Tollywood: మాకు ఏడాదంతా స్నేహితుల దినోత్సవమే

కీర్తి సురేష్‌కి ఈ ఏడాది బాగా కలసి వచ్చింది. ‘దసరా’, ‘నాయకుడు’ సినిమాలతో వరుస విజయాలందుకొని సత్తా చాటింది. ఇప్పుడీ జోరులోనే చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్‌’తో అలరించేందుకు సిద్ధమైంది.

Updated : 06 Aug 2023 13:53 IST

కీర్తి సురేష్‌కి ఈ ఏడాది బాగా కలసి వచ్చింది. ‘దసరా’, ‘నాయకుడు’ సినిమాలతో వరుస విజయాలందుకొని సత్తా చాటింది. ఇప్పుడీ జోరులోనే చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్‌’తో అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఇద్దరూ అన్నాచెల్లెళ్లుగా నటించిన ఈ చిత్రాన్ని మెహర్‌ రమేష్‌ తెరకెక్కించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్లతో ముచ్చటించింది కీర్తి.

ఆ అవకాశం ఉండదేమోనని భయపడ్డా!

‘‘రజనీకాంత్‌తో ‘అణ్ణాత్తే’ చేస్తున్న సమయంలోనే ఈ చిత్ర అవకాశం వచ్చింది. చిరంజీవికి చెల్లిగా నటిస్తున్నా అనగానే చాలా సంతోషమనిపించింది. అదే సమయంలో నాకు ఆయనతో డ్యాన్స్‌ చేసే అవకాశం ఉంటుందో లేదోనని కాస్త భయంగానూ అనిపించింది. కానీ, అదృష్టవశాత్తూ ఇందులో ఆయనతో రెండు పాటల్లో డ్యాన్స్‌ చేయగలిగా. అన్నాచెల్లి అనుబంధాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందిన చిత్రమిది. వినోదం, యాక్షన్‌.. ఇలా అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో చాలా మంది స్టార్లు కనిపిస్తారు. తమన్నా - చిరు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉంటాయి. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి’’.


చిరు ఇంటి ఉలవచారు

‘‘ఈ సినిమాలో నేను చిరంజీవి చెల్లిగా నటించినా సెట్లో ఆయన్ని ఎప్పుడూ చిరు గారు అనే పిలిచేదాన్ని. ఒకవేళ అన్నయ్య అంటే కొడతారేమో (నవ్వుతూ). మా అమ్మ చిరు సర్‌తో ‘పున్నమినాగు’ సినిమాలో నటించింది. అప్పటికి తనకు 16ఏళ్లే. తనని ఆయన ఓ చిన్నపిల్లలా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారట. ప్రతి విషయాన్ని ఎంతో ఓపికగా నేర్పించేవారట. అమ్మ చెప్పిన ఈ విషయాలన్నీ ఓరోజు సెట్లో చిరంజీవితో చెప్పా. చాలా సంతోషపడ్డారు. మీ అమ్మ అమాయకురాలు కానీ, నువ్వు స్వీట్‌ నాటు అంటూ నవ్వేశారు. ఈ సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ నాకు ఆయన ఇంటి నుంచే భోజనం తెప్పించేవారు. సెట్లో ఎప్పుడూ ఆ భోజనం గురించే మాట్లాడుతుండేదాన్ని. ముఖ్యంగా ఆయన ఇంటి నుంచి వచ్చే ఉలవచారు నాకు చాలా నచ్చింది’’.


  • ‘‘నాకు స్నేహితులెక్కువ. నా ఎదుగుదలలో వారి ప్రోత్సాహం, సహకారం చాలా ఉంది. వీలు చిక్కినప్పుడల్లా వారితో గడిపేందుకు ఇష్టపడతా. నాకు బ్రదర్‌ లాంటి ఫ్రెండ్స్‌ కూడా చాలా మంది ఉన్నారు. ‘భోళా శంకర్‌’ వల్ల చిరుతో మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఆయన మా అమ్మకు మంచి మిత్రుడు. కానీ, ఇప్పుడాయనకు నేను కొత్త ఫ్రెండ్‌. స్నేహితుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడమన్నది నాకు తెలియదు. ఎందుకంటే ఏడాది మొత్తం మేము వేడుక చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి నా వరకు ప్రతిరోజూ ఫ్రెండ్‌షిప్‌ డేనే’’.

అది చాలా కష్టంగానే ఉంది..

‘‘నాయికా ప్రాధాన్య చిత్రాల్ని.. కమర్షియల్‌ సినిమాల్ని బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకెళ్లడం చూడటానికి తేలికగా అనిపించొచ్చు కానీ, చాలా కష్టంగానే ఉంది. కాకపోతే నాకు అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. ఓ పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలానాది నేను చేయలేకపోయానని బాధపడకూడదన్నది నా ఆలోచన. భవిష్యత్తులో నాకు మరిన్ని ప్రయోగాత్మక పాత్రలు.. జానర్లు చేయాలని ఉంది. ప్రస్తుతం నేను ‘రఘు తాత’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నా. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని