అది పూర్తిగా నా వ్యక్తిగతం: ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

మానసిక ప్రశాంతత కోసమే తాను ఇన్‌స్టా నుంచి కొంతకాలం పాటు బ్రేక్‌ తీసుకున్నానని మలయాళీ భామ ప్రియాప్రకాశ్‌ వారియర్‌ అన్నారు. కొంటెగా కన్నుగీటి ఓవర్‌నైట్‌లోనే స్టారైన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే ఎక్కువమంది..

Updated : 08 Dec 2022 18:29 IST

ట్రోల్‌ చూసి బాధపడ్డా అంటోన్న నటి

తిరువనంతపురం: మానసిక ప్రశాంతత కోసమే తాను ఇన్‌స్టా నుంచి కొంతకాలం పాటు బ్రేక్‌ తీసుకున్నానని మలయాళీ భామ ప్రియాప్రకాశ్‌ వారియర్‌ అన్నారు. కొంటెగా కన్నుగీటి ఓవర్‌నైట్‌లోనే స్టారైన ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దీంతో ఆమె ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, పలు సోషల్ ‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ వేదికగా అభిమానులకు తరచూ అందుబాటులో ఉండేవారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆమె హఠాత్తుగా ఇన్‌స్టా నుంచి వైదొలిగింది. దీంతో ప్రియా అభిమానులు.. ఆమెకు ఏమైందా అని ఆలోచించారు. ఇన్‌స్టాలోకి తిరిగి రావాలంటూ పోస్టులు చేశారు.

కాగా, దాదాపు రెండు వారాల తర్వాత ఆమె మళ్లీ ఇన్‌స్టా వేదికగా అందుబాటులోకి వచ్చారు. సోషల్‌ మీడియా నుంచి బ్రేక్‌ తీసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ‘హాయ్‌ ఆల్‌.. చిన్న విరామం తర్వాత ఇన్‌స్టాలోకి వచ్చేశాను. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్రేక్‌ తీసుకోవడానికి బలమైన కారణమంటూ ఏమీ లేదు. కాకపోతే బ్రేక్‌ తీసుకోవాలనుకున్నా తీసుకున్నా. మానసిక ప్రశాంతత అవసరం అందుకే బ్రేక్‌ తీసుకుని రెండు వారాలు ఎంతో సరదాగా, ప్రశాంతంగా జీవించాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అయితే, ఇన్‌స్టా నుంచి వైదొలిగిన సమయంలో చాలామంది నాపై ట్రోల్స్‌ చేశారు. కామెంట్లు పెట్టారు. వాటిల్లో ఒక ట్రోల్‌ నన్ను ఎంతో బాధపెట్టింది. ‘పబ్లిసిటీ కోసమే ప్రియా ఇన్‌స్టా నుంచి వైదొలిగింది’ అనేది దాని సారాంశం. అది చూసి ఎంతో బాధపడ్డాను. కరోనా వైరస్‌ పరిస్థితుల నుంచి త్వరితగతిన సాధారణ జీవితంలోకి అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరూ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి సమయంలో పబ్లిసిటీ కోసం ఎవరైనా చూస్తారా? ఇలాంటి పోస్టులు పెట్టేవాళ్లకి బుద్ధి లేదా? అనిపించింది’ అని ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని