Salaar: 15 ఏళ్ల క్రితమే బీజం పడింది.. ‘సలార్‌’ గురించి ఈ విశేషాలు తెలుసా?

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’. డిసెంబరు 22న విడుదల కానున్న సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 21 Dec 2023 09:48 IST

ఎప్పుడెప్పుడా..? అని ప్రభాస్‌ (Prabhas) అభిమానులు, సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సలార్’ (Salaar) చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. భారీ అంచనాల నడుమ శుక్రవారం (Salaar Movie Release Date) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ ప్రాజెక్టు గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..

  • ‘సలార్‌’ కథాలోచన ఇప్పటిది కాదు. దాదాపు 15 ఏళ్ల క్రితమే దీనికి బీజం పడింది. అప్పటికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు కాదు. డైరెక్టర్‌గా తొలి ప్రయత్నంలోనే ఇంత పెద్ద కథను చెప్పాలంటే బడ్జెట్‌ దృష్ట్యా కొన్ని పరిమితులుంటాయనే సంగతి తెలిసిందే. అందుకే కొన్ని చిత్రాలు తెరకెక్కించిన తర్వాత ‘సలార్‌’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నారాయన. ‘ఉగ్రం’తో తొలిసారి మెగాఫోన్‌ పట్టిన ప్రశాంత్‌ నీల్‌.. ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’లతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఈ క్రమంలో తన డ్రీమ్‌ ప్రాజెక్టు అయిన ‘సలార్‌’ను పట్టాలెక్కించారు.
  • పాన్‌ ఇండియా నటుడనే ఉద్దేశంతో కాకుండా దేవ పాత్రను దృష్టిలో పెట్టుకునే ప్రభాస్‌ను హీరోగా ఎంపిక చేయడం విశేషం. అమాయకత్వంతో కూడుకున్న రోల్‌ అది. ముందుగా అనుకోకపోయినా చిత్రీకరణ సమయంలో.. ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించారు.
  • ప్రస్తుతం.. సినిమాటిక్‌ యూనివర్స్‌ ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో.. కేజీయఫ్‌- సలార్‌కు లింక్‌ ఉందని ప్రచార చిత్రాలు విడుదలైన సమయంలో పలువురు ఊహించారు. కానీ, రెండింటికీ ఎలాంటి సంబంధం ఉండదని దర్శకుడు స్పష్టం చేశారు. మరోవైపు, ఇది ‘ఉగ్రం’ రీమేక్‌ అంటూ ప్రచారం జరగ్గా.. కాదని తెలిపారు. ‘కేజీయఫ్‌’ హీరో యశ్‌ అతిథిగా కనిపించనున్నారనేది ఊహాగానాలకే పరిమితమైంది.
  • ప్రభాస్‌- హీరోయిన్‌ శ్రుతిహాసన్‌లపై ఓ స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరించాలనుకున్నారు. అయితే, ఎమోషనల్‌గా సాగే కథలో అలాంటి పాట పెడితే కనెక్ట్‌ కాదనుకుని వదిలేశారు. ఇందులో ఆద్యగా కనిపించనున్నారు శ్రుతిహాసన్‌.

  • ‘దేవ’కు సమానమైన మరో పాత్ర వరదరాజ మన్నార్‌. ఈ రోల్‌ కోసం ముందు నుంచీ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌నే అనుకున్నారు దర్శకుడు. ఆయనే లేకపోతే సలార్‌ లేదని ప్రశాంత్‌ చెప్పడం.. పృథ్వీరాజ్‌ నటన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జగపతి బాబు, ఈశ్వరీ రావు, టీనూ ఆనంద్‌ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.
  • 2021 జనవరి 29న తెలంగాణలోని గోదావరిఖనిలో షూటింగ్‌ ప్రారంభమైంది. తర్వాత, హైదరాబాద్, మంగళూరు, వైజాగ్‌ పోర్టు తదిరత ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. 114 రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం దాదాపు రూ.20 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. మరో సన్నివేశంలో హీరో 1000 మందితో ఫైట్‌ చేస్తాడని టాక్‌. సినిమా బడ్జెట్‌ సుమారు రూ.270 కోట్లు.
  • అసభ్యత లేకపోయినా కొన్ని హింసాత్మక సన్నివేశాల కారణంగా సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్‌ జారీ చేసింది. రన్‌టైమ్‌: 2 గంటల 55 నిమిషాల 19 సెకన్లు. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
  • ‘కేజీయఫ్‌’లో నరాచీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్‌ నీల్‌.. ‘సలార్‌’తో ఖాన్సార్‌ వరల్డ్‌ని పరిచయం చేయనున్నారు.
  • ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం. మరి, దేవ- వరదరాజ మన్నార్‌ శత్రువులుగా మారడానికి కారణమేంటి? అసలు ఖాన్సార్‌ కథేంటి? తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని