9848032919 ఈ నంబర్‌ ఎవరిదో తెలుసా?

మహేశ్‌బాబు కథానాయకుడిగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఒక్కడు’. 2003లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని

Updated : 30 Jan 2021 09:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఒక్కడు’. 2003లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించింది. మహేశ్‌, భూమిక, ప్రకాశ్‌రాజ్‌ల నటన, గుణశేఖర్‌ టేకింగ్‌ సినిమాను నిలబెట్టాయి. ఇక చార్మినార్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు, భూమిక మెడపై కత్తిపెట్టి ప్రకాశ్‌రాజ్‌ నుంచి మహేశ్‌ తప్పించుకునే సన్నివేశాలు హైలైట్‌ అని చెప్పవచ్చు.

ఇక ఇందులో పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌గా ధర్మవరపు సుబ్రహ్మణ్యంను ఆటపట్టించే సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. భూమికను అమెరికా పంపించడానికి పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేస్తారు. దాన్ని తీసుకురావడానికి మహేశ్‌, అతని స్నేహితులు పాస్ట్‌పోర్ట్‌ ఆఫీస్‌కు వెళ్తారు. అక్కడకు వెళ్లేసరికి ధర్మవరపు తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘కొత్తగా సెల్‌ఫోన్‌ కొన్నాను. ఈ సిమ్‌ కార్డులో వినిపించే మొట్టమొదటి వాయిస్‌ నీదే కావాలి. అందుకే సావిత్రిని కూడా కాదని, మొదటగా నీకే ఫోన్‌ చేశా. నెంబరు చెబుతాను రాసుకో.. 9848032919’ అని ఫోన్‌ నెంబరు చెబుతాడు.

అప్పటికే అక్కడకు వచ్చిన మహేశ్‌ పాస్‌పోర్ట్‌ అడిగితే పోస్ట్‌లో పంపిస్తామని ధర్మవరపు సమాధానమిస్తాడు. దీంతో ఆ నెంబరుకు ఫోన్‌ చేసి విసిగిస్తారు మహేశ్‌ అండ్‌ కో. దాంతో కోపం వచ్చిన ధర్మవరపు ఆ ఫోన్‌ను నేలకేసి కొడతాడు. ఇంతలో మళ్లీ మహేశ్‌ అక్కడకు వచ్చి పాస్‌పోర్ట్‌ అడిగి తీసుకుంటాడు. ఇంతకీ ధర్మవరపు చెప్పిన ఆ మొబైల్‌ నెంబరు ఎవరిదో తెలుసా? ఇంకెవరు? ‘ఒక్కడు’ చిత్ర నిర్మాత ఎం.ఎస్‌.రాజుది. ఆ సీన్‌ తీసేటప్పుడు ఎవరి నెంబర్‌ చెబుదామా? అని అనుకుంటుండగా, ఎవరిదో ఎందుకు నిర్మాత ఫోన్‌ నెంబర్‌ ఇస్తే సరిపోతుంది అని ఎవరో సలహా ఇచ్చారట. అలా ఆ సన్నివేశంలో నిర్మాత ఎం.ఎస్‌.రాజు మొబైల్‌ నెంబర్‌ వాడారు. సినిమా విడుదలైన తర్వాత ఆ నెంబర్‌కు కొన్ని లక్షలమంది ఫోన్‌ చేశారట. ఆ బాధ భరించలేక నిర్మాత ఎం.ఎస్‌.రాజు ఆ ఫోన్‌ నెంబర్‌ మార్చుకున్నారట. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని