Punch Prasad: నడవలేని స్థితిలో ‘పంచ్‌’ ప్రసాద్‌.. ‘జబర్దస్త్‌’ నటుడికేమైంది?

ప్రసాద్‌కు వచ్చిన సమస్య మందులకు నయమవుతుందా? ఆపరేషన్‌ అవసరం ఉంటుందా? అనే విషయాన్ని పరీక్షల అనంతరం వైద్యులు చెబుతారని నూకరాజు తెలిపారు.

Published : 19 Nov 2022 02:11 IST

హైదరాబాద్‌: ‘నీ పంచ్‌ల వల్ల నా రెండు కిడ్నీలు పోయాయి. నేను ఎవరికైనా చెప్పానా?’ అంటూ వ్యక్తిగత సమస్యతోనూ ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించిన నటుడు ప్రసాద్‌. ‘జబర్దస్త్‌’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ తదితర కార్యక్రమాలతో ‘పంచ్‌’ ప్రసాద్‌ (Punch Prasad)గా మంచి గుర్తింపు పొందిన ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆయన్ను కిడ్నీ సమస్య వేధిస్తుండగా ఇప్పుడు మరో సమస్య తలెత్తింది. దాంతో, ఒక్క అడుగూ వేయలేని పరిస్థితి నెలకొంది. తన అనారోగ్యం గురించి ఇతరులకు చెప్పేందుకు ప్రసాద్‌ ఇష్టపడడని తెలిసిన నూకరాజు (జబర్దస్త్‌ ఫేం) ఈ వివరాలను వెల్లడించారు. ప్రసాద్‌ వద్దూ అంటున్నా.. ఓ వీడియో తీసి, దాన్ని యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశారు. ప్రసాద్‌కు ఆశీస్సులు అందించాలని ప్రేక్షకులు, అభిమానులను కోరారు.

‘‘ఓరోజు షూటింగ్‌ ముగించుకుని వచ్చిన ఆయన జ్వరం వచ్చిందని చెప్పి పడుకున్నారు. లేచిన తర్వాత ఓవైపు నడుము నొప్పి వస్తుందనడంతో వైద్యుడి సలహా తీసుకుని పెయిన్‌ కిల్లర్‌ ఇచ్చా. మరుసటి రోజు డయాలసిస్‌కు వెళ్లారు. వచ్చాక విశ్రాంతి తీసుకున్నారు. ఫీవర్‌, నడుము నొప్పి ఇంకా తగ్గకపోవడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. సంబంధిత డాక్టర్లు అన్ని పరీక్షలు చేసినా నొప్పి ఎందుకొస్తుందో వారికే అర్థంకాలేదు. కొన్ని రోజులు మెడిసన్‌ వాడినా ఫలితంలేదు. చివరకు ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌లో సమస్య ఏంటో బయటపడింది. నడుము వెనక భాగం నుంచి కాలి వరకు చీము పట్టింది’’ అని ప్రసాద్‌ భార్య వీడియోలో తెలిపారు. ‘‘డయాలసిస్‌ చేయించుకునే రోగుల్లో నెమ్మదిగా ఇలాంటి సమస్యలు వస్తాయట. టెస్ట్‌ చేసిన తర్వాత అది ముందులతో నయమవుతుందా? ఆపరేషన్‌ అవసరమా? అనే విషయాన్ని డాక్టర్లు చెబుతామన్నారు’’ అని నూకరాజు తెలిపారు. కొన్నాళ్ల నుంచి ప్రసాద్‌ కిడ్నీ సమస్యలతో బాధపడతున్నారు. దాన్ని పంటిబిగువన భరిస్తూ పలు స్కిట్‌లు చేసి, ఎంతోమందిని నవ్వించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని