రష్మిక స్థానంలో మాళవిక!

విక్రమ్‌ నటిస్తోన్న 61వ చిత్రం టెస్ట్‌ షూటింగు మొదలైన సంగతి తెలిసిందే. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముందు రష్మికను తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో మరో భామ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న ప్రకారం రష్మిక నటించాల్సి ఉన్నా ఆమె కాల్షీట్లు సర్దుబాటు కావడం లేదు.

Published : 18 Oct 2022 03:25 IST

విక్రమ్‌ నటిస్తోన్న 61వ చిత్రం టెస్ట్‌ షూటింగు మొదలైన సంగతి తెలిసిందే. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముందు రష్మికను తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో మరో భామ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న ప్రకారం రష్మిక నటించాల్సి ఉన్నా ఆమె కాల్షీట్లు సర్దుబాటు కావడం లేదు. దీంతో మాళవిక మోహనన్‌ తీసుకున్నట్లు సమాచారం. మాళవికకు ఇది నాలుగో తమిళ చిత్రం. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం నుంచి కడపలో మొదలైంది. తమిళంతో పాటు హిందీలోనూ చిత్రీకరించి పాన్‌ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


నవంబరులో ‘తెలిసినవాళ్లు’

రామ్‌ కార్తీక్, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘తెలిసినవాళ్లు’. విప్లవ్‌ కోనేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నరేష్, పవిత్ర లోకేష్, జయప్రకాష్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. నవంబరులో విడుదల కానుంది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఓ కొత్త తరహా కథాంశంతో రూపొందిన చిత్రమిది. రొమాన్స్, ఫ్యామిలీ, థ్రిల్లర్‌.. ఇలా పలు రకాల జానర్స్‌ ఇందులో మిళితమై ఉంటాయి. సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాం. త్వరలో సెన్సార్‌ పూర్తి చేసి, నవంబర్‌లో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: అజయ్‌ వి.నాగ్, అనంత్‌ నాగ్‌ కావూరి.


కూత రాంప్‌

శ్రీ సింహా హీరోగా ప్రణీత్‌ సాయి తెరకెక్కించిన చిత్రం ‘భాగ్‌ సాలే’. అర్జున్‌ దాస్యన్, యష్‌ రంగినేని, కల్యాణ్‌ సింగనమల సంయుక్తంగా నిర్మించారు. నేహా సోలంకి కథానాయిక. జాన్‌ విజయ్, నందిని రాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘కూత రాంప్‌’’ అనే గీతాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ పాటకు కాల భైరవ స్వరాలు సమకూర్చడమే కాక స్వయంగా ఆలపించారు. కె.కె సాహిత్యమందించారు. ‘‘యువతను ఆకట్టుకునే సరికొత్త కథతో ఈ చిత్రం రూపొందింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.


‘సర్దార్‌’కు స్ఫూర్తి అదే!

‘‘లవ్‌.. కామెడీ.. యాక్షన్‌.. ఎమోషన్‌.. ఇలా అన్ని రుచులున్న పసందైన విందు భోజనం లాంటి సినిమా ‘సర్దార్‌’’’న్నారు దర్శకుడు పి.ఎస్‌.మిత్రన్‌. కార్తి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఇది అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు మిత్రన్‌ మాట్లాడుతూ ‘‘కొన్ని యథార్థ సంఘటనల స్ఫూర్తితో రాసుకున్న కథ ఇది. 80ల్లో ఇండియన్‌ ఇంటెలిజెన్స్‌ ఒక గూఢచారిని తయారు చేయాలని ప్రయత్నించింది. అయితే సైన్యంలో పని చేసే వ్యక్తిని గూఢచారిగా మార్చడం అంత సులువు కాదు. అతనికి నటించడం రావాలి. మారువేషాలు వేయగలగాలి. దీనికి బదులు ఒక రంగస్థల నటుణ్ని గూఢచారిగా మార్చారు. ఇది నిజంగా జరిగింది. ఆ సంఘటనే ఈ చిత్ర కథకు స్ఫూర్తి’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని