రూల్స్‌ రంజన్‌ రాకకు వేళాయే..

‘సలార్‌’ వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరున బాక్సాఫీస్‌ బరిలో అదృష్టం పరీక్షించుకునేందుకు పలు చిన్న, మీడియం రేంజ్‌ బడ్జెట్‌ చిత్రాలు వరుస కడుతున్నాయి.

Updated : 05 Sep 2023 05:54 IST

‘సలార్‌’ వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరున బాక్సాఫీస్‌ బరిలో అదృష్టం పరీక్షించుకునేందుకు పలు చిన్న, మీడియం రేంజ్‌ బడ్జెట్‌ చిత్రాలు వరుస కడుతున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణం నుంచి వస్తున్న ‘మ్యాడ్‌’ ఈనెల 28న థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. సోమవారం మరో రెండు చిత్రాలు విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి.


విడుదల కబుర్లు

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా రత్నం కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి సంయుక్తంగా నిర్మించారు. నేహా శెట్టి కథానాయిక. ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. సినిమాని ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ‘ఇంట్రడక్షన్‌ ఆఫ్‌ రూల్స్‌ రంజన్‌’ పేరుతో హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ.. ‘‘ఏడాది క్రితం ఈ సినిమాతో నా ప్రయాణం ప్రారంభమైంది. ఏఎం రత్నం ద్వారా కృష్ణను కలిసి ఈ కథ విన్నా. ఇది వింటున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. రేపు థియేటర్లలో చూసేటప్పుడు ప్రేక్షకులూ అదే అనుభూతి చెందుతారనే నమ్మకం ఉంది. దీంట్లో నేను మనోరంజన్‌ అనే పాత్ర పోషించాను. మనలో ఒకడిలా ఉండే ఆ పాత్రకు అందరూ కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు. ‘‘డీజే టిల్లు’లో రాధిక పాత్ర తర్వాత ఈ సినిమాలో నేను పోషించిన సనా పాత్ర ప్రేక్షకుల్ని మళ్లీ అంతలా మెప్పిస్తుందని నమ్ముతున్నా. ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అంది నాయిక నేహా. ‘‘సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి అమ్రిష్‌ అద్భుతమైన సంగీతమందించారు. కుటుంబసమేతంగా చూడదగ్గ ఈ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకంగా ఉంది’’ అన్నారు నిర్మాత. ‘‘నా గత చిత్రం ‘ఆక్సీజన్‌’కు ఆశించిన ఆదరణ లభించలేదు. దీంతో మంచి వినోదాత్మక చిత్రం చేయాలనుకున్నా. ఆ ప్రయత్నంలో చేసిందే ఈ ‘రూల్స్‌ రంజన్‌’. కుటుంబసమేతంగా థియేటర్లకు వెళ్లి ఆనందించదగ్గ చిత్రమిది’’ అన్నారు దర్శకుడు రత్నం కృష్ణ. ఈ కార్యక్రమంలో దివ్యాంగ్‌ లవానియా, మురళి కృష్ణ వేమూరి, అమ్రిష్‌ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఎం రత్నం ‘హరి హర వీరమల్లు’ సినిమా గురించి స్పందిస్తూ.. ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.


పెదకాపు వస్తున్నాడు

‘నారప్ప’ విజయం తర్వాత దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘పెదకాపు-1’. విరాట్‌ కర్ణ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాని మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించారు. ప్రగతి శ్రీవాత్సవ కథానాయిక. రావు రమేష్‌, నాగబాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో విరాట్‌ వేట కొడవలి పట్టుకొని సీరియస్‌గా చూస్తూ కనిపించారు. అణచివేత, ఘర్షణలు, గ్రామీణ రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రమిది. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యముంది. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంగీతం: మిక్కీ జే మేయర్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని