Jawan: ఆ విషయంలో నయన్‌కు తొలి చిత్రం.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డు.. ‘జవాన్‌’ విశేషాలివీ!

షారుక్‌ ఖాన్‌ నటించిన ‘జవాన్‌’ సినిమా సెప్టెంబరు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు మీకోసం..

Updated : 06 Sep 2023 16:01 IST

ఎప్పుడెప్పుడా అని షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) అభిమానులు, సినీ ప్రియులు ఎదురుచూసిన ‘జవాన్‌’ (Jawan) సెప్టెంబరు 7న (Jawan Release date) విడుదలకానుంది. ఈ సందర్భంగా.. ఈ చిత్రం వారిలో ఎంతో ఆసక్తి రేకెత్తించడానికి కారణాలేంటో చూద్దామా..

  • కొన్నాళ్లపాటు వరుస పరాజయాలు ఎదుర్కొన్న బాలీవుడ్‌కి ‘పఠాన్‌’ సినిమా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఇంతటి హిట్‌ తర్వాత షారుక్‌ తదుపరి ఎలాంటి కథను ఎంపిక చేసుకుంటారు? దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే ప్రశ్నలు అభిమానులను తొలిచేసేవి. ఆ క్రమంలో షారుక్‌ తాను అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నట్లు ప్రకటించడమే ఆలస్యం ఫ్యాన్స్‌లో అంచనాలు మొదలయ్యాయి (Jawan on September 7th).
  • 1992లో కెరీర్‌ని ప్రారంభించిన షారుక్‌ (Shah Rukh Khan) దక్షిణాది చలన చిత్ర పరిశ్రమవారితో కలిసి పనిచేయడం చాలా తక్కువ. అలాంటి ఆయన కోలీవుడ్‌కు చెందిన అట్లీ (Atlee)కి ఛాన్స్‌ ఇవ్వడంతో అందరి దృష్టి నెలకొంది. సౌత్‌ ఇండస్ట్రీ నుంచి షారుక్‌ని డైరెక్ట్‌ చేసిన మూడో వ్యక్తిగా అట్లీ నిలిచారు. అంతకుమందు తమిళ అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ దర్శకత్వంలో షారుక్‌ ‘హే రామ్‌’ (2000), మణిరత్నం డైరెక్షన్‌లో దిల్‌సేలో నటించారు. అట్లీ గత చిత్రాలివీ.. రాజా రాణి, తేరి (పోలీసోడు), మెర్సల్‌ (అదిరింది), బిగిల్‌ (విజిల్‌). సుమారు 13 ఏళ్ల క్రితం షారుక్‌ను చూసేందుకు ముంబయి వెళ్లానని, ఆయన్ను చూడలేకపోవడంతో ఇంటి ముందు ఫొటో దిగి వచ్చానని, అలాంటి తాను ఈ సినిమా కథ వినిపించేందుకు కారులో షారుక్‌ ఇంటికి వెళ్లడం మరిచిపోలేని జ్ఞాపకమని అట్లీ ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.
  • ‘షారుక్‌- అట్లీ కాంబో అదిరింది’ ఓకేగానీ టైటిల్‌ ఏం పెడతారో? అంటూ వేచి చూసిన వారందరికీ 2022 జూన్‌లో సమాధానం లభించింది. అప్పుడే ‘జవాన్‌’ (#Jawan) పేరు ఖరారైంది. సంబంధిత గ్లింప్స్‌లో షారుక్‌ లుక్‌ని రివీల్‌ చేయడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. అప్పటి నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్‌ వారిలో అంచనాలు పెంచింది.
  • ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన షారుక్‌ పలు విభిన్న లుక్స్‌లో కనిపిస్తారు. సౌత్‌ ఇండస్ట్రీలో విశేష క్రేజ్‌ సొంతం చేసుకున్న హీరోయిన్‌ నయనతార (Nayanthara) నటించిన తొలి హిందీ సినిమా కావడంతో ‘జవాన్‌’ మరింత స్పెషల్‌ అయింది. మరోవైపు, బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) ఈ సినిమాలో అతిథి పాత్ర పోషించారు. షారుక్‌- దీపికా జోడీ ఇప్పటికే పలు చిత్రాల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే.
  • ఇందులో కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రతినాయకుడిగా నటించడం మరో విశేషం. ఆయన నటించిన రెండో హిందీ చిత్రమిది. అయితే, తొలి సినిమా ‘ముంబైకర్‌’ ఓటీటీలో విడుదలకావడంతో ‘జవాన్‌’పై ఎన్నో ఆశలతో ఉన్నారు ఆయన అభిమానులు. ‘‘నేను స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించా. కానీ, ఆమెకు షారుక్‌ అంటే అమితమైన ఇష్టం. ఇప్పుడు షారుక్‌ సినిమాలో నేను నటించి ఇన్నేళ్ల తర్వాత ఆమెపై రివెంజ్‌ తీర్చుకున్నా’’ అని సేతుపతి ఓ ఈవెంట్‌లో సరదాగా చెప్పారు. ఈ సినిమాలో ప్రియమణి, సునీల్‌ గ్రోవర్‌, సాన్యా మల్హోత్రా, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంజయ్‌ దత్‌ గెస్ట్‌ రోల్‌ ప్లే చేశారు.

  • షారుక్‌- మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌; అట్లీ- అనిరుధ్‌ కలిసి పనిచేసిన తొలి సినిమా ఇదే. టెక్నీషియన్‌గానే కాదు వ్యక్తిగతంగా అనిరుధ్‌ (Anirudh Ravichander) అంటే తనకెంతో ఇష్టమని ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో షారుక్‌ అన్నారు. అనిరుధ్‌ తన కొడుకులాంటివాడని పేర్కొన్నారు.
  • ఈ చిత్రంలో మల్లయుద్ధం సన్నివేశాలు, గగుర్పొడిచే బైక్‌ స్టంట్‌లు, ఊపిరి బిగపట్టించే కారు ఛేజ్‌లు ఎక్కువగా ఉంటాయట. అంతర్జాతీయంగా పేరున్న స్పిరో రజాటోస్‌, యానిక్‌ బెన్‌, క్రెయిగ్‌ మాక్రే, కిచా కఫడ్గీ, సునీల్‌ రోడ్రిగ్స్‌, అనల్‌ అరసు.. అనే ఆరుగురు స్టంట్‌ మాస్టర్ల ఆధ్వర్యంలో ఆయా సీన్లు చిత్రీకరించారు.
  • ఈ సినిమా చిత్రీకరణ పుణె, ముంబయి, చెన్నై, రాజస్థాన్‌, ఔరంగాబాద్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో జరిగింది. బడ్జెట్‌ సుమారు రూ. 300 కోట్లు.
  • ఈ చిత్ర ప్రచారం సైతం అందరినీ ఆకట్టుకుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలోని షారుక్‌ నివాసం ‘మన్నత్‌’ వద్ద ఈ చిత్రంలోని నటీనటుల లుక్స్‌తో క్రియేట్‌ చేసిన వాల్‌ ఆర్ట్‌ నెట్టింట వైరల్‌ అయింది.
  • ఈ సినిమాకి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. రన్‌టైమ్‌ 2: 49 గంటలు. వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబరు 7న తెలుగు, తమిళం, హిందీలో విడుదలకానుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌కాగా (ప్రపంచ వ్యాప్తంగా) కొన్ని గంటల్లోనే సుమారు 8 లక్షల టికెట్లు (తొలిరోజుకు సంబంధించి) అమ్ముపోయాయంటే షారుక్‌ క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే ఇన్ని టికెట్లు అమ్ముడుపోవడం బాలీవుడ్‌ చరిత్రలో ఇదే తొలిసారి అని పలువురు సినీ విశ్లేషకులు తెలిపారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని