James bond: అదృశ్య కారు.. కెమెరా ఉంగరం.. గాడ్జెట్స్‌లో బాండ్‌ గాడ్జెట్సే వేరయా!

జేమ్స్‌బాండ్‌ విన్యాసాల్లాగే ఆయన వాడే పరికరాలూ పవర్‌ఫుల్‌గా ఉంటాయి.

Updated : 23 Nov 2022 11:43 IST

జేమ్స్‌బాండ్‌ విన్యాసాల్లాగే ఆయన వాడే పరికరాలూ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. శత్రువులను మట్టుబెట్టేందుకు, వారి నుంచి తప్పించుకునేందుకు, రహస్యాలను బట్టబయలు చేసేందుకు ఆయన వాడే పరికరాలు, గాడ్జెట్స్‌ ప్రేక్షకులను సంభ్రమాశ్చారాల్లో పడేస్తాయి. ఈనెల 30న బాండ్‌ 25 మూవీ ‘నో టైమ్‌ టు డై’ విడుదల సందర్భంగా గతంలో జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో ఉపయోగించిన ఆ ప్రత్యేకమైన గాడ్జెట్స్‌ ఏంటో ఓసారి చూద్దాం. 

ఆయన కార్లే సెపరేటు..!

 జేమ్స్‌బాండ్‌ కార్లు కేవలం రోడ్ల మీద మాత్రమే కాదు నీటిలోనూ దూసుకెళ్తాయి. మంచుపైనా పరుగులు పెడతాయి. ప్రాంతానికి తగినట్లుగా నంబర్‌ ప్లేట్లు మార్చుకుంటాయి. అవసరమైతే బుల్లెట్ల వర్షం కురిపిస్తాయి. నేల మీది నుంచే గాల్లో వెళ్లే హెలికాప్టర్లను పేల్చేస్తాయి. లేజర్‌తో శత్రువుల కార్లను ముక్కలు చేస్తాయి. ఇలాంటి ప్రత్యేకతలున్న కార్లతోనే అందరిని అభిమానులుగా మార్చుకున్నాడు జేమ్స్‌బాండ్‌.  ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఆస్టన్‌ మార్టిన్‌ కార్‌ కూడా ప్రత్యేకమైందే. 

అదృశ్య వాహనం

జేమ్స్‌బాండ్‌ వాడిన కార్లన్నింటిలోనూ  ‘డై అనదర్‌ డే’లోనిది మరింత ప్రత్యేకమైంది.  అందులో పియర్స్‌ బ్రాస్నన్‌ ఎవరికీ కనిపించని అదశ్య వాహనాన్ని నడుపుతాడు. కంటికి కనిపించకపోవడమే దీని ప్రత్యేకత. మంచు ఎడారిలో దూసుకెళ్తూ జేమ్స్‌బాండ్‌ చేసే పోరాటాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు.  శత్రువులకు చిక్కకుండా  గడ్డకట్టిన మంచునేలపై  రయ్‌ రయ్‌మని  వెళ్తుంటే భలే మజాగా అనిపిస్తుంది.

బాండ్‌కి మాత్రమే పేలే తుపాకీ 

‘స్కైఫాల్‌’ సినిమాలో బాండ్‌కోసం ఓ ప్రత్యేకమైన తుపాకిని ఇస్తారు. దాంతో దుండగుల భరతం పట్టమని పంపిస్తారు.  జేమ్స్‌బాండ్‌  వేలి ముద్రలతో మాత్రమే పనిచేసేలా ప్రత్యేకంగా రూపొందిస్తారు.  డేనియల్‌ క్రెగ్‌ దాన్నిఎక్కడా ఉపయోగించడు కానీ,  ఓ చోటా విలన్‌ చేతికి చిక్కుతుంది. కానీ ఏం లాభం ఎంత పేల్చిన పేలదు. అందులోని మర్మం ఆ విలన్‌కు తెలియక చివరికి బాండ్‌కి బలైపోతాడు. 

కెమెరా ఉంగరం

వేలికి పెట్టుకొనే ఉంగరాన్ని కెమెరాగా మార్చేసి శత్రువుల పనిపడతాడు బాండ్‌.  రోజర్‌ మూర్‌ నటించిన ‘ఏ వ్యూ టు ఏ కిల్‌’(1985)లో దీన్ని వాడి అక్కడ జరిగే తతంగాన్ని రహస్యంగా పై అధికారులకు చేరవేస్తాడు. 40 ఏళ్ల క్రితమే ఇలాంటి సాంకేతికతను వాడి తానేంత ముందు చూపున్న హీరో అనేది తెలియజేశాడు జేమ్స్‌బాండ్‌. 

సిగరెట్‌ గన్‌.. సైనెడ్‌ సిగరెట్‌

పొగరాయుళ్లకు సిగరెట్‌ ఇస్తే గుప్పుగుప్పుమని పీల్చేసి పక్కన పడేస్తారు. మన బాండ్‌ అలా కాదు. సిగరెట్‌ ఇస్తే దాన్ని తుపాకీగా మార్చి విలన్లను మట్టుబెడతాడు. ఆశ్చర్యంగా ఉందా?  ‘యూ ఓన్లీ లైవ్‌ ట్వైస్‌’ సినిమాలో ఉంటుందీ సన్నివేశం.   సిగరెట్‌ గన్‌తో విలన్‌ను కాల్చిపడేస్తాడు.   చంపడానికి మాత్రమే కాదండోయ్‌, ఆత్మహత్యకూ సైనెడ్‌ సిగరెట్‌ను వాడారు‌. తొలిచిత్రం ‘డాక్టర్ నో’లో ఓ చోట విలన్‌ బాండ్‌కు దొరికి, తప్పించుకోడానికి శతవిధాల ప్రయత్నించి విఫలమౌతాడు. చివరకు ఓ సారి సిగరెట్‌ పీల్చే అవకాశమివ్వమని బాండ్‌ను కోరి సిగరెట్‌ వెలిగిస్తాడు. కానీ, అది సిగరెట్‌ కాదు. అలా కనిపించే సైనెడ్‌. దాన్ని మింగి అక్కడిక్కడే మరణిస్తాడు విలన్‌. హత్యకు, ఆత్మహత్యకు  ఉపయోగించిన సిగరెట్‌ ప్రాణాంతకమని బాండ్‌ చెప్పకనే చెప్పేశాడు. మరో సినిమాలో సిగరెట్‌ బాంబును కూడా ఉపయోగిస్తాడు‌. 

సాయుధ సూట్‌కేస్‌

సుట్‌కేసులో మనమైతే ఏం పెట్టుకుంటాం. దుస్తులు లేదా ముఖ్యమైన ధ్రువపత్రాలను దాచుకొంటాం. లేడీస్‌ అయితే అదనంగా మేకప్‌కిట్‌లాంటివి పెట్టుకుంటారు. మనబాండ్‌ అందుకు విరుద్ధం. దాన్ని మారణాయుధాలను దాచుకునేందుకు వాడతాడు  తూటాలు పేల్చే తుపాకీ, కత్తులు విసిరే సాధనం, మందుగుండు సామాగ్రి, ఇంకా బంగారు నాణేలు దాచుకున్న పెట్టె ఇలా అన్ని రకాలుగా దాన్ని వినియోగిస్తాడు. సకల సౌకర్యాలుండే ఇలాంటి ప్రత్యేకమైన సూట్‌కేస్‌ను చాలా సినిమాల్లో వాడతాడు బాండ్‌. 

కారులోనే ఫోన్

ఇప్పుడంటే మనకు స్మార్ట్‌ఫోన్‌లొచ్చాయి. ఆ కాలంలో ల్యాండ్‌ఫోన్‌లే గతి.  కారుకు అలాంటి ఫోన్‌ని అమర్చుకొని ఎక్కడికంటే అక్కడికి దూసుకెళ్తాడు బాండ్‌. సీన్‌ కానరీ బాండ్‌గా నటించిన ‘ఫ్రమ్‌ రష్యా విత్‌ లవ్‌’ అనే సినిమాలో ఇలాంటి కార్‌ ఫోన్‌ వాడాడు.  ఇలాంటి అరుదైన వస్తువులు సినిమాల్లో చూపించి తానెంత ప్రత్యేకమో చాటుకున్నాడు. 

మొసలి నౌక... సముద్ర పక్షి

‘ఆక్టోపస్సీ’ సినిమాలో రోజర్‌ మూర్‌ మొసలి నౌకలో తెలివిగా తప్పించుకునే తీరు  ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది. మొసలి ఆకారంలో కనిపించే చిన్నపాటి సబ్‌మైరెన్‌ లాంటి వాహనమది. దానిలోపల దాక్కుని నీటి మీద తేలుతూ బయటపడతాడు మన బాండ్‌. భలే ఉంది కదా! ఇలాంటి ప్రయోగమే ‘గోల్డ్‌ ఫింగర్‌’లో చేసి ఆశ్చర్యపరిచాడు బాండ్‌. హాలీవుడ్‌ చరిత్రలో వంద మిలియన్‌ డాలర్లను దాటిన మొదటి సినిమా అది. ఇందులో బాండ్‌ శత్రు శిబిరానికి చేరుకునేందుకు వినూత్న పంథాను ఎంచుకుంటాడు. స్కూబా డ్రెస్‌కి  పక్షిబొమ్మను అమర్చుకొని ఈదుకుంటూ వెళతాడు బాండ్‌.  నీటి మీద సముద్ర పక్షి వెళుతందనిపించేలా దుండగుల కళ్లు కప్పి శత్రు శిబిరానికి వెళ్లే తీరు కేరింతలు కొట్టిస్తుంది.  

మణికట్టు తుపాకి

మారణాయుధాలను వాడకుండా శత్రువులను చంపగలిగే శక్తి ఉన్న సూపర్‌ హీరో మన బాండ్‌. ఆయన వాడే ఆయుధాలు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి. దుండగులను మట్టుబెట్టడానికి సిగరెట్‌, సూట్‌కేసులను ఎలా వాడుకున్నాడో చదువుకున్నాం కదా... అలాంటిదే ఈ మణికట్టు తుపాకీ. మణికట్టుకి ఓ గడియారం పెట్టుకున్నట్లుగా ఉండే ఈ ప్రత్యేకమైన తుపాకితో అనుమానం రాకుండా పేల్చి పడేస్తాడు. బాండ్‌ అనుకుంటే దేన్నైనా ఆయుధంగా మార్చుకోగలడు మరి. 

కత్తుల గొడుగు - ఫర్‌ యువర్‌ ఐస్‌ ఓన్లీ(1981)

ఎక్స్‌రే కళ్లద్దాలు- ది వరల్డ్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌(1999)


టేప్‌రికార్డ్‌ కెమెరా-  టు రష్యా విత్‌ లవ్‌(1963)


టీవీ వాచ్‌- ఆక్టోపస్సీ(1983)


పెన్‌ బాంబ్‌ - గోల్డెన్‌ ఐ


సిగరెట్‌,టూత్‌పేస్ట్‌ బాంబ్‌ - లైసెన్స్‌ టు కిల్(1989)


రేడియో చీపురు - లైసెన్స్‌ టు కిల్(1989)]


రోబో కుక్క - ఏ వ్యూ టు ఏ కిల్


జెట్‌ప్యాక్‌ -  థండర్‌బాల్‌(1965)

లేజర్‌ వాచ్‌ - నెవర్‌ సే నెవర్‌ ఎగైన్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని