దర్శకుల యాక్షన్‌.. నటుల ఓవరాక్షన్‌

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లాంటి నటులు దర్శకులకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. వారి తర్వాత దర్శకులకు సలహాలు సూచనలు ఇచ్చే నటులు పెరిగారు.

Published : 21 Jan 2023 15:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తొలి రోజుల్లో సినిమా దర్శకుడంటే గురు భావంతో, భయభక్తులతో ఉండేవారు. దర్శకుడిని ఒక కళాశాల ప్రిన్సిపాల్‌ లాగానో, పెద్ద అధికారిలాగానో చూసేవారు. ‘డైరెక్టర్‌ ఒక కమాండర్‌.. నేను ఒక సోల్జర్‌’ అని అక్కినేని ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన సెట్‌లో ఎప్పుడూ దర్శకుడి వ్యవహారంలో తలదూర్చేవారు కాదు. షాటు కనుక్కొని ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడి, ఏం చెయ్యమంటే అది చేసేవారు. ఏదైనా సందేహం ఉంటే అడిగేవారు. కానీ, ఏదీ డిక్టేట్‌ చేసేవారు కాదు. దర్శకుడు కొత్త వాడైనా సరే, తన ప్రమేయం ఉండేది కాదు. ఆ క్రమ శిక్షణ, విధేయత అలా పాటించేవారు.

ఎన్టీఆర్‌ కూడా అంతే, ఆయనేమిటో, ఆయన నటనేమిటో అంతవరకే చూసుకునేవారు. సొంత చిత్రాలైతే మాత్రం అన్ని వ్యవహారాలు దగ్గరుండి చూసుకునేవారు. దర్శకుడు ఉన్నా, నటులకు యాక్షన్‌ చెప్పడం, డైలాగ్స్‌ చెప్పడం అన్నీ ఆయనే. ఎందుకంటే, కథ, సన్నివేశాలు, పాత్రలు అన్నీ ఆయన మస్తిష్కంలో నిక్షిప్తమై ఉండేవి. కామేశ్వరరావు, యోగానంద్‌ వంటి దర్శకులుంటే షాట్‌ గురించి వారితో మాట్లాడేవారు. కో-డైరెక్టర్‌ హోదాలో ఉన్నట్టుగా దర్శకుడికి సహకరిస్తూనే, అన్ని విషయాలను చూసుకునేవారు.

తదనంతర కాలంలో వచ్చిన హీరోలు, నటులు చాలామంది, దర్శకులకు వాళ్లే షాట్స్‌ గురించి చెప్పేవారు. అలా చెప్పే వాళ్లలో రాజనాల ఒకరు. ఆయనతో పాటు నటిస్తున్న నటులకు ‘ఇలా చెప్పండి డైలాగ్‌’ అంటూ సలహాలు ఇచ్చేవాళ్లు. ఎస్‌.భావ నారాయణ ‘నువ్వానేనా’(1962)లో అనే జానపదం తీశారు. కాంతారావు, దేవిక నాయకనాయికలు. రాజనాల విలన్‌. ఆమంచర్ల శేషగిరిరావు దర్శకుడు. కుర్తాళం దగ్గర అవుట్‌డోర్‌లో గుర్రాలు, సైనికుల షాట్స్‌ తీస్తున్నారు. రాజనాల ‘శేషగిరి రావ్‌! కెమెరా ఇక్కడ పెట్టు.. అక్కడ పెట్టు..’ అని చెబుతూ ఉంటే.. భావ నారాయణ ‘రాజనాలా! ఊరికే కన్‌ఫ్యూజ్‌ చెయ్యకు. నిదానంగా తీయని. నువ్వు షాట్‌లో లేవు కదా! దూరంగా కూర్చో’ అని మందలించారు.

ఒకసారి షూటింగ్‌లో షాటు పూర్తి చేసుకొని గుమ్మడి రుసరుసలాడుతూ బయటకొచ్చారు. ‘డైలాగ్స్‌ ఎలా చెప్పాలో నాకు నేర్పుతున్నాడు’ అన్నారు చిరాగ్గా. వెంటనే పక్కనే ఉన్న హాస్య నటుడు కె.వి.చలం ‘మీకేమిటి సార్‌. నాకు కూడా డైలాగ్స్‌ నేర్పుతున్నాడు’ అన్నారు. అలా అనగానే గుమ్మడి ఒక్కసారిగా నవ్వారు. ఆయన చిరాకు దెబ్బకు మాయమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని