ఊపిరి తీసుకోనివ్వని ఉత్కంఠ

దెయ్యలు, భూతాలు లేకున్నా... భయపడిపోతారు. అతీంద్రియ శక్తులేవి లేకుండానే అద్భుతాలు జరగాలని కోరుకుంటారు. అనుక్షణం

Updated : 19 Oct 2022 15:59 IST

చిత్రం: డోంట్‌ బ్రీత్‌(2016); రచయిత, దర్శకుడు, నిర్మాత: ఫెడీ ఆల్వరేజ్‌; నటులు: జానె లెవీ, డేలన్‌మి నెట్‌, డానియల్‌ జొవాటో, స్టీఫెన్‌లాంగ్‌; సంగీతం: రోక్‌ బేనస్‌; సినిమాటోగ్రఫీ: పెడ్రో లూకే; నిడివి: 88 నిమిషాలు

దెయ్యలు, భూతాలు లేకున్నా... భయపడిపోతారు. అతీంద్రియ శక్తులేవి లేకుండానే అద్భుతాలు జరగాలని కోరుకుంటారు. అనుక్షణం ఉత్కంఠ, ప్రతి సన్నివేశంలో ఆశ్చర్యం...   అనుభవిస్తారు. ఎక్కడా అంటారా? ‘డోంట్‌ బ్రీత్‌’ సినిమా చూడండి. ఇవన్నీ మీకూ అనుభవమవుతాయి. ఊపిరి తీసుకోవడమూ మరిచిపోయిన అనుభూతి మీ సొంతమవుతుంది.

2013లో ‘ఈవిల్‌ డెడ్‌-4’ తీసిన దర్శకుడు ఫెడీ ఆల్వరేజ్‌... 2016లో ఈ  సినిమాను ప్రేక్షకులకు అందించారు. ‘‘దెయ్యాలు,  శక్తులేవీ లేకుండానే... భయపెట్టి, ఊపిరి  సలపని ట్విస్ట్‌లతో మెప్పించాలని   నిర్ణయించుకొని ‘డోంట్‌ బ్రీత్‌’ స్క్రిప్ట్‌ రాశా’’ అని ఓ సందర్భంలో ఫెడ్‌ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు. రోడో సయాగస్‌తో కలసి ఆయన దీనికి స్క్రీన్‌ప్లే రాయడంతో పాటు నిర్మాణంలో భాగస్వామిగా మారారు. 9.9 మిలియన్‌ డాలర్ల తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్‌-థ్రిల్లర్‌ 157 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లు సాధించి సంచలన విజయం సాధించింది.

కథ: రాకీ(జానె లెవీ), అలెక్స్‌(డేలన్‌మి నెట్‌), మనీ(డానియల్‌ జొవాటో) ముగ్గురు కలిసి దొంగతనాలు చేస్తుంటారు. ఇలా దొంగతనాలు చేస్తూ జీవిస్తున్న వీరికి ఒక కాంట్రాక్ట్‌ వస్తుంది. ఒక ఇంట్లో మూడులక్షల డాలర్లు ఉన్నాయి. దాన్ని దోచుకోవాలనేది ఆ ఒప్పందం. ఆ ఇల్లు ఊరికి దూరంగా ఉంటుంది. ఆ ఇంటికి ఇటుఅటు పది ఇళ్ల వరకూ ఎవరూ ఉండరు.  ఆ ఇంట్లో ఉన్న నోర్డ్‌ స్ట్రోమ్‌(స్టీఫెన్‌ లాంగ్‌) మాజీ సైనికుడు. గల్ఫ్‌ యుద్ధంలో తన చూపును కోల్పోయి ఉంటాడు. రాకీ, అలెక్స్‌, మనీ ఇంటిచుట్టూ రెక్కీ నిర్వహిస్తారు. ప్రణాళిక వేసుకొని ఓ రాత్రి ఆ ఇంట్లోకి దూకుతారు. ముందుగా నోర్డ్‌స్ట్రోమ్‌ పెంచుకుంటున్న శునకానికి మత్తు ఇస్తారు. ఇంట్లోకి ప్రవేశించి స్ట్రోమ్‌కూ మత్తు ఇస్తారు. ఇక తమ పని అత్యంత సులువై పోయిందనుకుంటారు. మూడు లక్షల డాలర్లు ఎక్కడ పెట్టాడో అర్థం కాదు. వెదుకుతారు. ఒక పెట్టెను పగులగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ శబ్దానికి అంధుడైన స్ట్రోమ్‌కు మెలకువ వస్తుంది. మెల్లగా అక్కడికి వస్తాడు. ఎవరక్కడ? అని గన్‌ చూపిస్తాడు. మనీ అతన్ని బెదిరించే ప్రయత్నం చేస్తాడు.

ఇంతలో అంధుడు గన్‌ తీసుకొని మనీని కాల్చేస్తాడు. అలెక్స్‌ పక్క గదిలోకి  పారిపోతాడు. రాకీ అక్కడ బండ కింద దాక్కుంటుంది.  ఇంకా ఎవరైనా ఇంట్లో ఉన్నారేమోనని గమనిస్తాడు. తను డబ్బు దాచిన చోటుకు వెళ్లి చెక్‌ చేసుకుంటాడు. డబ్బు ఉంటుంది. దీన్ని రాకీ గమనిస్తుంది. పెట్టె   పాస్‌వర్డ్‌ను గుర్తుపెట్టుకొని అతను వెళ్లిపోగానే తెరిచి డబ్బు తను తెచ్చుకున్న బ్యాగ్‌లోకి సర్దుతుంది. ‘వద్దు మనం వెళ్లిపోదామని అలెక్స్‌ అన్నా వినిపించుకోదు. ఈ లోపు స్ట్రోమ్‌ ఇంట్లో ఇంకా ఎవరో ఉన్నారని పసిగడతాడు. వారు శ్వాస తీసుకున్న శబ్దం వినిపించినా కాల్చేస్తుంటాడు. అలా వాళ్లు అతన్ని తప్పించుకుంటూ ఆ ఇంటి బేస్‌మెంట్‌కు వెళతారు. అక్కడ ఒక గర్భిణి కట్టేసి ఉండటాన్ని గమనిస్తారు. ఆ తర్వాత వీరంతా కలసి ఆ ఇంటి నుంచి బయటపడ్డారా? అంధుడైన స్ట్రోమ్‌ కథేంటి? బేస్‌మెంట్‌లో ఉన్న గర్భిణి ఎవరు? వీరు స్ట్రోమ్‌ను, కుక్కను తప్పించుకొని డబ్బు దక్కించుకున్నారా? అనేది మిగతా కథ.

ఆశే యమపాశం: ఇది ఒక హారర్‌-థ్రిల్లర్‌ కథైనా ఇందులో అంతర్లీనంగా మంచి సందేశముంటుంది. అలెక్స్‌ తొలుత ఈ దొంగతనానికి రానంటాడు. కానీ ఇదొక్కటి చేస్తే జీవితంలో సెటిలైపోవచ్చని రాకీ ఆశపెడుతుంది. మనీ చనిపోయాక అలెక్స్‌ ఇంట్లోంచి వెళ్లిపోదామన్నా... డబ్బు దోచుకోవడానికే ప్రయత్నిస్తుంది రాకీ. తను తర్వాత దానికి తగిన మూల్యం చెల్లిస్తుంది. ఒకసారి బయటపడే అవకాశం వచ్చినా... డబ్బు సంచి కోసం మళ్లీ వెనక్కి వచ్చి ఇరుక్కుపోతారు. దేవుడు లేడని నమ్మే వ్యక్తి ఎంతటి క్రూరంగా మారతాడో స్ట్రోమ్‌ పాత్ర చెబుతుంది. మనది కాని దానికి ఆశపడితే ఎన్ని కష్టాలు      వస్తాయో మిగతా మూడు పాత్రల ద్వారా వివరించాడు దర్శకుడు ఫెడీ.

కథలో మనల్ని లీనం చేసే సినిమాటోగ్రఫీ, ప్రతి సన్నివేశానికి ఉలిక్కిపడేలా చేసే సంగీతం, వణికించే స్క్రీన్‌ప్లే, భయపడేలా చేసే స్టీఫెన్‌లాంగ్‌ నటన ఈ చిత్రానికి అద్భుత బలాలు. మరి ఇంతటి ప్రేక్షకాదరణ పొందిన సినిమా సీక్వెల్‌ తీయకుండా ఉంటారా? తీశారు. ఆగస్టు 13, 2021లో ఇది విడుదల కానుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని