Sita Ramam: వారితో పోల్చుకుంటే నేను తక్కువ చేసినట్లే: దుల్కర్‌ సల్మాన్‌

దుల్కర్‌ సల్మాన్‌ ఇంటర్వ్యూ. ‘సీతారామం’ గురించి ఆయన చెప్పిన ఆసక్తికర సంగతులివీ...

Published : 03 Aug 2022 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు మమ్ముట్టి కొడుకుగా తెరంగేట్రం చేసినా విజయాన్ని మాత్రం తన ప్రతిభతోనే సంపాదించుకున్నారు. ఏ భాషలో నటిస్తే ఆయా చిత్ర పరిశ్రమల వారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఆయనెవరో కాదు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan). ‘మహానటి’ చిత్రంలో ‘జెమిని గణేషన్‌’గా కనిపించి, తెలుగు వారికి దగ్గరైన ఆయన త్వరలో ‘సీతారామం’లో రామ్‌గా (Sita Ramam) అలరించేందుకు సిద్ధమయ్యారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో దుల్కర్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలివీ..

‘సీతారామం’లో మిమ్మల్ని ఆకర్షించిన అంశం?

దుల్కర్‌: ‘సీతారామం’ వాస్తవానికి దగ్గరగా ఉండే అరుదైన కథ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ తెరకెక్కలేదనుకుంటున్నా. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అద్భుతం. ఇవన్నీ నన్ను ఈ సినిమాలో నటించేలా చేశాయి. ఈ సినిమాని వెండి తెరపై చూస్తేనే మంచి అనుభూతి కలుగుతుంది. నేనిందులో రామ్‌ అనే ఆర్మీ అధికారిగా కనిపిస్తా. అతనొక అనాథ. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఆనందంగా ఉంటాడు. వైజయంతి మూవీస్‌.. నా సొంత నిర్మాణ సంస్థలాంటిది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నిర్మాత అశ్వినీదత్ గారంటే నాకు ఇష్టం. ఈ బ్యానర్‌లో నాకిది రెండో సినిమా.

రామ్‌ గురించి ఓకే.. మరి సీత ?

దుల్కర్‌: ఓ మంచి నవల చదువుతున్నప్పుడు అందులోని కొన్ని పాత్రలు మనల్ని వెంటాడుతుంటాయి. ఆయా క్యారెక్టర్లకు ఊహారూపం ఇస్తుంటాం. ఈ సినిమా స్క్రిప్టు విన్నప్పుడు సీత పాత్ర గురించీ అలానే ఫీలయ్యా. ఈ పాత్రకు మృణాల్‌ ఠాకూర్‌ 100 శాతం న్యాయం చేసింది. తెరపైనే కాదు తెర వెనకా ఆమె ఉత్సాహంగా ఉంటుంది. మరో కీలక పాత్రలో నటించిన రష్మిక అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో మీకు కొత్త రష్మిక కనిపిస్తుంది.

ప్రేమకథలు ఇకపై చేయనన్నారు. ఎందుకలా? 

దుల్కర్‌: అందరిలానే రోజురోజుకీ నా వయసూ పెరుగుతుంది కదా (నవ్వులు). దానికి తగ్గట్టు పరిణతితో కూడిన విభిన్న పాత్రలు పోషించాలనుంది. అందుకే లవ్‌స్టోరీలకు కొంత విరామం ఇవ్వాలని భావించా. 

ఈ సినిమా సంగీతం గురించి..

దుల్కర్‌: ఈ సినిమాకి సంగీతం ప్రధాన బలమని చెప్పొచ్చు. విశాల్‌ చంద్రశేఖర్‌ అంత అద్భుతమైన స్వరాలందించారు. ఇందులోని పాటలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. తెలుగు పాటల్లోని ప్రతి వాక్యం వెనకున్న భావాన్ని అడిగి తెలుసుకున్నా. వాటిల్లో ‘కానున్న కల్యాణం’ అనే పాట నా ఫేవరెట్‌.

‘పాన్‌ ఇండియా చిత్రం’ అని అనడం మీకు నచ్చదు కదా?

దుల్కర్‌: అవును, ‘పాన్‌ ఇండియా’ అనే ట్యాగ్‌లైన్‌ వినీవినీ విసుగొచ్చింది. ఆ పదం లేకుండా ఇటీవల ఒక్క ఆర్టికల్‌ కూడా కనిపించడం లేదు. పాన్‌ ఇండియా అనేది కొత్త కాన్సెప్టేమీ కాదు. అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌, రజనీకాంత్‌.. ఇలా ఎంతోమంది నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమై, ఆదరణ పొందాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్‌ ఇండియా అంటూ నొక్కి చెప్పాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. సినిమాని సినిమాగా చూస్తే చాలు.

తెలుగు ప్రేక్షకుల గురించి చెప్తారా?

దుల్కర్‌: తెలుగు ప్రేక్షకులు నాపై చూపించే అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మలయాళంలో నా రెండో సినిమా ‘ఉస్తాద్‌ హోటల్‌’ గురించి ఇక్కడి వారు మాట్లాడటం చాలా సంతోషానిచ్చింది. కాలికి గాయం అవటం వల్ల అప్పట్లో ‘మహానటి’ సినిమా ప్రచారానికి నేను రాలేకపోయా. ‘సీతారామం’ ప్రచారంలో భాగంగా విశాఖపట్నం, విజయవాడ వెళ్లా. అక్కడి వారు నాపై ఎంతో ప్రేమ కురిపించారు. 

పలు వ్యాపారాలు చూసుకుంటూనే సుమారు 35 సినిమాల్లో నటించారు. ఎలా సాధ్యమైంది?

దుల్కర్‌: పదేళ్లలో (అన్ని భాషలు కలిపి) 35 చిత్రాలంటే విశేషమేమీ కాదు. మలయాళ చిత్ర పరిశ్రమలో నా తోటి నటులు కొందరు ఏడాదికి 12 సినిమాలు చేస్తున్నారు. అంతెందుకు మా నాన్నే 30కిపైగా చిత్రాల్లో నటించిన సందర్భాలున్నాయి. వారితో పోల్చుకుంటే నేను తక్కువ చేసినట్లే.

మీరు నటుడు కాకపోయుంటే ఏమయ్యేవారు? 

దుల్కర్‌: అది నేనూ ఆలోచించాల్సిన విషయమే (నవ్వుతూ..). ఎంబీఎ చేశాను కాబట్టి ఇన్వెస్టర్‌గా సెటిల్‌ అయ్యేవాడినేమో. నాన్న మమ్ముట్టి నాకు ఆదర్శం. ఆయన గర్వపడేలా చేయడమే నా బాధ్యత.

దర్శకత్వం వహించే ఆలోచన ఉందా ?

దుల్కర్‌: ఆ ఆలోచన ఉంది. కానీ, ప్రస్తుతానికి అది సాధ్యపడకపోవచ్చు. భవిష్యత్తులో ప్రయత్నిస్తా. ఒకవేళ నేను సినిమా తెరకెక్కిస్తే అది ప్రేక్షకుల ఊహకు చాలా భిన్నంగా ఉంటుంది.

ఈ ప్రేమకథా చిత్రంలో సుమంత్‌, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈ బుధవారం జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రభాస్‌ హాజరుకానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని