Akshay Kumar: గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా

‘దిల్‌ సే సోల్జర్‌..దిమాక్‌ సే సైతాన్స్‌’ అంటూ యాక్షన్‌ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’.

Updated : 28 Mar 2024 12:25 IST

‘దిల్‌ సే సోల్జర్‌..దిమాక్‌ సే సైతాన్స్‌’ అంటూ యాక్షన్‌ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. మానుషి చిల్లర్‌, అలయా ఎఫ్‌ కథానాయికలు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్‌తో అదరగొట్టిన సినిమా అంతకుమించి ఉండనుందని అన్నారు అక్షయ్‌. తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.

  • నేను ఒకే రకమైన జానర్‌ సినిమాలకు కట్టుబడి ఉండను. చేసిన చిత్రాలకు విజయం వచ్చినా రాకపోయినా భిన్నమైన జానర్‌లలో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికే ఇష్టపడతా. నా సినీ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఏ అపజయం నన్ను ఆపలేదు. సామజిక అంశాలతో కూడిన సినిమాలు, వినోదం, యాక్షన్‌, కుటుంబ కథా చిత్రాలు..ఇలా ప్రతీ జానర్‌ ప్రయత్నించాను. నాకు కథ నచ్చితే ఏ జానర్‌ అనేది ఆలోచించకుండా నటిస్తా. విభిన్న రకాల సినిమాలు చేస్తూనే ఉంటా.
  • యాక్షన్‌, కామెడీ చిత్రాలు నేను బాగా చేస్తానని ప్రేక్షకులు ఎన్నో సార్లు చెప్పారు. కానీ నేనెప్పుడూ అలాంటి సినిమాలే చేస్తే నాతో పాటు, సినీ ప్రియులు కూడా విసుగు చెందుతారు. కొత్తగా ప్రయత్నించే క్రమంలో ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’, ‘ప్యాడ్‌ మ్యాన్‌’, ‘ఎయిర్‌లిఫ్ట్‌’ లాంటి చిత్రాలు చేశా. ఆ సమయంలో ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నా.  కొందరికి ఆ సినిమాలు నచ్చాయి. అలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నావని కొందరు ప్రశ్నించారు.
  • చిత్రపరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికీ జయాపజయాలు సహజం. నా సినీ ప్రయాణంలోను ఎన్నో చవిచూశాను. నా జీవితంలో వరుసగా పదహారు ఫ్లాప్‌లను చూశాను. అయినా భయపడలేదు. అభిమానులను అలరించేందుకు కష్టపడుతూనే ఉన్నా. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చేసిన సినిమాల్లో ‘బడే మియా ఛోటే మియా’ కూడా ఒక్కటి. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నా కాలికి గాయం అయ్యింది. అయినా షూటింగ్‌ పూర్తి చేశాం. చిత్రబృందం పడిన శ్రమకు ఫలితం ఈ సినిమా విజయమే అని నా అభిప్రాయం.
  • ఈ సినిమా ద్వారా నాకు టైగర్‌ ష్రాఫ్‌ రూపంలో ఓ మంచి స్నేహితుడు దొరికాడు. తనని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఏ సమయంలో ఏది చేయాలో అదే చేస్తాడు. ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ప్రతినాయకుడిగా కనిపించిన పృథ్వీరాజ్‌ చాలా మంచి నటుడు. తనతో పని చేయడం ఎంతో సరదాగా అనిపించింది. మానుషి, అలయా చాలా బాగా నటించారు. ఇద్దరి నటన అద్భుతం. అలీతో కలిసి పని చేయటం గర్వంగా ఉంది.
  • హాలీవుడ్‌లో వచ్చిన ‘బ్యాడ్‌ బాయ్స్‌’ తరహాలో ఉంటుంది ఇందులోని యాక్షన్‌. అందుకు తగ్గ వినోదాన్ని కూడా పంచుతుంది. అలీ ఈ కథ మాకు చెప్పినప్పుడే ఆశ్చర్యపోయాము. ఇందులో పృథ్వీరాజ్‌ కూడా భాగమవుతాడని తెలిశాక మరింత మజా వచ్చింది. మాస్క్‌ ధరించి, కొత్త లుక్‌లో కనిపించే ఈయనతో యాక్షన్‌ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూశాము.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని