FIR: ‘ఎఫ్‌ఐఆర్‌’లాంటి సినిమా చేయాలనుంది: రవితేజ

‘ఎఫ్‌ఐఆర్‌’ సినిమా ప్రెస్‌మీట్‌. విష్ణు విశాల్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రవితేజ సమర్పిస్తున్నారు...

Published : 07 Feb 2022 01:40 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు రవితేజ వల్లే ‘ఎఫ్‌ఐఆర్‌’ (FIR) సినిమా తెలుగులో గ్రాండ్‌గా విడుదలవుతోందన్నారు తమిళ నటుడు విష్ణువిశాల్‌. ఆయన హీరోగా మను ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రమిది. మంజిమా మోహన్‌ కథానాయిక. విష్ణువిశాల్‌ నిర్మించిన ఈ సినిమాని రవితేజ సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ‘ప్రీ రిలీజ్‌’ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా విష్ణు విశాల్‌ మాట్లాడుతూ.. ‘‘మేం ముందు నుంచీ ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించాం. ఓటీటీలో రిలీజ్‌ చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. అనుకున్నట్టుగానే థియేటర్లలోనే విడుదల చేయబోతున్నాం. తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి తప్పకుండా తెలుగులోకి డబ్‌ చేయమని జ్వాల పట్టుబట్టింది. ఎంతో ప్రోత్సహం అందించింది. ఈ సినిమాని సమర్పిస్తున్న రవితేజగారికి థ్యాంక్స్‌. ఆయన వల్లే ఈ చిత్రం ఇక్కడ గ్రాండ్‌గా విడుదలవుతోంది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మను, రచయిత రాకేందు మౌళి, యువ నటులు సందీప్‌ కిషన్‌, సిద్ధు జొన్నలగడ్డ, మంజిమా మోహన్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, విష్ణువిశాల్‌ సతీమణి గుత్తా జ్వాల తదితరులు పాల్గొన్నారు.

అప్పుడే ఫిక్స్‌ అయ్యా..

ఈ సినిమా గురించి రవితేజ, రామ్‌ పోతినేని పంచుకున్న విశేషాల వీడియోల్ని ఇదే వేదికపై ప్రదర్శించారు. ‘‘ఈ సినిమాను ఆరు నెలల క్రితమే చూశా. బాగా నచ్చటంతో ఈ చిత్రాన్ని సమర్పించాలని ఫిక్స్‌ అయ్యా. ఇలాంటి సినిమాలో నాకూ నటించాలనుంది. తెలుగులోనూ ఈ సినిమా విజయంవంతమై, విష్ణువిశాల్‌కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని ప్రముఖ నటుడు రవితేజ అన్నారు. రామ్‌ పోతినేని.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని