సినిమా గురించి చెబుతారా? 

సుధీర్‌వర్మ: దర్శకుడు త్రివిక్రమ్‌ కథతో అది తెరకెక్కనుంది. ఎప్పుడు ఉంటుందనేది త్వరలో తెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని