Kushi: సినిమా అద్భుతం.. అది అంత సులభం కాదు: పరుచూరి

‘ఖుషి’ (Kushi) సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna). సినిమా తనకెంతో నచ్చిందన్నారు.

Published : 14 Oct 2023 10:05 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) - సమంత (Samantha) జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకుడు. విభిన్న కుటుంబ నేపథ్యాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? పెద్దల మనస్తత్వాలను వాళ్లెలా మార్చారు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు పరుచూరి గోపాలకృష్ణ. ఇదొక అద్భుతమైన కథ అన్నారు.

‘‘ఖుషి’ అనగానే విజయ్‌, పవన్‌కల్యాణ్‌ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ప్రేమలో పడటానికి ముందు.. ప్రేమలో ఉన్నప్పుడు.. పెళ్లి అయ్యాక ఒక జంట మధ్య ఎలాంటి గొడవలు వచ్చాయి అనే అద్భుతమైన కథాంశంతో ఈ సినిమా సిద్ధమైంది. ఇదొక పాజిటివ్‌ ఫిల్మ్‌. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సమంత - విజయ్‌ దేవరకొండను మెచ్చుకోవాలి. అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశాలా వారిద్దరూ యాక్టింగ్‌ చేశారు.

Renu Desai: ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. నాకు ఈ అవకాశం వచ్చింది: రేణూ దేశాయ్‌

ఒక అబ్బాయి - అమ్మాయి కథలా ఈ చిత్రాన్ని చెబుతూనే అబ్బాయి తండ్రీ - అమ్మాయి తండ్రీ కథగానూ దీనిని చూపించారు దర్శకుడు. హీరో-హీరోయిన్‌ తండ్రుల మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు చూపించి.. వాళ్ల పెళ్లికి వీళ్లిద్దరూ అంగీకరిస్తారా? అనే ఎలిమెంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్ క్రియేట్‌ చేశారు. తమ ప్రేమ విషయంలో కుటుంబసభ్యులను ఎలా ఒప్పించుకున్నారు అనేది అద్భుతమైన ట్విస్ట్‌గా చూపించారు. ఫస్టాఫ్‌ కామెడీ బాగుంది. నటీనటుల మధ్య చీటింగ్‌ స్క్రీన్‌ప్లే రాశారు. హీరోహీరోయిన్స్‌ మధ్య ప్రేమ డెవలప్‌ కాకపోయి ఉండుంటే అది అన్‌వాంటెడ్‌ డ్రామా అయ్యేది. సెకండాఫ్‌లో కాస్త లాగ్‌ ఉంది. ఇది పెర్ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ ఫిల్మ్‌. సూపర్‌హిట్‌ సినిమా పేరు పెట్టి.. అద్భుతమైన నటనతో ఇలాంటి సినిమా క్రియేట్‌ చేయడం ఒక సవాలు.

ఈ సినిమా కథ చిన్నదే కానీ దాన్ని దాదాపు 2.40 గంటలు నడిపించడం సులభం కాదు. క్లైమాక్స్‌లో పిల్లల కోసం వాళ్ల తండ్రులు మనసు మార్చుకోవడం చూపించారు. దేవుడు ఉన్నాడా? లేదా? అనే అంశంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అదే కథాంశాన్ని మోడ్రన్‌గా ఎలా చూపించవచ్చో దర్శకుడు ఈ సినిమాతో తెలియజేశాడు. అలాగే చిన్న పాయింట్‌పై స్క్రీన్‌ప్లే ఎలా రాయొచ్చో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది’’ అని పరుచూరి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని