బేబి.. ప్రత్యేకత అదే!

ఓ కథగా సరికొత్త అనుభూతిని పంచుతూనే... ఎక్కడో ఒక చోట తమని తాము చూసుకునేలా ప్రేక్షకుల్ని ప్రభావితం చేయడమే మా ‘బేబి’ ప్రత్యేకత అన్నారు విరాజ్‌ అశ్విన్‌.

Published : 11 Jul 2023 01:17 IST

ఓ కథగా సరికొత్త అనుభూతిని పంచుతూనే... ఎక్కడో ఒక చోట తమని తాము చూసుకునేలా ప్రేక్షకుల్ని ప్రభావితం చేయడమే మా ‘బేబి’ ప్రత్యేకత అన్నారు విరాజ్‌ అశ్విన్‌. ‘అనగనగా ఓ ప్రేమకథ’, ‘థ్యాంక్‌ యూ బ్రదర్‌’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఆయన ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో కలిసి ‘బేబి’లో నటించారు. సాయిరాజేశ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఎస్‌.కె.ఎన్‌ నిర్మాత. చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విరాజ్‌ అశ్విన్‌ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

* ‘‘సవాల్‌తో కూడిన పాత్రలు, విభిన్నమైన కథలంటేనే ఇష్టపడతా. అలాంటి చిత్రాలతో ప్రయాణం చేస్తున్న క్రమంలోనే ‘బేబి’ అవకాశం వచ్చింది. నా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న విరాజ్‌ పాత్రని చేశా. ఇందులో కళాశాల విద్యార్థిగా కనిపిస్తా. జీవితం గురించి పెద్దగా తెలియని, రెబల్‌గా ఆలోచించే యువకుడి పాత్ర అది. దర్శకుడు సాయిరాజేశ్‌ కథలు హార్డ్‌ హిట్టింగ్‌గా ఉంటాయి. ఈ కథనీ అలాగే మలిచారు’’.

* ‘‘ముక్కోణపు ప్రేమకథే కానీ మనం ఎప్పుడూ చూసిన కథల్లా మాత్రం ఉండదు. ఇందులో హీరో పాత్ర ఇదీ అని చెప్పలేం. అసలు హీరో ఎవరంటే దర్శకుడు నుంచి మొదలు పెట్టి మొత్తం సాంకేతిక బృందం పేర్లు చెప్పాల్సి వుంటుంది. వాళ్లు ఈ కథని అంత పక్కాగా తెరపైకి తీసుకొచ్చారు. ఓ సినిమాలో ప్రతి పాత్రకీ నటనకి ప్రాధాన్యం లభించడం అరుదుగా దొరుకుతుంటుంది. ఈ సినిమాలో అలాంటి అరుదైన అవకాశం మాకు వచ్చింది. ఈ ప్రయాణంలో నేను, ఆనంద్‌, వైష్ణవి మంచి స్నేహితులం అయ్యాం. వైష్ణవి తన చుట్టూ తిరిగే ఈ పాత్రని భుజాలపై మోసింది’’.

* ‘‘ఇప్పటివరకూ థియేటర్లలో పక్కాగా నా సినిమా విడుదల కాలేదు. ఆ కోణంలో ఇది నా తొలి సినిమా అనే భావన కలుగుతోంది. కచ్చితంగా నా కెరీర్‌కి మేలు చేసే చిత్రం అవుతుంది. ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలు చేస్తూనే నేర్చుకుంటున్నా. ‘మరీచిక’, ‘జోరుగా హుషారుగా’ సినిమాల్లో నటిస్తున్నా. వీటితోపాటు, నాని 30వ చిత్రంలోనూ ఆసక్తికరమైన ఓ మంచి పాత్రని పోషిస్తున్నా’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని