మా గడ్డాలకు ఖర్చైనంత ఎవరికీ ఖర్చుకాలేదు

పౌరాణిక‌, జాన‌ప‌ద చిత్రాల్లో మునులు, రుషుల పాత్ర‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. ఈ పాత్ర‌ల‌కు త‌ప్ప‌కుండా గడ్డాలు మీసాలు ఉండాలి. అదే

Published : 26 Jul 2021 16:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పౌరాణిక‌, జాన‌ప‌ద చిత్రాల్లో మునులు, రుషుల పాత్ర‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. ఈ పాత్ర‌ల‌కు త‌ప్ప‌కుండా గడ్డాలు మీసాలు ఉండాలి. అదే విధంగా రాక్ష‌సులు, మాంత్రికుడి వేషాలు వేసే వారు కూడా గంభీరంగా కనిపించడానికి గడ్డాలు, మీసాలు పెట్టుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. ఒక్క నార‌ద మునీంద్రుడి పాత్రే గడ్డం లేకుండా క్లీన్ షేవ్‌తో ఉండేది. ఇలాంటి పాత్ర‌లు వేసే వారికి ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన విగ్గులు, గడ్డాలు, మీసాలు అతికించేవారు. పూర్తిగా గడ్డాలు, మీసాలూ ఉన్న పాత్ర‌లు తాను, సీనియ‌ర్ న‌టుడు నాగ‌య్య ఎక్కువ‌గా ధ‌రించిన‌ట్లు గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావు చెప్పేవారు. రుషులు, మునుల పాత్ర‌లు వాళ్లే ఎక్కువ‌గా వేసేవారు. వ‌సిష్ఠుడు, భృగువు, వాల్మీకి, జ‌మ‌ద‌గ్ని, విశ్వామిత్రుడు లాంటివ‌న్నీ గడ్డాల పాత్ర‌లే. గె‌డ్డం, మీసం అత‌క‌డానికి మాక్స్‌ఫాక్ట‌ర్ వారి గ‌మ్ (బంక‌) ఉప‌యోగించేవారు.

అద‌యితే గ‌ట్టిగా నిల‌బ‌డుతుంద‌ని మేక‌ప్ విభాగం వాళ్లు భావించేవారు. ‘‘మాకు ఖ‌ర్చ‌యినంత గ‌మ్ ఇంకెవ‌ర‌కీ ఖ‌ర్చ‌యి ఉండ‌దు. ఎక్కువ మేమే ఉప‌యోగించాం క‌నుక మాక్స్‌ఫాస్ట‌ర్ వారు మాకు త‌గిన స‌న్మానం చేయాలి. ఈ విష‌యం కంపెనీవారికి రాశాను కూడా’’ అని గుమ్మ‌డి స‌ర‌దాగా చెప్పేవారు. జ‌గ్గ‌య్యకు గ‌డ్డం, మీసం పెట్టుకుంటే అల‌ర్జీ అట‌. అస‌లు అలాంటి పాత్రలు వేయ‌డానికి ఆయ‌నే ఒప్పుకొనేవారు కాదు. అతి క‌ష్టంమీద ‘రేణుకాదేవి మ‌హ‌త్మ్యం’(1960)లో కేఎస్ ప్ర‌కాశ‌రావు బ‌ల‌వంతం మీద ప‌రుశురాముడి పాత్ర ధ‌రించారు. ‘ప్రేమంచి చూడు’(1965)లో జ‌గ్గ‌య్య పాత్ర ఎక్కువ‌గా మారువేషంలో ఉంటుంది. అప్ప‌టికి గ‌మ్ ఉప‌యోగం బాగా త‌గ్గింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని