Chiranjeevi: మంచి కథ దొరికినప్పుడు రీమేక్‌ చేస్తే తప్పేంటి?: చిరంజీవి

‘‘చిత్ర పరిశ్రమ పుష్పక విమానం లాంటిది. ఎంత మంది వచ్చినా సరే మరి కొంతమందికి స్థానం ఉంటుంది. ఇది అక్షయ పాత్రలాంటిది.

Updated : 07 Aug 2023 19:03 IST

‘‘చిత్ర పరిశ్రమ పుష్పక విమానం లాంటిది. ఎంత మంది వచ్చినా సరే మరి కొంతమందికి స్థానం ఉంటుంది. ఇది అక్షయ పాత్రలాంటిది. ఎంత మంది తిన్నా.. ఆకలి తీరుస్తూనే ఉంటుంది. అందుకే చిత్రసీమలోకి రావడానికి ఎవరూ వెనకడుగేయవద్దు’’ అన్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా మెహర్‌ రమేష్‌ తెరకెక్కించిన చిత్రం ‘భోళాశంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మాత. తమన్నా కథానాయిక. కీర్తి సురేష్‌, సుశాంత్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘అమ్మ ప్రేమ.. అభిమానుల ప్రేమ ఎప్పుడూ బోర్‌ కొట్టదు. అది చల్లగా మదిని హత్తుకుంటుంది. అందుకే మీరందరూ గర్వపడేలా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ.. ప్రతి అడుగూ ఆచితూచి వేస్తూ ముందుకెళ్తున్నా. నా మనసుకు నచ్చి చేసిన చిత్రమిది. రీమేక్‌లు చేస్తుంటారేంటని కొందరు తరచూ అడుగుతుంటారు.

ఓ మంచి కథ దొరికినప్పుడు.. దాన్ని మన ప్రేక్షకులకు చూపించేందుకు రీమేక్‌ చేస్తే తప్పేంటన్నది నాకు అర్థం కాదు. ఈ ‘భోళా శంకర్‌’ మాతృక ‘వేదాలం’ ఏ ఓటీటీ వేదికలోనూ అందుబాటులో లేదు. ఎవరూ చూడలేదు. అందుకే ధైర్యంగా ఈ చిత్రం చేసేందుకు ముందుకొచ్చా. ఇది కచ్చితంగా అందర్నీ అలరిస్తుంది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ఇది సూపర్‌ హిట్టవుతుందన్న భరోసా అందరిలో కనిపించింది. ఇందులో నేనెక్కడా కనిపించను. తమ్ముడు పవనే కనిపిస్తాడు. అది ప్రేక్షకులకు కనులవిందుగా ఉంటుంది. తమన్నా, కీర్తి సురేష్‌ సినిమాలో అద్భుతంగా నటించారు. ఇందలో అన్నాచెల్లి సెంటిమెంట్‌ బాగా పండింది. అభిమానులే నాలోని ప్రతిభను గుర్తించి.. ప్రోత్సహించారు. నన్నీ స్థాయిలో నిల్చోబెట్టారు. అందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అన్నారు. ‘‘అందరూ చిరంజీవి సినిమాలూ చూస్తూ పెరిగితే.. నేను ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగా. ఆయనంటే నాకెంత ఇష్టమంటే.. తన గురించి ఒకరు నీచంగా మాట్లాడితే 12 ఏళ్లు పోరాడి, వాళ్లు జైలుకి వెళ్లే వరకు ఊరుకోలేదు నేను’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌.

ఆయనో ప్రేమమూర్తి..

దర్శకుడు మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. ‘‘చిరు అన్నయ్యతో సినిమా చేయడం ఈ జీవితానికి దక్కిన గొప్ప అదృష్టం. దర్శకుడిగా నాకిది పునర్జన్మ. ఆయన వెలుగు నాపై పడటం వల్లే ఈరోజు నేనిక్కడ ఉన్నా. అన్నయ్యని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో.. అలాగే ఇందులో చూపించాం. చిరంజీవి వంటి ప్రేమమూర్తిని నేనింత వరకు చూడలేదు. అలాంటి గొప్ప వ్యక్తితో సినిమా చేయడం నా పూర్వ జన్మ సుకృతం’’ అన్నారు.‘‘చిరంజీవితో సినిమా చేయడం నా కల. అది నెరవేరేలా చేసిన దర్శకుడు రమేష్‌కు కృతజ్ఞతలు. చిరంజీవి నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి’’ అన్నారు నిర్మాత అనిల్‌ సుంకర.

సెట్లో అన్నాచెళ్లెలమే..

నటి కీర్తి సురేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం ప్రధానంగా అన్నాచెల్లి ట్రాక్‌పై నడుస్తుంది. సెట్లో నిజంగా అలాంటి ట్రాకే నాకు మెహర్‌ అన్నకు మధ్య జరిగింది. నన్ను మహాలక్ష్మిగా నమ్మి ఈ అవకాశమిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ సినిమాతో చిరంజీవి నుంచి చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నా. ప్రతిరోజూ మీ ఇంటి భోజనం పెట్టినందుకు కృతజ్ఞతలు. డడ్లీ నన్ను తెరపై చాలా అందంగా చూపించారు’’ అంది.‘‘చిరంజీవితో తెర పంచుకోవడమన్నది నాలాంటి ఈతరం హీరోలందరికీ పెద్ద కల. ఆ అద్భుత అవకాశాన్ని ఈ చిత్రంతో నాకందించిన దర్శకుడు మెహర్‌ రమేష్‌కు కృతజ్ఞతలు. ఈ భోళా మానియాలో నాదొక చిన్న చిరుగాలి లాంటి పాత్ర. కీర్తికి జోడీగా కనిపిస్తా. తమన్నాకు సోదరుడిగా నటించా. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అన్నారు నటుడు సుశాంత్‌. ఈ కార్యక్రమంలో బాబీ, వంశీ పైడిపల్లి, టీజీ విశ్వప్రసాద్‌, ఏఎం రత్నం, గోపీచంద్‌ మలినేని, సంపత్‌ నంది, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్‌, ఏఎస్‌ ప్రకాష్‌, రామ్‌-లక్ష్మణ్‌, వేణు, ఆది తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని