Fall Review: రివ్యూ: ఫాల్.. అంజలి, ఎస్పీ చరణ్‌ల సిరీస్ ఎలా ఉందంటే?
అంజలి, ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘ఫాల్’. ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైంది.
Fall Review వెబ్ సిరీస్: ఫాల్; నటీనటులు: అంజలి, ఎస్పీ చరణ్, సోనియా అగర్వాల్, సంతోశ్ ప్రతాప్ తదితరులు; ఎడిటింగ్: కృష్ణన్; సంగీతం: అజేశ్; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి; నిర్మాతలు: దీపక్ ధర్, ఎస్పీ చరణ్; దర్శకత్వం: సిద్ధార్థ్ రామస్వామి; స్ట్రీమింగ్: డిస్నీ+ హాట్‌స్టార్.
ఓ భాషలో మంచి విజయాన్ని అందుకున్న సినిమా, సీరియళ్లను పలువురు దర్శక-నిర్మాతలు ఇతర భాషల్లో రీమేక్ చేస్తుంటారు. ఆ విధానాన్ని వెబ్ సిరీస్‌ల్లోనూ ఫాలో అవుతున్నారు. అలా తెరకెక్కిందే ‘ఫాల్’ (Fall). అందులో అంజలి (Anjali), ఎస్పీ చరణ్ (SP Charan), సోనియా అగర్వాల్ (Sonia Agarwal) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కెనడా సిరీస్ ‘వర్టీజ్’కు రీమేక్‌గా భారతీయ భాషల్లో రూపొందిన ‘ఫాల్’ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? తెలుసుకునే ముందు కథ సంగతి చూద్దాం.. (Fall Webseries Review)
కథేంటంటే..? దివ్య (అంజలి) అనే యువతి పేద విద్యార్థుల కోసం స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి, తానే ఆ వ్యవహారాలు చక్కబెడుతుంటుంది. కుటుంబ కలహాల కారణంగా ఆ అకాడమీ భవనంలోనే నివాసం ఉంటుంది. ఓ రోజు కారులో ప్రయాణిస్తూ.. డేనియల్ (సంతోశ్ ప్రతాప్) గురించి తన స్నేహితురాలు, వదిన అయిన మలార్ (సోనియా అగర్వాల్)కు చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. కానీ, మలార్ ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో ఆడియో మెసేజ్ పంపుతుంది. అదే రాత్రి బిల్డింగ్ పైనుంచి దూకి దివ్య ఆత్మహత్యకు యత్నిస్తుంది. ఆరు నెలల తర్వాత.. దివ్య కోమా నుంచి కోలుకుందనే విషయం తెలియగానే ఆమె అన్నయ్య రోహిత్ (ఎస్పీ చరణ్), సోదరి మాయా (నమిత) టెన్షన్ పడతారు. తర్వాత ఆమెకు ఏం గుర్తులేదనే విషయాన్ని తెలుసుకుని రిలాక్స్ అవుతారు. మరి, దివ్య తనంతట తానే దూకిందా? ఆమెపై హత్యా ప్రయత్నం జరిగిందా? అన్నది మిగతా కథ (Fall Review).
ఎలా ఉందంటే..? థ్రిల్లర్- డ్రామా తరహా కథ ఇది. ప్రేక్షకుల్లో సస్పెన్స్ క్రియేట్ చేసేందుకో మరేదో కారణమోగాని ప్రస్తుతానికి మూడు ఎపిసోడ్లను మాత్రమే విడుదల చేశారు. దివ్య ఆస్పత్రి బెడ్‌పై ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు ఎలా ప్రవర్తించారు? అన్న ఒక్క అంశంపైనే మూడు ఎపిసోడ్లు సాగాయి. దివ్య కోమాలోకి వెళ్లింది కాబట్టి ఆమెకు చెందిన స్పోర్ట్స్ అకాడమీ స్థలాన్ని కుటుంబ సభ్యుల్లోని కొందరు విక్రయించాలనుకోవడం, కొందరు వద్దు అని చెప్పడం, మరోవైపు.. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం డేనియల్, రోహిత్ మధ్య నడిచే వార్ సన్నివేశాలు కనిపిస్తాయి. అయితే, ఆయా పాత్రల మధ్య సంఘర్షణ మెప్పించదు. ఎక్కడా ఎమోషన్‌గాని, వావ్ అనిపించే పోటాపోటీ సంభాషణలుగాని ఉండవు. దివ్య ఎందుకు సూసైడ్ చేసుకుంది? అని తొలి ఎపిసోడ్ ప్రారంభంలో కలిగే ఆసక్తి మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఓ పోలీసు అధికారి పాత్ర మాత్రం కొంచెం ఫన్ పంచుతుంది. ‘ఎక్కువ డ్రామా, అతి తక్కువ కామెడీయేనా? ట్విస్ట్‌లు ఏం లేవా?’ అని అనుకునే సమయంలో (మూడో ఎపిసోడ్ చివరిలో) ఓ కీలక మలుపు వస్తుంది. తదుపరి ఎపిసోడ్లపై ఆసక్తిని పెంచుతుంది.
ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తే అది ఎక్కడికైనా దారి తీయొచ్చనే ఇతివృత్తంతో ఇప్పటికే ఎన్నో కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇదీ ఆ కోవకు చెందిన స్టోరీనే. అయితే, దాన్ని ఎలివేట్ చేయడంలో ప్రత్యేకత చూపిస్తే విజయం అందుకోవచ్చు. మాతృక ‘వర్టీజ్’కు తగ్గట్టే మిగిలిన ఎపిసోడ్లు రూపొంది ఉంటే ‘ఫాల్’ మెప్పించే అవకాశాలున్నాయి. ప్రేక్షకులు ఊహించినట్టే దివ్య కుటుంబంలోని వారే ఆమెను చంపాలనుకున్నారా? ఎంతో విలువైన ప్రాజెక్టు కోసం తనను ప్రేమించిన దివ్యను డేనియలే హతమార్చాలనుకున్నాడా? అనే ప్రశ్నలకు మిగిలిన ఎపిసోడ్లే సమాధానం.
ఎవరెలా చేశారంటే..? సినిమాల్లో సందడి చేస్తూనే వెబ్ సిరీస్‌ల్లో ఎక్కువగా కనిపిస్తున్న నటి అంజలి. ఇటీవల వచ్చిన ‘ఝూన్సీ’ అనే సిరీస్‌లోనూ గతం మరిచిపోయిన అమ్మాయిగా కనిపించింరామె. ఇందులో ఎక్కువ సేపు కోమాలోనే ఉంటుంది. ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన ఎస్పీ చరణ్‌కు ఇది తొలి వెబ్ సిరీస్. నెగెటివ్ ఛాయలున్న రోహిత్ పాత్రకు న్యాయం చేశారు. కానీ, డబ్బింగ్ సెట్ కాలేదు. ‘7/జీ బృందావని కాలనీ’లో హీరోయిన్‌గా మెరిసిన సోనియా అగర్వాల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మలార్‌గా ఒదిగిపోయారామె. ఇతర పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి. అజేశ్ అందించిన నేపథ్య సంగీతం ఈ సిరీస్‌కు ప్రధాన బలం. ట్రిమ్మింగ్ విషయంలో కృష్ణన్ విజయం సాధించలేకపోయినట్టే. అటు సినిమాటోగ్రఫీ, ఇటు డైరెక్షన్ కోణంలో సిద్ధార్థ్ రామస్వామి ఓకే అనిపిస్తారు.
బలాలు: + నేపథ్య సంగీతం, + నవ్వులు పంచే పోలీసు పాత్ర, + ఎస్పీ చరణ్ నెగెటిల్ రోల్.
బలహీనతలు: - నెమ్మదిగా సాగే కథనం, -పెద్దగా మలుపులు లేకపోవడం.
చివరిగా: ‘ఫాల్’.. ప్రస్తుతానికి నాట్ ఓకే!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
America: టోర్నడోల విధ్వంసం.. 23 మంది మృతి..!
-
Sports News
Dhoni - Raina: అప్పుడు ధోనీ రోటీ, బటర్చికెన్ తింటున్నాడు..కానీ మ్యాచ్‌లో ఏమైందంటే: సురేశ్‌రైనా
-
General News
APCRDA: ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడివారైనా ప్లాట్లు కొనుక్కోవచ్చు.. సీఆర్డీఏ కీలక ప్రకటన
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
General News
TSPSC:పేపర్ లీకేజీ.. నలుగురు నిందితులకు కస్టడీ
-
India News
Rahul Gandhi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన... పలుచోట్ల ఉద్రిక్తత