జానీ సినిమా హిట్‌ అయి ఉంటే..

పవన్‌కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మార్షల్‌ ఆర్ట్స్‌ ఫిల్మ్‌ ‘జానీ’. రేణు దేశాయ్‌ కథానాయిక. ఈ సినిమా విడుదలైన ఏప్రిల్‌,25 2020 నాటికి

Updated : 25 Apr 2020 18:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మార్షల్‌ ఆర్ట్స్‌ ఫిల్మ్‌ ‘జానీ’. రేణు దేశాయ్‌ కథానాయిక. ఈ సినిమా విడుదలైన ఏప్రిల్‌,25 2020 నాటికి 17ఏళ్లు పూర్తి చేసుకుంది. 2003లో అత్యధికంగా 250 ప్రింట్లతో ప్రపంచవ్యాప్తంగా ‘జానీ’ విడుదలై రికార్డు సృష్టించింది. కానీ, బాక్సాఫీస్‌ వద్ద మాత్రం రాణించలేకపోయింది. పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ విషయాన్ని పవన్‌కల్యాణ్‌ కూడా ఒప్పుకొన్నారు. 

ఒకానొక సందర్భంలో పవన్‌ మాట్లాడుతూ.. ‘‘నేను నటించి దర్శకత్వం వహించిన ‘జానీ’ ఫ్లాప్ అయింది‌. సత్యం ఒప్పుకొని తీరాలి. తప్పించుకుని తిరగడానికి వీల్లేదు. క్రియేటివ్‌ ఫీల్డ్‌లో ఫెయిల్యూర్‌ సహజం. దానికి భయపడకూడదు. వెనక్కి పారిపోకూడదు. అప్పుడు అన్నయ్య చిరంజీవి నాతో ఒక మాట అన్నారు. ‘సరిగ్గా ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది’ అని చెప్పారు. కష్టపడ్డాను కానీ, అది సరైన దారిలో, విధి విధానాలతో కష్టపడలేదేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. అవివేకంతోనో, అజ్ఞానంతోనే ‘జానీ’ చేయలేదు. నాకు తెలిసి ఆ రోజుకు దొరికిన ఆ మార్గాన్ని ఎంచుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. మరో సందర్భంలో పవన్‌ మాట్లాడుతూ.. ‘జానీ’ సక్సెస్‌ అయ్యి ఉంటి సినిమాలు వదిలేసేవాడినని అన్నారు.

ఇక ఈ సినిమా మొత్తం మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. అసలు పవన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవడం వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. ‘‘చిన్నప్పుడు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలంటే అదో రకంగా అనిపించేంది. అవన్నీ నాగబాబు అన్నయ్యకు చాలా ఇష్టం. కాలేజ్‌ చదువుకునే రోజుల్లో రోజుకొక రకంగా గొడవలు జరిగేవి. అప్పుడు అన్నయ్య(చిరంజీవి) సినిమాల గురించి కొందరు వెటకారంగా మాట్లాడేవాళ్లు. అలాంటి వాళ్లను కొట్టాలని అనిపించేది. అయితే నేను చాలా సన్నగా, బక్క పల్చగా ఉండేవాడిని. ఒక వేళ వాళ్లు నన్ను కొడితే వాళ్లను నుంచి నన్ను నేను రక్షించుకోవడం ఎలా అని అనుకునేవాడిని. విపరీతమైన కోపం ఉన్నా, దాన్ని ఎలా చూపించాలో తెలిసేది కాదు. అప్పుడు నాకు కనిపించిన మార్గం మార్షల్‌ ఆర్ట్స్. అవి నేర్చుకుంటే వెళ్లి కొట్టేస్తామని కాదు. మార్షల్‌ ఆర్ట్స్‌ వల్ల గొడవను చూసే విధానం మారిపోతుంది. అందుకే నేర్చుకున్నా. ఇక నా జీవితంలో పూర్తి స్థాయి మార్షల్‌ ఆర్ట్స్‌ సినిమా చేయాలంటే కష్టమే. ఎందుకంటే నేను నేర్చుకున్నది చాలా తక్కువ. ఇంకా అనేకం ఉన్నాయి. అవన్నీ నేర్చుకుని సినిమా చేసే సరికి ముసలివాడిని అయిపోతానేమో’’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు పవన్‌. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఈ సినిమాలో రమణ గోగుల అందించిన పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. జానీ విడుదలై 17ఏళ్లు పూర్తయిన సందర్భంగా రమణగోగుల మాట్లాడుతూ.. నిన్న మొన్నే కూర్చొని జానీకి స్వరాలు సమకూర్చినట్లు ఉందని ట్వీట్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని